సీ. ఆ నిజాము జమాన యాగడములనెన్నొ
తూర్పారబట్టిన దొడ్డమనిషి
ఎవని వాడుక భాష నేమార్చనీకుండ
గట్లనే నుంచుతు గౌరవించె
తన్లాడె యాసకై, తన్లాడె బాసకై
పలుకుబడుల భాష పరువు పెంచె
తెలగాణ యేర్పాటు తొలిపొద్దు పొడుపుగా
ఉద్యమానికితాను నూతమయ్యె
అన్యాయమెదిరించినట్టి పుణ్యాత్ముడే
ఆరాధ్యుడని జెప్పె ధీరుడయ్యి
ప్రజలపక్షము నుండి ప్రశ్నించు గొంతుకై
ధిక్కార స్వరముతో తేల్చిజెప్పె
ఎవరైన మనభాష నేవగించుకొనిన
తిట్ల దండకముతో తిక్కగూర్చె
నిర్భీతి,ధైర్యమ్ము ,నిక్కచ్చితత్వమ్ము
కాళోజి రూపమై కానిపించు
తే.గీ. అణచివేత, వివక్షల నడ్డుకొనియు
అక్షరాలకు నావేశమంటగట్టి
నా గొడవ యంచు ప్రకటించె నలుదిశలకు
మాండలిక పద తావితో మధువు నింపె!!!