చిటచిట
చినుకులు రాలుతున్నయి
జజ్జెనకర దరువుల్ల
తప్పెట్లు మోగుతున్నయి
పల్లెటూర్లు, పట్నాలు
ఇల్లలికి, ముగ్గుపెట్టి
దరువాజకు పూజకట్టి
యాపచీరలు కట్టుకొని ముస్తాబుగున్నయి
చేను చెలకలు- వాగు, వంకలు
పసుపు, కుంకుమల సారెలు పోసుకున్నయి.
కట్టమీది అమ్మతల్లులు
పంట దీవెండ్లు పెడుతున్నరు
పొలిమేర కాడ
పోతురాజు వీరకోల సప్పుడు చేసిండు.
ఊరు ఊరంతా పొలిమేర దిక్కుచూసింది
పొలిమేరావల
పొత్తులు తెంపుకున్నోడు
నక్కజిత్తుల వేషం కడుతుండు.
అలుగులు దుంకకముందే
తూములకు తూటువెట్టి
గోదారిని గోసలదారి చేస్తనని
చంద్రవాక్కు పలికిండు
ఆ నోట, ఈ నోట
ఆ… మాట ఆమె చెవిన పడింది
ఆమె వీర తెలంగాణి
నిండార నీళ్ళ బోనం తలార తలకెత్తుకుంది.