అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై అతి త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అంతకంతకూ వివాదాస్పదం అవుతున్నాయి. దేశాల మధ్య సంబంధాల్లో ఉండే దౌత్యపరమైన గౌరవాలు, మర్యాదలు బేఖాతరుకు గురవుతున్న పోకడలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ధోరణి నిజానికి మొదటి నుంచీ సంప్రదాయాలకు భిన్నంగానే ఉంటున్నది. అది ఇప్పుడు దుందుడుకు, దుస్సాహసిక వాగ్ధాటితో మరింతగా శ్రుతి మించుతున్నదని చెప్పక తప్పదు. ట్రంప్ విస్తరణవాద తరహాలో మాట్లాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా పొరుగు దేశమైన కెనడాను 51వ రాష్ట్రంగా కలిపేసుకుంటామని ట్రంప్ బాంబు పేల్చారు. కెనడాకు అమెరికా సైనికంగా, ఆర్థికంగా చాలా సాయం చేస్తున్నదనీ, అందుకు బదులుగా ఏమీ పొందడం లేదనీ అంటున్నారు. కెనడాను కలిపేసుకునేందుకు ‘ఆర్థిక శక్తి’ని ఉపయోగిస్తామనీ చెప్తున్నారు. కెనడా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ పెంచుతామనీ బెదిరిస్తున్నారు. దీనిపై కెనడాలో సహజంగానే గగ్గోలు బయలుదేరింది.
ఇదిలా ఉండగానే పనామా కాలువ చార్జీలు ఎక్కువగా ఉంటున్నాయనీ, ఆ నౌకా మార్గాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందనీ మరో దౌత్య వివాదానికి ట్రంప్ తెరతీశారు. ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనలు కొంత హాస్యాస్పదంగానూ ఉంటున్నాయి. ట్రంప్ ప్రకటనలు కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ వ్యవహారం. ప్రస్తుతం డెన్మార్క్‌లో స్వయంపాలిత ప్రాంతంగా ఉన్న ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సైనికచర్య ఉపయోగించే అవకాశాన్ని కాదనలేమనీ అంటుండటమే అసలు సమస్య.
యూరప్‌లో పలుకుబడి కలిగిన జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు దీనిపై ప్రతికూలంగా స్పందించాయి. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా పరస్పర సార్వభౌమాధికారాన్ని గౌరవించుకోవాలని జర్మనీ చాన్సలర్ హితవు చెప్పడం గమనార్హం. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో జర్మనీ, ఫ్రాన్స్ కీలక సభ్య దేశాలనేది తెలిసిందే. అటు డెన్మార్క్ కూడా గ్రీన్ ల్యాండ్‌పై తుది నిర్ణయాధికారం అక్కడి ప్రజలదేనని ట్రంప్ ప్రకటనను ఖండించడం వివాదం ముదరడాన్ని సూచిస్తున్నది. నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకునే ప్రతిపాదనలపైనా ట్రంప్ నీళ్లు చల్లారు. తన పక్కలో బల్లాన్ని రష్యా ఎందుకు అంగీకరిస్తుందని ఆయన చేసిన ప్రకటన అమెరికాలోని ఆయన సమర్థకులను సైతం విస్మయానికి గురిచేసింది. దేశాలను, ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం గురించే కాకుండా భౌగోళికంగా సుప్రసిద్ధమైన పేరు మార్పిడి మీద కూడా ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. మెక్సికో అఖాతం పేరు అమెరికా అఖాతంగా మార్చాలని సంచలనం కలిగించారు. పరిపాలన పగ్గాలు చేపట్టక ముందే ధోరణి ఇలా ఉంటే తర్వాత ఇంకెలా ఉంటుందోనని ట్రంప్ గుబులు పుట్టిస్తున్నారు. ఇప్పటికే అనేక యుద్ధాలతో, ఘర్షణలతో ప్రపంచం కునారిల్లుతున్నది. తీవ్ర పర్యవసానాలకు దారితీసే విషయాలపై ట్రంప్ అలవోకగా ప్రకటనలు చేస్తుండటం విశ్వశాంతికి విపత్కరమని చెప్పక తప్పదు. ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించాల్సిన ఏకైక అగ్రరాజ్యం ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.