‘మహిళలకే మా మొదటి ప్రాధాన్యం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తాం. పింఛన్ పెంచుతాం. రైతు భరోసా ఇస్తాం. ఉద్యోగులకు ఆరు నెలల్లోనే పీఆర్సీ, పెండింగ్ డీఏలు ప్రకటిస్తాం. పెన్షనర్ల సమస్యలు తీరుస్తాం. నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలిస్తాం. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడటమే వారి పని. ఆరోగ్య తెలంగాణే మా లక్ష్యం. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. విద్య, వైద్యం మాకు అత్యంత ముఖ్యమైనవి. మాకు ఇతర రాష్ర్టాలతో పోటీ లేదు. సింగపూర్, చైనా, కొరియాలతోనే మాకు పోటీ. పాలనను గాడిలో పెడుతున్నాం’.. ఇవన్నీ రెండేండ్ల కిందట ఎన్నికలకు ముందు, అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు.
ఒక ఏడాది పూర్తికాకముందే కాంగ్రెస్ పాలకుల అసలు రంగు బయటపడింది. తులం బంగారం తుస్సుమన్నది. వృద్ధాప్య పింఛన్ గురించి ఏనాడూ మాట్లాడింది లేదు. పెంచకపోయినా పర్లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన దానికే ఇప్పుడు దిక్కులేదు. రైతు భరోసా రెండుసార్లు మాత్రమే ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం కండ్లు కాయలుకాసేలా రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ కిట్లు బంద్ అయ్యాయి. కొత్త ఇండ్లు కట్టించకపోగా ఉన్న ఇండ్లను కూల్చేశారు. గురుకులాలు కునారిల్లుతున్నాయి. మరణ మృదంగాలు మోగుతూ గురుకులాల్లో ఆత్మహత్యల సంఖ్య ఏనాడో 100 దాటింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారు. పీఆర్సీ నివేదిక తయారైనా దాన్ని వెంటనే అమలుచేయాల్సి వస్తుంద న్న భయంతో స్వీకరించడం లేదు.
అవును, ఇతర రాష్ర్టాలతో అసలు పోటీయే లేదు. ఎందుకంటే, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు. ఏ ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులను ఈ విధంగా దగా చేయలేదు. ఏ పథకం నిలిపివేసి ఉద్యోగుల బకాయిలు చెల్లించమంటారని ఎవరూ అడగలేదు. ‘నన్ను కోసినా చిల్లిగవ్వ కూడా మీకు రాదు’ అనడం ఎంతటి దౌర్భాగ్యం. అవి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనాల్సిన మాటలేనా? ఉద్యోగులు నరమాంస భక్షకులు కాదు గదా! రాష్ట్ర ఆర్థిక అధోగతిని చూసి స్వయంగా వారే కొన్ని డిమాండ్ల విషయంలో సర్దుకుపోతున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వారి సహనానికి పరీక్ష పెడుతున్నది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరి సంక్షేమానికి వ్యతిరేకులు కాదు. ఏ సంక్షేమ పథకం నిలిపివేయాలని వారు కోరడం లేదు. తమ సం క్షేమం కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఢిల్లీలో తమను చెప్పుల దొంగల్లా చూస్తున్నారని చెప్తూనే సీఎం 59 సార్లు ఢిల్లీకి వెళ్తే, ఇక్కడ మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు. కానీ, రూ. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వేలాది ఉద్యోగాలు వచ్చాయని ఉపన్యాసాల్లో, ప్రకటనల్లో ఊదరగొడుతున్నారు.
ప్రతిచోట, ప్రతిసారి భూసేకరణ వివాదాస్పదమవుతున్నది. పరిశ్రమలకు భూసేకరణ పేరిట అస్మదీయులకు భూసంతర్పణ చేస్తున్న వైనం కనిపిస్తున్నది. భూ దందాలకు అంతులేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ కుదేలైంది. వేలాది వెంచర్లు, లక్షలాది అపార్ట్మెంట్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. పర్యవసానంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపోయింది. హైకోర్టు మొట్టికాయలు సర్కార్‌కు అలవాటైపోయాయి. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగంలో చిక్కుకుపోయిన మృతదేహాల అచూకీ తెలియదు. ఇక 8 ఏండ్లు గా ప్రతిష్టాత్మకంగా నడిచిన మెట్రో భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఎల్ అండ్ టీ లాం టి కంపెనీలు వెళ్లిపోతుంటే కొత్త కంపెనీలు వస్తున్నాయంటూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం దారుణం.
ఇటుక పేర్చకుండానే ఇందిరమ్మ ఇళ్లు తయారవుతున్నాయి. తట్ట మట్టి తవ్వకుండా ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. అన్ని మాటల్లోనే, ప్రకటనల్లోనే. అం దాల పోటీలు నిర్వహించి అబాసుపాలయ్యారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. ఇవన్నీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే అనేది నిర్వివాదాంశం.
దాదాపు దశాబ్దకాలం విజయవంతంగా నడిచిన, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. సొంత భవనాలు నిర్మించకపోవడంతో, అద్దెలు చెల్లించకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడుతున్న వార్తలను మనం రోజు చూస్తున్నాం. పురుగుల అన్నం, నీళ్లచారు, కుళ్లిన కోడిగుడ్లు, పాడైపోయి న కూరగాయలు.. ఇదీ విద్యార్థుల మెనూ. కలు షితాహారం మూలంగా విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. గురుకుల అడ్మిషన్లకు గిరాకీ తగ్గింది.
ఐఐటీ, నీట్ సాధించేవారి సంఖ్య కూడా పడిపోయింది. గురుకులాలపై కేసీఆర్ ముద్ర చెరిపివేయడానికి నేటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను తెరమీదికి తెచ్చింది. ఒక్కో గురుకులానికి కోటి రూపాయ లు కూడా విడుదల చేయలేని ఈ ప్రభుత్వం ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తామని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం స్పష్టమవుతున్నది. పైగా వీటి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అడగడం విచి త్రం. ఇంకా మూసీ సుందరీకరణ పేరుమీద రూ.లక్షన్నర కోట్లు కావాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. ఇవన్నీ అస్మదీయులకు లాభాలు, అధిష్ఠానానికి మూటల కోసమే అన్నది జగమెరిగిన సత్యం.
ఇక హిల్ట్ పాలసీ వెనుక లక్షల కోట్ల రూపాయల అవినీతి పారనున్నది. 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అతి స్వల్ప ధరలకు అప్పగించడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. సహచర, సంబంధిత శాఖల మంత్రుల ప్రమేయం లేకుండానే విధాన రూపకల్పనలు జరిగిపోతున్నాయి. సంబంధిత శాఖ మంత్రి లేకుండా సమీక్షలూ జరుగుతున్నాయి. మంత్రు ల మధ్య సయోధ్య ఒక మిథ్య. సెమిష్టర్‌కు ఒకసారి ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు సమ్మెకు దిగుతున్నాయి. చోటా మోటా కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం సచివాలయంలో మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. నియంత్రణ లేని ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే రాష్ర్టాన్ని నడిపిస్తున్నది. 24 నెలల్లో రెండున్నర లక్షల కోట్లు రుణం తీసుకున్న ఈ ప్రభుత్వం ఒక్క ఉపయోగకరమైన ప్రాజెక్టును తలపెట్టకపోవడం శోచనీయం.
రైతులు, మహిళలు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్నివర్గాలవారు ఈ రెండేండ్ల ప్రజావంచనను భరించలేక ఇక్కట్ల పాలవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సోయి లోపించింది. ఆంధ్ర సంస్థలకు, బినామీలకు, సెల్ కంపెనీలకు కాంట్రాక్టులు తరలిపోతున్నాయి. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటానని పదే పదే చెప్పుకోవడం ముఖ్యమంత్రిలోని అభద్రతాభావాన్ని తెలియజేస్తున్నది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో తీర్మానాలు, చట్టాలు, జీవోలు అమలుపరచలేమని తెలిసీ డ్రామా చేశారు. బస్తా యూరియా కోసం పడిగాపులు కాసి కొంతమంది రైతులు ప్రాణాలు పో గొట్టుకున్నారు. ఒకపక్క గిట్టుబాటు ధర లేక రైతులు గొల్లుమంటున్నారు. పత్తి రైతుల గోస చెప్పటానికి లేదు. ఆంధ్ర నుంచి దిగుమతి అయిన అధికారులు, సలహాదారులు, మ్యూజిక్ డైరెక్టర్లు నేడు ప్రభుత్వానికి దగ్గరయ్యారు, కావలసినవారయ్యారు. ప్రభుత్వ పెద్దల నోటి వెంట నుంచి తెలంగాణ అనే పదమే వినపడటం లేదు. అందుకేనేమో ముఖ్యమంత్రి సభలకు జనం నుంచి స్పందన కరువైంది. ఆ సభలు వెలవెలబోతున్నాయి. పాలకులకు పట్టులేక పాలన పాడెక్కింది. మంత్రులు ఎవరేం మాట్లాడుతారో తెలియదు. ఇన్ని వైఫల్యాల మధ్య విజయోత్సవాలు జరుపుతున్నామనడం హాస్యాస్పదం. ఇవి విజయోత్సవాలు కాదు, ముమ్మాటికీ రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ విఫలోత్సవాలే…
– శ్రీశ్రీ కుమార్