స్వేచ్ఛ, భావవ్యక్తీకరణలో భాగంగానే ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను వేర్వేరు వేదికల ద్వారా వ్యక్తీకరిస్తుంటాడు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒకప్పుడు గ్రామాల్లో రచ్చబండ, వీధుల్లో చర్చలు, ఆ తర్వాత కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, పత్రికలు వచ్చాయి. వేర్వేరు అంశాలపై తమ అభిమతానికి అనుగుణంగా అభిప్రాయాన్ని బహిర్గతం చేయడం ద్వారా ప్రజలు తమ వాదనలు/ సిద్ధాంతాలు/ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఒక్కోసారి ఘటన తీరును బట్టి సోషల్ మీడియాలో స్పందన ఘాటుగానే ఉంటుంది. అంతమాత్రాన కేసు పెట్టేయడానికి వీల్లేదు. ఒక్కోసారి అలాంటి స్పందనలు పాలకుల నిర్ణయాల్లో మార్పుచేర్పులకు దారితీసే ఆస్కారం ఉంటుంది. చాకలి చేసిన వ్యాఖ్య తర్వాత రామాయణ గాథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. అదేతీరుగా సోషల్ మీడియా పోస్టుల ప్రభావం పాలకుల నిర్ణయాల్లో మార్పులకు దోహదపడుతుంది.
శాస్త్ర సాంకేతికతను పుణికిపుచ్చుకున్నాక సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వెలిబుచ్చడం జోరుగా సాగుతున్నది. రాజకీయాలు జన జీవనంలో భాగమయ్యాయి కాబట్టి, సామాజిక మాధ్యమాల ద్వారానే అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, జనం కూడా తమ అభిప్రాయాలు, వాటిపై ప్రతిస్పందనలు, వాదనలు, ప్రతివాదనలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పోస్టుల్లోని విషయాలపై స్పందించలేని పరిస్థితుల్లోనో లేక ఆ పోస్టుల్లోని అంశాలను జీర్ణించుకోలేని దుస్థితిలోనో పాలక పెద్దలు అదేపనిగా ఆ పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు నమోదు చేయడం సర్వసాధారణమవుతున్నది.
ఇలా కేసులు పెట్టి జైళ్లకు పంపడం వంటి ఘటనలు ఏకపక్షంగా జరుగుతున్నాయనే విమర్శలూ లేకపోలేదు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు/ వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే ముందు అర్నేష్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను సదరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు విధిగా అమలు చేయాలి. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అర్నేష్ కుమార్ కేసు తీర్పులోని మార్గదర్శకాలను పాటించకుండానే పలువురు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు నిందితులకు చాలా రొటీన్‌గా రిమాండ్ విధిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానాలు గుర్తించాయి. అందుకు ఇటీవల ఏపీ హైకోర్టు ఆ రాష్ట్రంలోని మెజిస్ట్రేట్ కోర్టులకు జారీచేసిన సర్క్యులరే నిలువెత్తు నిదర్శనం.
స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా అణచివేయాలనే పాలక ప్రభువుల ఎత్తుల్లో భాగంగా ‘క్రిమినల్ లా’ అస్ర్తాన్ని సంధిస్తున్నారని సుప్రీంకోర్టు సైతం గుర్తించింది. క్రిమినల్ లాను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది మార్చి 28న ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పులోని మార్గదర్శకాలపై ఏపీలోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లకు ఆ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ఎస్.కమలాకరరెడ్డి సర్క్యులర్ జారీచేయడం గమనార్హం.
భావవ్యక్తీకరణను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు జరిపే ప్రయత్నాల్లో భాగంగా నమోదయ్యే కేసుల్లో కింది కోర్టులు యాథాలాపంగా రిమాండ్ ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదు. ప్రసంగం, రచన, కళాత్మక వ్యక్తీకరణలకు సంబంధించిన (3 నుంచి 7 ఏండ్లలోపు శిక్షకు వీలున్నవి) వ్యవహారాలపై కేసు నమోదుకు ముందు పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 179(3) ప్రకారం ప్రాథమిక విచారణ జరపాలి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే ముందు అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కేసుల్లో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలకు దర్యాప్తు అధికారి కట్టుబడి ఉన్నారో, లేదో సదరు మెజిస్ట్రేట్లు తప్పనిసరిగా పరిశీలించాలి.
ఇవేవీ జరుపకుండా నిందితులను ఉన్నపళంగా రిమాండ్‌కు పంపడానికి వీల్లేదు. నిందితుడు ఇదే తరహా నేరాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందా, అదివరకే బహుళ నేరాలకు పాల్పడ్డాడా, రిమాండ్‌కు తరలించకపోతే సాక్షులను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాడా, అసలు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా, సాక్ష్యాలను తారుమారు చేస్తాడా.. వంటి అంశాలను మెజిస్ట్రేట్లు పరిశీలించాలి. ఈ నిబంధనలను జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు తు.చ. తప్పకుండా పాటించాలి. ఆ తర్వాతే సోషల్ మీడియా పోస్టుల కేసుల్లోని నిందితులను రిమాండ్‌కు తరలించే అంశంపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలి.
సుప్రీంకోర్టు ఈ రెండు కేసుల్లో జారీచేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఆ రాష్ట్రంలోని మెజిస్ట్రేట్లకు జారీచేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సూచనలు, నిబంధనలను జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు అతిక్రమించినా లేదా ఉల్లంఘించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సర్క్యులర్‌లో హెచ్చరించారు. శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు జారీచేసినవి కాబట్టి ఈ మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్రంలోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లకూ వర్తిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అర్నేష్ కుమార్ కేసులో (2014) సుప్రీంకోర్టు వెలువరించిన కీలక మార్గదర్శకాల ప్రకారం నచ్చని అంశంపై విమర్శ చేశారని చెప్పి ఎడాపెడా కేసులు పెట్టి ఇష్టం లేని వాళ్లను జైళ్లకు పంపడానికి వీల్లేదు. ఏడు సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్షపడే నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను సాధారణంగా అరెస్టు చేసేయడానికి వీల్లేదు. వాస్తవానికి అర్నే ష్ కుమార్ కేసు భార్యభర్తల మధ్య వరకట్న వేధింపులకు సంబంధించినది.
బీహార్‌కు చెం దిన అర్నేష్కుమార్పై అతని భార్య.. సెక్షన్ 498(ఏ) వరకట్న వేధింపుల కేసు దాఖలు చేసింది. ఈ కేసులో అర్నేష్‌కుమార్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. ఏడేండ్ల కంటే తక్కువ శిక్ష విధించే నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇలాంటి కేసుల్లోనే ఇలా చెప్పిన సుప్రీంకోర్టు సోషల్ మీడియా పోస్టులపైనా ఇదే తరహాలో స్పందించింది. ఇష్టం వచ్చి న రీతిలో కేసులు నమోదు చేయడానికి వీల్లేదని సీనియర్ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి కేసులో ఇలాంటి మార్గదర్శకాలనే వెలువరించింది.
ఇటీవల తెలుగు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసులో మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. టీవీ కార్యక్రమంలో జరిగిన చర్చలో ఎవరో వ్యక్తం చేసిన అనుచిత అభిప్రాయాన్ని ఆ చర్చలో పాల్గొన్నవారికి లేదా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిన జర్నలిస్టుకు ఆపాదించి పోలీసులు కేసు నమోదు చేయడం చెల్లదని తేల్చిచెప్పడాన్ని పాలక పెద్దలు గుర్తుంచుకోవాలి. ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై చర్చలో పాల్గొన్న ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు జర్నలిస్ట్ కొమ్మినేని నవ్వారని చెప్పి మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులు జారీచేయడం ఏమిటని సుప్రీంకోర్టు నిలదీసింది.
అనేక ప్రజాహిత, ప్రభుత్వ వ్యతిరేకఅనుకూల కేసులకు సంబంధించిన అంశాలపై విచారణ జరుగుతుండగా న్యాయమూర్తులు కూడా ఏదో ఒక సందర్భంలో నవ్వుతారని, అంతమాత్రాన ఆ నవ్వును బట్టి కేసు విచారణ విషయంలో జరిగిన తప్పుగా ఆపాదిస్తారా? అని మండిపడింది. ఈ అంశంపై పాలకులు, పోలీసులు తర్జనభర్జన చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆధారంగా చేసుకొని నచ్చని అభిప్రాయం చెప్పారనే అక్కసుతో కేసులు నమోదు చేయడం, ఆపై రిమాండ్‌కు తరలించడం దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులకు వ్యతిరేకమని అందరూ గమనించాలి.
– పెమ్మరాజు శ్రీనివాస్