‘తెలంగాణ వాదానికి అసలు సిసలు సిద్ధాంతకర్తలు ప్రజలే. ఫణికర మల్లయ్యను మించిన సిద్ధాంతకర్త ఎవరుంటరు?’ అని ప్రకటించిన దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. 1952 నుంచి తుదిశ్వాస విడిచేదాకా మూడు దశల ఉద్యమానికి కలం.. గళం జమిలీ సాగిన కార్యశీలత నిత్యస్మరణీయం.
తెలంగాణకు జరిగిన అన్యాయాలపై శ్రీకృష్ణ కమిటీకి ఆమూలాగ్రం అందజేసిన ఉద్యమ గ్రంథం జయశంకర్ సార్. ఆయన అనుసరించి.. ఆచరించి ప్రవచించిన స్వీయ రాజకీయ అస్తిత్వ వాదం అనివార్యతే తెలంగాణకు రక్షణ కవచం. తెలంగాణ సాధన స్వప్నాన్ని సాకారం చేసుకోవటానికి ఆరాటపడుతూనే అనేక శిఖరాలను అధిరోహించిన విద్యావేత్త ఆయన.
కాకతీయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ సార్ వైస్‌చాన్స్‌లర్‌గా నియమితులు కాగానే ఆయనను సన్మానిద్దామని విద్యావంతులు, అధ్యాపకులు, ఆయనను అభిమానించే బుద్ధిజీవులు ప్రజాకవి కాళోజీని వెంటబెట్టుకొని వెళ్లారు. ‘సన్మానం వద్దు’ అని వారిని నిలువరించటమే కాకుండా అందరినీ కూర్చోబెట్టుకొని ‘నేను వీసీగా ఉన్నకాలంలో ఏమైనా తప్పులు జరిగితే కాళోజీ అధ్యక్షతన ఒక సమావేశం పెట్టండి. దానికి నన్ను పిలిచి కడిగిపారేయండి’ అని పేర్కొన్న విషయాన్ని వివరిస్తూ జయశంకర్ సార్ నిజాయితీ, చిత్తశుద్ధిని ప్రొఫెసర్ లక్ష్మణ్ అనేక సందర్భాల్లో ఉదహరించారు. అలాగే ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఒక సీనియర్ మంత్రి తన అనుచరుడికి విశ్వవిద్యాలయంలో ఉద్యోగం ఇవ్వాలని సిఫారసు లేఖ పంపిస్తే.. ఆ లేఖను చదివి లేఖ తెచ్చిన వ్యక్తి ముందే చించి చెత్తబుట్టలో వేశారట. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఖిన్నుడై.. ‘మంత్రిగారికి ఏం చెప్పమంటారు?’ అని అడిగితే ‘నేను ఏం చేశానో అదే చెప్పు’ అని చెప్పిన ముక్కుసూటితత్వం జయశంకర్ సార్‌ది.
వివక్షకు, దోపిడీకి గురైన ప్రజలు పోరాట పంథాను అనుసరించినప్పుడు రాజకీయ పార్టీలు పుడతాయి. తెలంగాణ కోసం అట్లా ఉద్భవించిన పార్టీలు, ఆ పార్టీల నాయకుల్లో ఉన్న చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఆధారంగానే గమ్యాగమ్యాలు ఆధారపడి ఉంటాయన్నది జయశంకర్ సార్ అనుభవసారం. ‘నేను అన్ని పార్టీలను చూసిన. తెలంగాణ అన్న ప్రతీ నాయకుడి తలుపు తట్టిన. కానీ, నాకు చంద్రశేఖర్‌రావులో లక్ష్యశుద్ధి నచ్చింది. అందుకే ఆయనతో ర్యాలీ అవుతున్న. అందులో తప్పేముంది’ అని జయశంకర్ సార్ ప్రశ్నించిన సందర్భాలనేకం. జయశంకర్ సార్‌ను కేసీఆర్ నుంచి వేరు చేయాలని అనేక శక్తులు ప్రయత్నించి విఫలమయ్యాయి.
‘ప్రజాస్వామిక వ్యవస్థలో రాజకీయ పార్టీలు, వాటికి ప్రాతినిధ్యం వహించే నాయకులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించకపోగా అవకాశవాద అధికార రాజకీయాలకు పాల్పడితే ప్రజలు చేయవలసిందేం ఉంటుంది? బానిసలుగా బతకటమా? లేక న్యాయం కోసం పోరాడటమా? ఘనమైన పోరాటాల చరిత్ర గల తెలంగాణ ప్రజలు ఏ పార్టీ సమర్థించినా, సమర్థించకపోయినా తమ న్యాయ పోరాటాన్ని ఐదారు దశాబ్దాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. లక్ష్యసాధన జరిగే వరకు కొనసాగిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ముందుకు తీసుకెళ్లే సత్తా కేసీఆర్‌లో ఉందని నా అనుభవం చెప్తున్నది’ అని చెప్పిన జయశంకర్ సార్ 2001 నుంచి కడదాకా కేసీఆర్‌తోనే నడిచారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర దశాబ్ది ముంగిట్లో జయశంకర్ సార్ ఉండి ఉంటే ఏం వ్యాఖ్యానించేవారు? ఈ పదేండ్లకాలంలో రాజకీయ నాయకులు, బుద్ధిజీవులు, మేధావులు, సామాజిక అధ్యయనశీలురు అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఎలా విశ్లేషించేవారు? అన్నది ఆసక్తిదాయకం. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ క్రీడా నేపథ్యాలు, వెలిబుచ్చుతున్న వైఖరులు కొత్తవేమీ కాదు. తెలంగాణ పట్ల ఉమ్మడి పాలకులు అందించిన అనుభవగ్రంథంలోని పాఠాలే ఇప్పటి పాలకులు వల్లె వేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చరిత్రనూ గుర్తుచేస్తున్నాయి. నాడు తెలంగాణ ఉద్యమ తీవ్రతను సహించక ‘ఒకవేళ తాము హైదరాబాద్‌ను విడిచి వెళ్లవలసి వస్తే ఆ నగరాన్ని తగులబెట్టిపోతాం’ అని దబాయించినట్టే వాతావరణం నెలకొన్నది. ఇటువంటి సందర్భంలో ‘బాధిత సమాజం గళం విప్పినప్పుడు విద్యావంతులు కలం పట్టాలి’ అన్న ఆచార్య రావాడ సత్యనారాయణ ఉద్బోధను జీవితాంతం ఆచరించిన జయశంకర్ సార్ నడిచిన దారిని అనుసరించటమే తెలంగాణ ప్రజలు ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి..!
– నూర శ్రీనివాస్