అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు దేశానికే ఆదర్శమైనదిగా గర్వంగా చెప్పుకోవచ్చు. పార్లమెంటులో చర్చల ప్రమాణాలు క్షీణిస్తున్నాయనే విమర్శలు వస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీలో సాగిన చర్చ కాంతిరేఖలా కనిపిస్తున్నది. సభ జరిగిన తీరు, చర్చలలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం శిఖరప్రాయమైనది. రెండు పర్యాయాల కాలంలో తాము సాధించిన విజయాలను స్థిరచిత్తంతో, ఎంతో సంతృప్తితో గుర్తు చేయడమే కాకుండా దేశ పరిస్థితులను అన్ని కోణాలలో స్పృశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని శాసన సభ వేదికగా దేశానికి ఇచ్చిన సందేశంగా చెప్పుకోవచ్చు. ఆయా శాఖల మంత్రులు కూడా ఎంతో పరిణతితో చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ విజయాలతో ప్రజలు తాదాత్మ్యం చెందడాన్ని మించిన విజయం మరేముంటుంది!
ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ పాలనలో రాష్ర్టానికి జరిగిన అన్యాయాలను వివరిస్తూనే, కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు విధానాలను అన్ని కోణాలలో ఎత్తి చూపారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా నీటిపంపకాలపై తగాదాలు కూడా తెగకపోవడం కేంద్ర పాలకుల అసమర్థతకు నిదర్శనం కాదా! అవినీతి పెచ్చరిల్లిపోతున్నది. ప్రజలకు కనీస హక్కులు కరువయ్యాయి. కామధేనువుల వంటి సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టడంలో ప్రజలకు ప్రయోజనం ఏమున్నది? ఆర్థికంగా దేశం ఎంతగా దిగజారిపోయిందో కేసీఆర్ గణాంకాలతో వివరించడం విశేషం. కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాల నేపథ్యంలో బీఆర్ఎస్ వాహికగా తాను జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టవలసిన అవసరాన్ని కేసీఆర్ స్పష్టంగా చెప్పగలిగారు. బీజేపీ పతనం ఖాయమంటూ కేసీఆర్ గర్జించడం దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.
పేదల పట్ల ప్రభుత్వ బాధ్యత గురించి కేసీఆర్ చెప్పిన హితవాక్యాలు భారత పాలకులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నాయకులు కంఠతా పట్టవలసిన పాఠం. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో, పేద ప్రజల కోణంలో, కొన్ని రంగాలలో ప్రభుత్వం కచ్చితంగా తగిన పాత్ర పోషించవలసి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వర్థమాన దేశాలలోనే కాదు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలోనూ పాలకులు అశాస్త్రీయమైన రీతిలో ప్రైవేటీకరణ సాగించడం, ప్రజల పట్ల బాధ్యత మరిచి పొదుపు చర్యల పేర సంక్షేమ పథకాలకు కోత పెట్టడం రివాజుగా మారింది. ఈ పోకడలోని లోపాలను ఎత్తి చూపి ధైర్యంగా ప్రజల పక్షం వహించడం కేసీఆర్‌కే చెల్లింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో, ప్రజల స్వేచ్ఛకు, ప్రజాస్వామిక హక్కులకు హామీ ఇస్తూనే, సంక్షేమ విధానాలను అనుసరించిన మహోన్నత ప్రయోగాలను మరోసారి ప్రపంచం ముందు పెట్టినట్టయింది. తెలంగాణ మాడల్‌కు పునాది అయిన ఈ తాత్త్విక భావనే దేశానికి శిరోధార్యం.