తెలుగు సాహిత్యంలో దార్శనిక దృష్టిని, పరిశోధనా వైశిష్ట్యాన్ని సమన్వయపరిచిన ఆచార్య ఎస్వీ రామారావు పేరు సాహిత్య విమర్శా సంప్రదాయంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. 1941 జూన్ 5న వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్లో జన్మించిన ఆయన తెలుగు సాహిత్యంలో ఉన్నత విద్యను పూర్తి చేసి ఎంఫిల్, పీహెచ్డీ సాధించి బోధన, పరిశోధన, విమర్శ రంగాల్లో విశిష్ట కృషి చేశారు. 19 పీహెచ్డీ, 15 ఎంఫిల్ పరిశోధనలకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించిన ఆయన అరుదైన ఖ్యాతి పొందారు.
‘తెలుగులో సాహిత్య విమర్శ’ ఎస్వీ ముఖ్య రచన. ఇందులో పాశ్చాత్య సిద్ధాంతాల ప్రభావం, తెలుగు విమర్శా బలహీనతలు, బలాలను శాస్త్రీయంగా విశ్లేషించారు. ‘The Evolution of Telugu Literary Criticism’ ద్వారా తెలుగు విమర్శను అంతర్జాతీయ సాహిత్య పటంలో ప్రతిష్ఠించారు. ‘అన్వీక్షణం’, ‘సమవీక్షణం’, ‘అభివీక్షణం’, ‘కావ్యామృతం’, ‘గ్రంథావలోకనం’ వంటి సంపుటాలు ఆయన విమర్శా పటిమకు నిదర్శనం.
శ్రీశ్రీ కవిత్వ విశ్లేషణలో రాజకీయ కోణం మాత్రమే కాకుండా శిల్పం, వచన స్వాతంత్య్రం, ప్రజా భావనల అనుసంధానాన్ని ఆయన చూపారు. ‘నన్నయ దర్శనం’, ‘కర్ణపర్వం’ వ్యాఖ్యానాల్లో తాత్వికత, సామాజిక సత్యాలను వెలికితీయగా, ‘శతాబ్ది కవిత’లో శతాబ్ద కాలపు కవిత్వ పరిణామాన్ని సమగ్రంగా పరిశీలించారు. స్థానికతతో పాటు సమగ్రతకు ఆయన కట్టుబడి ఉన్నారనడానికి ‘పాలమూరు సాహితీవైభవం’, ‘విశ్వనాథ దర్శనం’ వంటి రచనలు ఉదాహరణ.
సాహిత్య విమర్శలో మానవతా దృష్టిని పెంపొందించినవాడిగా ఆయన గుర్తింపుపొందారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ విమర్శ పురస్కారం, దాశరథి పురస్కారం, సహృదయ సాహితీ పురస్కారం, ఉమ్మెత్తల అవార్డు, జీవీఎస్ సాహితీపీఠం పురస్కారం, గురజాడ అప్పారావు సాహితీ పురస్కారం, వానమామలై జయంతి పురస్కారం తదితర అనేక అవార్డులు ఆయనను వరించాయి. ఆయన మృతి తెలుగు సాహిత్యరంగానికి తీరని లోటు. అయితే ఆయన రచనలు భవిష్యత్ తరాలకు శాశ్వత మార్గదర్శకంగా నిలుస్తాయి.
– రామకిష్టయ్య సంగనభట్ల
9440595494