కడుపుల బాధెంత కసిగా మెలిపెడుతుందో
ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది
లెక్కలేనన్ని అలల నాలుకలతో
భూమికి బాధ వెళ్లబోసుకుంటున్నది
తీపి నదులొచ్చి క్షణక్షణం ఆలింగనాలు చేసుకున్నా
బుదుగరించినా, బువ్వలామారినా
కన్నీరు కార్చి కార్చి ఉప్పు సముద్రమైంది..
అడుగున ఎన్ని గనులున్నా.. మణులున్నా..
తరగని సంపద తళతళలాడినా
చిల్లిగవ్వంత చూసుక మురువదు
తన బాధ ఇతరులకు పంచదు
తన గోడు, తన ఏడుపేదో తనదే..
నమ్ముకున్న జలచరాలకు స్తన్యమిచ్చే అమ్మ
పెంచి పోషించే బాధ్యత ఎత్తుకున్న నాన్న
సముద్రం చెమట ఆవిరైతేనే కదా
మధురిమల మబ్బులు నిండుకుండలయ్యేది
చినుకులు చింతాకు కన్నా చిన్నవైనా
పుడమికి జీవం, జీవనాన్నిస్తాయి!
వలలెన్ని వేసినా చిక్కదు సముద్రం
తనను మొక్కి వేసే మత్స్యకారుల వలలకు
చేస్తుంది చేపలను దానం
నీళ్లను దారి మళ్లించినా కయ్యిమనదు
ఎండబెడితే కయ్యల్లో ఎత్తుకోమంటుంది
ప్రపంచానికి సరిపోయేంత ఉప్పు
మనుషుల నోటి వంటలకు రుచి మొగ్గ
జల రవాణా మార్గాలకు రహదారులు వేసింది
పలు దేశాల పరిచయకర్త సముద్రయానమే!
నమ్ముకుంటే వరప్రదాత సముద్రం
నిండు పున్నములకు ఆనందాలు పంచే దూత
కోపం తెప్పిస్తే కండ్లల్లో కురుస్తాయి నిప్పులు
కదలికల ఉప్పెనై దండెత్తితే
ఎంత కోటమేడలు నిర్మించినా
కలిపేస్తది నీళ్లలో కండ్లముందే
రక్షణ తంత్రం తెలియక తోక జాడించాల్సిందే..!