రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ట వయోపరిమితి అంశం మరోసారి ప్రధానంగా చర్చకు దారితీస్తున్నది. కరోనా ప్రభావం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం వయో పరిమితిని పెంచినప్పటికీ, ఆ గడువు ముగిసిన తరువాత కొత్తగా వయస్సు సడలింపు ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగులకు కాంగెస్ ఎన్నో ఆశలు చూపించింది. ఆ హామీల అమల్లో జరుగుతున్న జాప్యం వల్ల్ల నిరుద్యోగుల ఆశలు, ఆందోళనలు, న్యాయమైన డిమాండ్లు ఇపుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కరోనా ప్రభావం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెం.42 ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితిని 34 నుంచి 44 సంవత్సరాలకు పెంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 ఫిబ్రవరి 8న జీవో 30 ద్వారా మరో రెండేండ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 46 ఏండ్లకు పెరిగింది. అయితే, ఆ జీవో గడువు 2026 ఫిబ్రవరి 8తో ముగిసింది. రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇంతవరకు కొత్త జీవో జారీ చేయలేదు.
ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ఉద్యోగాలకు 34 ఏండ్ల గరిష్ట వయస్సు మాత్రమేనని స్పష్టంగా పేర్కొన్నది. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ రెండున్నరేండ్ల కాలంలో కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే నింపింది. ప్రైవేటు రంగంలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కనీసం గరిష్ట వయస్సు నిబంధనను కూడా సడలించడం లేదు.
34 సంవత్సరాల తరువాత నిరుద్యోగులు ఏంచదువుతారని, ఏండ్లకొద్దీ పుస్తకాలతో టైంవేస్ట్ చేస్తున్నారని కొందరు ఐఏఎస్లు సెలవిస్తున్నారట. కానీ వారికి అర్థం కాని విషయం ఏమిటంటే..గతంలో నిర్వహించిన గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్లో మహిళలు 35 సంవత్సరాలు దాటిన వారు 50 శాతం ఉండటం గమనార్హం. వాస్తవానికి చదువుకు, వయసుకు సంబంధం లేదు. ఉదాహరణకు నోబుల్ బహుమతులు పొందేవారంతా 60 ఏండ్లకు పైబడినవారే ఉంటున్నారన్నది ఐఏఎస్లకు బోధపడని అంశం. డైట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి 1997లో నోటిఫికేషన్ రాగా డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీకి 2008లో నోటిఫికేషన్ వచ్చింది. డీఎల్ నోటిఫికేషన్ 2011లో రాగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పోస్టులకు నోటిఫికేషన్లు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇయర్ క్యాలెండర్ ప్రకటించాలి, ప్రైవేటు రంగంలో స్థానికతను అమలు చేయాలి, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి, నిరుద్యోగ పాలసీ ప్రకటించాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి తప్పనిసరిగా 34 నుంచి 46 సంవత్సరాలకు పెంచాలి. రానున్న రోజుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసే నోటిఫికేషన్లకు వయోపరిమితి సడలింపు కచ్చితంగా అమలు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నది.
(వ్యాసకర్త: నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు)
-పాలకూరి అశోక్ గౌడ్