పశ్చిమాసియాలో యుద్ధం తాత్కాలికంగానైనా ఆగిపోవడం ప్రపంచానికి ఊరట కలిగించింది. ఈ తాత్కాలికం శాశ్వతంగా మారాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా మొదలుపెట్టిన ఇరాన్ యుద్ధం ఇప్పటికే ప్రపంచాన్ని ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేసింది. పశ్చిమాసియాలో అసాధారణమైన రీతిలో ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించాయి. 14 మంది వరకు అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్లో మౌలికరంగం బూడిదకుప్పగా మారింది. కనీసం 1,443 మంది సాధారణ పౌరులు మరణించారు. వారిలో 217 మంది చిన్నపిల్లలు. అటు అమెరికాకు రోజుకు సగటున వంద కోట్ల డాలర్ల ఖర్చు మీద పడుతున్నది.
ఇప్పటికే, అంటే 24వ తేదీ నాటికి, అమెరికా ఈ యుద్ధంపై 2,900 కోట్ల డాలర్లు (రూ.2.61 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. మరోవైపు అసాధారణమైన చమురు సమస్య ప్రపంచాన్ని చుట్టుముడుతున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఈసరికే చమురు బ్యారెల్ ధర 100 డాలర్లు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 1970ల నాటి చమురు సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన చమురు సంక్షోభం.. ఈ రెండింటినీ మించిన జేజెమ్మ లాంటి సంక్షోభం వైపు ప్రపంచం వేగంగా పరుగులు తీస్తున్నది.
ఈ నేపథ్యంలో దౌత్యాన్ని ఏమాత్రం ఖాతరు చేయని అగ్రరాజ్యాధినేత ఇప్పుడు హఠాత్తుగా పీఛేముడ్ అంటూ ఇరాన్‌తో చర్చల గురించి మాట్లాడుతుండటం విడ్డూరం. ఎలాంటి విస్పష్టమైన లక్ష్యాలూ, వ్యూహాలూ లేకుండా ఇరాన్‌పైకి దండెత్తిన ట్రంప్ ఇంటా బయటా ఇరకాటంలో పడ్డారనేది పైకి తెలుస్తూనే ఉన్నది. యుద్ధంలో తలదూర్చేందుకు అటు యూరప్‌లోని నాటో మిత్రదేశాలు, ఇటు ఆసియాలోని జపాన్ నిరాకరించడంతో అమెరికా ఏకాకిగా మారింది. ఇరాన్ ఎదురుదాడులతో అమెరికా ఆయుధ వ్యవస్థల ప్రతిష్ఠ మసకబారింది. గంటల్లో లేదా రోజుల్లో ఇరాన్ కుప్పకూలుతుందన్న అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలు తలకిందులయ్యాయి.
ఇరాన్ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అమెరికా యుద్ధనౌకల్లో సుదీర్ఘ కాలం పనిభారం వల్ల సైనిక సిబ్బంది లోపల్లోపల విధ్వంసానికి పాల్పడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై అమెరికా నౌకాదళం దర్యాప్తు జరిపిస్తున్నది కూడా. ట్రంప్ పరిపాలనా సామర్థ్యంపై, మానసిక సంతులనంపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణ నుంచి దృష్టి మరల్చేందుకే యుద్ధంలోకి ట్రంప్ దిగారని, ఇజ్రాయెల్ ఆయనను తెలివిగా యుద్ధంలోకి దింపిందని రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద యుద్ధం వల్ల అమెరికాకు ఏం ఒరుగుతుందనేది సంశయాత్మకంగా మారింది.
ఏది ఏమైనప్పటికీ హోర్ముజ్ పీటముడితోనే ట్రంప్ దిగొచ్చారనేది స్పష్టం. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, అవి చాలా ప్రగతి సాధించాయని ట్రంప్ అంటున్నదాంట్లో నిజమెంతో తెలియదు. అటు చర్చలు ఏవీ జరగడం లేదని ఇరాన్ అంటున్నది. 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిపై నియంత్రణలు ఎత్తివేయకపోతే ఇరాన్ విద్యుత్తు కేంద్రాలను ధ్వంసం చేస్తామని తాఖీదు ఇచ్చిన ట్రంప్ ఆ గడువు ముగిసే లోపే 5 రోజుల విరామం ప్రకటించడం విస్మయం కలిగిస్తున్నది. నిజంగానే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా లేక విరామాన్ని అడ్డు పెట్టుకొని అదనపు సైనికశక్తిని మోహరించాలని చూస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విద్యుత్తు కేంద్రాలపై అమెరికా దాడులు ఆగినప్పటికీ ఇరుపక్షాలు చెదురుమదురుగా క్షిపణి దాడులు జరుపుకొంటూనే ఉన్నాయి. ఇది విరామం గురించి కొంత గందరగోళం సృష్టిస్తున్నది.
ఆరవ రోజున ఏమి జరుగుతుంది? అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న కీలక ప్రశ్న. ఈ ఐదు రోజులు గడిచిపోయినా టెహ్రాన్ నుంచి అర్థవంతమైన దౌత్య సంకేతం రాకపోతే, అమెరికా అధ్యక్షుడు తనంతట తాను సృష్టించుకున్న ఒక వ్యూహాత్మక ఉచ్చులో చిక్కుకుంటారు. ఏమీ చేయకుండా ఉండటం అంటే ఆయన బెదిరింపుల విశ్వసనీయతను దెబ్బతీయడమే. మళ్లీ దాడులు మొదలుపెడితే, బయటపడే వ్యూహం అస్పష్టంగా ఉన్న ఒక ఘర్షణలోకి మరోసారి కూరుకుపోవడమే అవుతుంది.