జనవరి ఫస్ట్..! క్యాలెండర్లో నూతన సంవత్సరం ఆరంభమయ్యే రోజు మాత్రమే కాదు, దీనికి మరో ప్రత్యేకత కూడా ఉన్నది. అదే గ్లోబల్ ఫ్యామిలీ డే! ప్రపంచాన్నే కుగ్రామంగా అభివర్ణించుకుంటున్న రోజులివి. ఈ గ్లోబల్ విలేజ్లోని మనుషులందరిదీ ఒకటే కుటుంబం. మనందరి గమ్యమూ ఒక్కటే. అదే ప్రేమ, శాంతి! నిజానికి మహోన్నతమైన మానవ జీవితాన్ని మరింత సుసపన్నం చేసేవీ ఇవే. ఎన్ని సిరిసంపదలున్నా ప్రేమ, శాంతి లేని జీవితం దుర్భరమే కదా! అందుకే, ప్రతి ఒక్కరి హృదయాల్లో సాటి మనుషుల పట్ల ప్రేమ భావనను పురికొల్పడం, విభిన్న సమూహాలు, దేశాల మధ్య శాంతి, సామరస్యాలను పాదుకొల్పడం అనే ఉదాత్త లక్ష్యాలతో ఏటా జనవరి 1న ‘గ్లోబల్ ఫ్యామిలీ డే’గా జరుపుకునే సంప్రదాయానికి 1999లోనే శ్రీకారం చుట్టింది ఐక్యరాజ్యసమతి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు దన్ను, సమాచార విప్లవం, రవాణా సదుపాయాల విస్తృతి, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అందివచ్చిన అవకాశాల నేపథ్యంలో ప్రపంచం కుగ్రామంగా మారిపోయిన మాట నిజమే అయినా, మనుషుల మధ్య, వారి మనసుల మధ్య అంతులేని అగాధం పెరుగుతూనే ఉన్నది. మనం కూర్చున్న చోట నుంచి అంగుళం కూడా కదలకుండానే ప్రపంచాన్ని వీక్షిస్తున్నామన్న సంతోషం ఒకవైపు, కనీసం పక్కనున్న కుటుంబసభ్యులతో మనసు విప్పి మాట్లాడుకోలేని, ఓ పది నిమిషాలు ఆహ్లాదంగా ముచ్చటించుకోలేని దుస్థితిలో చిక్కుకుంటున్నామన్న ఆవేదన మరోవైపు నిత్యం మనల్ని కలచివేస్తూనే ఉన్నది. ఇదొక విచిత్రం. ప్రపంచం కుగ్రామంగా మారుతున్నదా? మన మనసులు ఇరుకవుతున్నాయా? మన జీవితాలు ఏ అనుభూతుల స్పర్శకూ నోచుకోలేనంత యాంత్రికంగా మారుతున్నాయా? ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది.
మనిషి సంఘజీవి మాత్రమే కాదు, గొప్ప స్వాప్నికుడు. కలలను సాకారం చేసుకోగల నేర్పరి. సమర్థుడు. నిత్య చైతన్యశీలుడు. అలాంటి మనిషికి ఇవాళ ఏమైంది? తనను తాను పరిపూర్ణ మానవుడిగా, గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్గా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను ఎందుకు అధిగమించలేకపోతున్నాడు? కులం, మతం, వర్ణం, ప్రాంతం అనే సంకుచిత భావాల చుట్టూ తనను తాను ఎందుకు ఇరికించుకుంటున్నాడు? ఒకవైపు నా కులం, నా మతం, నా దేశం అంటూ ఆవేశాలు వెళ్లగక్కుతూనే, మరోవైపు తనదైన చిన్న కుటుంబంలో కూడా ఎందుకు ఇమడలేకపోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు మనం నిజాయితీగా వెతుక్కునే సమాధానాలే మానవజాతి పురోగమనాన్ని నిర్దేశిస్తాయి.
మనిషి విశ్వ మానవుడిగా ఎదగాలన్న ఆకాంక్షలు ఒకవైపు, మనిషికీ మనిషికీ మధ్య, మతానికి మతానికీ మధ్య విద్వేషపూరిత వాతావరణం మరోవైపు.. వెరసి ఆదర్శాలకూ, ఆచరణకూ మధ్య పొంతన కుదరని దురవస్థ. ఈ పరిస్థితికి ఎవరిని నిందించాలి? ప్రజల మానసిక, శారీరక సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసే విధానాలను రూపొందించడంలోనూ, వాటిని అమలు చేయడంలోనూ విఫలమవుతున్న పాలకులనే కదా!
గ్లోబల్ ఫ్యామిలీ అనే భావన ఎంత ఉన్నతమైనదో, ఎంత ఆదర్శనీయమైనదో దానిని ఆచరించడం అంత కష్టమైనది. మొత్తం ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిందని సంతోషిస్తున్న సమయంలోనే మనిషికీ మనిషికీ మధ్య అంతరం పెరుగుతుండటం దురదృష్టకరం. పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, లింగ వివక్ష, కుల, మత, ప్రాంతీయ భేదాలు, విద్వేషాలు, అణచివేతలు, రాజకీయ వైషమ్యాలు, రాష్ర్టాల మధ్య, దేశాల మధ్య శత్రుత్వాలు, యుద్ధాలు, టెర్రరిజం.. ఇలాంటివెన్నో మానవ జీవితాలను శాసిస్తున్నాయి. భయపెడుతున్నాయి. మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడలు నిర్మిస్తున్నాయి. మన చుట్టూ ఏమి జరుగుతున్నా పట్టించుకోని నిర్లిప్తత, అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించలేని స్వభావం, ఇతరుల కష్టాలను, బాధలను చూసి స్పందించలేని తత్వం పెరుగుతున్నాయి. ఈ ప్రవృత్తే గ్లోబల్ ఫ్యామిలీ అనే భావనకు తొలి శత్రువు.
గ్లోబలైజేషన్ యుగం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఎక్కడైనా బతికే అవకాశాలను కల్పిస్తున్నది. శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. అదే సందర్భంలో మనుషుల మధ్య, సంస్థల మధ్య, కంపెనీల మధ్య, రాష్ర్టాల మధ్య, దేశాల మధ్య అంతులేని పోటీ పెరుగుతున్నది. పోటీ అనేది ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటే తప్పు లేదు. దానిని ఆహ్వానించవచ్చు.
అయితే, మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు జరుగుతున్న అనారోగ్యకర పోటీ ఒక్కొక్కసారి అనేక అనర్థాలకు దారితీస్తున్నది. మనుషుల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టిస్తున్నది. ఆధిపత్య ధోరణులు, జెలసీలు, వైషమ్యాలు, యుద్ధాలను సృష్టిస్తున్నాయి. ‘నువ్వు బతుకు.. ఇతరులను బతకనివ్వు..’ అనే భావనకు బదులుగా ‘నువ్వు ఎదిగేందుకు ఇతరులను తొక్కేయ్.. చంపేయ్’ అనే వికృత ఆలోచనలను ప్రోది చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇలాంటి పెడ ధోరణి గ్లోబల్ ఫ్యామిలీ అనే ఆశయానికి గండి కొడుతున్నది. ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాలంటే ‘మనమంతా ఒకరి కోసం మరొకరం’ అనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలోనూ రగిలించాలి.
(నేడు గ్లోబల్ ఫ్యామిలీ డే సందర్భంగా..)
-కందిబండ కృష్ణప్రసాద్, 91827 77010