మానవ సమాజం నిర్మించుకున్న సంస్కృతి.. కాలంతోపాటు ప్రయాణిస్తూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ప్రతీ ఆర్థిక, సాంస్కృతిక అంశం ఎదుగుతూ, రూపం మార్చుకుంటూ ఏదో ఒక రకంగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ మన ఇండ్లల్లో పుట్టుక నుంచి మరణం వరకు చేసే పూజలు, క్రతువులూ, తంతులలో రాతియుగం నుంచి నేటి వరకు ఏదో ఒక రూపంలో కొనసాగింపు కనిపిస్తూనే ఉంటుంది. బృహత్ శిలా యుగపు సమాధులే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటికి బౌద్ధ స్తూపాలైనాయి. సమాధులపై నిలిపిన నిలువు రాళ్లు (‘మెన్హిర్’లు) తర్వాతి కాలంలో వీర శిలలై, ఇప్పటికీ మనం అమరుల స్మరణ కోసం ఏర్పాటు చేసే అమరుల స్తూపాలుగా రూపాంతరం చెందాయి.
కొత్త రాతియుగంలో చివరి ఘట్టమైన బృహత్ శిలా యుగం నాటికి మానవులు రాతి పనిముట్ల దశ నుంచి దాటి వ్యవసాయంలో మిగులు, కుండల తయారీ, లోహాల పరిజ్ఞానం, నిర్మాణ రీతులలో మొదటి దశను చేరుకున్నారు. లోహ పరిజ్ఞానం.. తొలుత రాగి ఆ తర్వాత ఇనుము మన ముందడుగుకు బాటలు వేసినయి. సమాధుల నిర్మాణంలో కూడా ఒక పద్ధతి, సమాధులలో నిర్దిష్ట దిశలో మృతదేహాల అమరిక- ఇవన్నీ మానవ మేధస్సులో జరుగుతున్న మార్పునకు సంకేతాలు. అందుకే ఈ కాలం మానవ పరిణామంలో మొదటిసారి ఒక వైజ్ఞానిక అంశాన్ని, ఒక కళాత్మక సృజనను ముందుకు తెచ్చింది.
ఆకాశమే హద్దుగా మొదలైన శోధన: మైక్రోసాఫ్ట్ విండోస్ ఉన్న కంప్యూటర్లపై బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌గా ఇంగ్లండ్‌లోని ‘స్టోన్ హెన్జ్’.. అంటే వృత్తాకారంలో నిలిపిన నిలువు రాళ్లున్న ఫొటో ఉంటుంది. ఇది ఇంగ్లండ్ చారిత్రక చిహ్నంగా, యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. సమాధుల మధ్య నిలిపిన ఈ రాళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఏటా సూర్యుడు భూమి నుంచి అత్యంత దూరంలో ఉండే జూన్ 21న వచ్చే సూర్యోదయానికి అనుసంధానం చేసి ఈ రాళ్లను నిలిపారు. ఇప్పటికి ఐదు వేల ఏండ్ల క్రితం నాటి మానవ మేధస్సుకు, నాటి ఆలోచనలకు రూపం ఇది. దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు, ఆదరణ, సంరక్షణ దొరికింది.
సరిగ్గా ఇలాంటి ఒక ప్రాచీన ఖగోళ అద్భుతం ఇంకా ఉన్నతమైన ఆధారాలతో తెలంగాణలో ఉన్నది. నారాయణపేట జిల్లాలో కృష్ణ మండలంలోని ‘ముడుమాల’.. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ పొలాల మధ్య ఉన్న నిలువురాళ్లు ఇంగ్లండ్‌లోని ‘స్టోన్ హెన్జ్’కు ఏమాత్రం తీసిపోవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది కొత్త రాతియుగంలో అంటే ఇప్పటికి సుమారు 4 వేల ఏండ్ల కిందటే ఏర్పాటైన అంతరిక్ష పరిశోధనల వేధశాల. మధ్యయుగంలో జైపూర్‌లో, ఢిల్లీలో కట్టిన జంతర్ మంతర్ వంటిదే ముడుమాలలో ఉన్న ‘మెన్హిర్’లు. ఇలాంటి ప్రత్యేక అమరికతో ఉన్న రాళ్లు, మెన్హిర్లు కర్ణాటకలోని నిలస్కల్, విభూతిహళ్లి, హనంసాగర్, హెరొద్రం లలో ఉన్నప్పటికీ ముడుమాల విశిష్టత కలిగినది.
ఇక్కడ ఉన్నన్ని నిలువురాళ్లు, బండపై సప్తర్షి మండల చిత్రం దేశంలో మరెక్కడా దొరకలేదు. అంతేకాదు మిగతా స్థలాలు ముడుమాల అంతటి ప్రాచీనమైనవి కావు. నాడు ఇక్కడ నివసించిన ప్రజలు చుక్కల్ని లెక్క పెట్టిన వాళ్లు, నక్షత్ర సముదాయాన్ని రాతి మీద చెక్కి ఆకాశ రహస్యాల్ని ఛేదించే కృషి మొదలు పెట్టిన వాళ్ళు! సౌరగతిని రికార్డు చేస్తూ, పాతిన నిలువు రాళ్ల నీడలను చూసి కాలగమనాన్ని, రుతువులను అర్థం చేసుకున్న వాళ్ళు!!
ముడుమాలలో ఏముంది?: ముడుమాలలో కృష్ణా నది ఒడ్డున ఉన్న పొలాల మధ్య రాతి తోట లాగా కనిపించే స్థలం మన చరిత్రకు సంబంధించిన రహస్యాలను దాచుకున్న అపురూప ప్రాంతం. సుమారు ఏడు ఎకరాల స్థలంలో వ్యాపించి ఉన్న ఈ ప్రదేశంలో సుమారు 12 నుంచి 14 అడుగుల పొడవున్న 80 నిలువురాళ్ళు ఒక పద్ధతిలో అమర్చినట్టుగా ఉన్నాయి. వీటితోపాటు ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తున్న సుమారు 2,000 రాళ్లు ఒక క్రమ పద్ధతిలో అమర్చినట్టుగా ఉన్నాయి. ఈ మొత్తం ఆవరణ ఒక వేధశాల. కొత్త రాతియుగపు తొలి రోజుల్లోనే అంటే క్రీస్తు పూర్వం 2,000 నాటి నుంచి 1,000 మధ్య కాలంలో నాటి ప్రజలు ఏర్పాటు చేసిన ఈ రాతి క్రమం.. దేశంలోనే అంతరిక్ష పరిశీలన చేసిన ప్రత్యేకమైన వేధశాల. అంతే కాదు ఇక్కడే ఒక బండపై.. ఆకాశంలో మనకు కనిపించే సప్తర్షి మండల చిత్రం కూడా గుంతల (కప్ మార్క్స్) రూపంలో చెక్కి ఉంది.
మొదట ఈ ప్రాంతాన్ని 1956లో ఎఫ్.ఆర్.అల్చిన్ గుర్తించారు. నాలుగు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ చరిత్ర శాఖ ప్రొఫెసర్ కేపీ రావు ముడుమాలలో చేసిన పరిశోధన, రాసిన పత్రాలు దీనికి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి కారణమయ్యాయి. ఆ తర్వాత నుంచి మెగాలితిక్ ఆస్ట్రానమీ అంటే బృహత్ శిలాయుగపు ఖగోళ శాస్ర్తానికి ముడుమాల ఒక మ్యూజియంగా మారింది.
సౌరగతిని చూపే క్యాలెండర్లు నిలువు రాళ్లు: ఇక్కడ కొన్ని నిలువురాళ్ల వరుసలు జూన్ 20-21 వేసవిలో వచ్చే సౌర ఆయనాంతం (summer solstice), 21-22 డిసెంబర్ నాడు వచ్చే చలి కాలపు సౌర ఆయనాంతం (winter solstice) నాడు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఒకే వరుసలో ఉంటాయి. ఆనాటి ప్రజలు ఈ రాళ్లను సౌరగతిని సునిశితంగా పరిశీలించే ఈ క్రమంలో ఏర్పాటు చేసి ఉంటారు. దీంతో సౌర సంచారం, రుతువుల మార్పుల క్రమాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుని జీవన క్రమాన్ని క్రమబద్ధం చేసుకున్నారు. రుతువులపై ఆధారపడ్డ వ్యవసాయానికి ఈ నిలువురాళ్లు ఒక క్యాలెండర్ లాగ ఉపయోగపడి ఉంటాయి. అంతేకాదు, నాడు ఎదుగుతున్న సంస్కృతిలో భాగమైన పండుగలూ, పబ్బాలు వంటి వాటికి కూడా ఇదే ఆధారం అయి ఉండొచ్చు.
బండపై సప్తర్షి మండలం: ఆనాటి ప్రజలు సూర్యుడిని, చుక్కల్నీ ఎందుకు చూసే వాళ్లు? గ్రీకు మైథాలజీ, భారత ఖగోళశాస్త్రం చెప్పిన నక్షత్ర రాశి సప్తర్షి మండలం (ఉర్సా మేజర్)ను నాటి ప్రజలు ఒక బండరాయిపై చెక్కి, దాని ఆధారంగా అనాదిగా మనిషికి దిక్కు చూపిస్తున్న వేగుచుక్క వంటి వాటిని గమనించేవారు. ఆధునిక ఖగోళశాస్త్రం చెప్పే ‘ఉర్సా మేజర్’లోని రెండు నక్షత్రాలు మెరక్ (పులస్త్య), దుభే (క్రతు)ల దిశను గుర్తించేవాళ్లు. ఈ రెండు నక్షత్రాల సాయం తో వేగుచుక్క (ధ్రువ నక్షత్రం లేదా ఉత్తర నక్షత్రం అని కూడా అంటారు) ద్వారా ఉత్తర దిక్కును గుర్తించేవాళ్లు. అయస్కాంత దిక్సూచి లేని కాలంలో ఈ బండ మీది సప్తర్షి మండల చిత్రమే వారికి దిక్సూచిగా ఉండింది. దేశంలోనే ఇలాంటి చరిత్ర పూర్వ యుగపు స్కై మ్యాప్ ఉన్న ఏకైకస్థలం ముడుమాల. ఇలాంటి మరో ఆధారం దక్షిణ కొరియాలో మాత్రమే ఉన్నది.
ఇన్ని వేల ఏండ్లు ఈ నిలువురాళ్లు నిశ్శబ్ద సైనికుల్లా మన చరిత్రకు పహారా కాస్తూ ఉన్నాయి. కానీ పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న వ్యవసాయం, మానవ జోక్యం ఈ పురాతత్వ అద్భుతానికి ఏదో ఒక రోజు నష్టం చేసే ప్రమాదం ఉన్నది. ఏడు ఎకరాల్లో విస్తరించిన ఈ బృహత్ శిలాయుగ స్థలంలో ఇప్పటికే సగభాగంలో శిలలు స్థానభ్రంశం చెందాయి. రాష్ట్ర ప్రభుత్వ హెరిటేజ్ శాఖ మూడున్నర ఎకరాల స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. ఇది మాత్రమే సరిపోదు. దీన్ని చట్టప్రకారం సంరక్షిత స్థలంగా ప్రకటించి అభివృద్ధి చేస్తే కానీ తెలంగాణలో ఉన్న ఈ అద్భుత ప్రాచీన చరిత్ర తాలూకు ఆధారం బయట ప్రపంచానికి తెలియదు.
సమాధులు ఆత్మలకు విశ్రాంతి గృహాలైతే, సమాధిరాళ్లకు చేసిన గుండ్రటి రంధ్రాలు ఆత్మలకు మార్గంగా ఏర్పాటు చేయటంలా, రాళ్లను మానవాకృతులుగా మలచడం.. సృజనాత్మకతకు ప్రతీకగా కనిపిస్తుంది. ఇక మృతుల గౌరవ చిహ్నంగా నిలువురాళ్లను వైజ్ఞానిక అంశాలతో జోడించడం మానవ మేధస్సు ఎదుగుతున్న క్రమాన్ని సూచిస్తుంది. తెలంగాణ నేల మీద వికసించిన మానవ మేధస్సుకు ప్రతీక ముడుమాలలోని ఈ బృహత్ శిలా యుగపు వేధశాల.
తొలి శిల్ప సృజన
మన చరిత్రలోనే తొలినాళ్ల శిల్పాలలో సమాధి రాళ్లపై చెక్కిన మానవాకృతులు మొదటివి. సిద్దిపేట జిల్లా నర్మెటలో 40 టన్నుల రాతికి సైతం మానవ ఆకృతిని కల్పించి సమాధి రాయి (క్యాప్ స్టోన్)గా అమర్చారు. ఇక ఖమ్మం జిల్లా జానంపేట ప్రాంతంలో జానంపేట, పడుగోనిగూడెం, మిడిమల్ల వంటి స్థలాల్లోని సమాధుల్ని చూస్తే ఆ ప్రాంతం తొలినాళ్ల శిల్పాగారమా అనిపిస్తుంది. స్త్రీని ఖననం చేసిన గుర్తుగా చెక్కిన స్త్రీ ఆకృతిని తెలంగాణలోని మొదటి స్త్రీ శిల్పంగా గుర్తించాలేమో! ఆడ, మగ తేడాల్ని సమాధి రాళ్ల మీద చూపడం, రాతిని మానవాకృతిలో చెక్కడం.. తొలినాళ్ల శిల్పరీతికి తార్కాణం. ఈ సమాధులే మనకు వేల ఏండ్ల కిందటి వాస్తుశాస్త్ర పరిజ్ఞానానికి ఆధారంగా నిలుస్తున్నాయి.
విశిష్టతకు చిహ్నం నిలువురాళ్లు
అస్పష్టమైన భావనకు స్పష్టమైన రూపమే ఒక చిహ్నం లేక సింబల్. చనిపోయిన మనిషి ఆ తెగ లేదా గ్రామ పెద్ద అయితే ఆ వ్యక్తి గొప్పతనానికి గుర్తుగా నిలువురాళ్లు (ఇంగ్లీష్‌లో ‘మెన్హిర్’లు) నిలిపేవారని ఆర్కియాలజిస్టుల భావన. తెలంగాణలో ఎన్నో చోట్ల ఇలాంటి మెన్హిర్లు మనకు కనిపిస్తాయి. సిద్దిపేట జిల్లా పుల్లూరు బండ, నర్మెట, శనిగరం; నల్లగొండ జిల్లా చందంపేట దగ్గర గుంటిపల్లి, నల్లమలలో సిద్ధాపురం దగ్గర ఎన్నో వెలుగులోకి వచ్చినవి. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో కనుగొన్న మెన్హిర్లలో అత్యంత ఎత్తయిన మెన్హిర్ నల్గొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పాజీపేటలో ఉంది. సుమారు 17 అడుగుల ఎత్తున్న ఈ మెన్హిర్ను స్థానిక జర్నలిస్టు యాదగిరి వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికీ గోండు, సవర వంటి ఆదివాసీ తెగల్లో మెన్హిర్లను నిలిపి పూజించే ఆచారం ఉంది. అందుకే ఆదిమ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న నిరంతరతను అర్థం చేసుకోవడం కోసం ‘ఎత్నో ఆర్కియాలజీ’ విభాగం.. గ్రామీణ, ఆదివాసీ సమూహాల సంస్కృతిని అధ్యయనం చేస్తుంది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000