ప్రజారోగ్య దుస్థితిపై 115 మంది సామాజికవేత్తల లేఖ
‘రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసింది’ అనే విమర్శలు వినిపిస్తుంటాయి. రాజకీయ నేతలు ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు, పదవిలోకి వచ్చాక వాస్తవ రూపంలోకి రావని, హామీల పట్ల నేతలకు పెద్దగా శ్రద్ధ ఉండదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు,
మంత్రి దామోదర రాజనరసింహ గారికి,
అయ్యా,
‘రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసింది’ అనే విమర్శలు వినిపిస్తుంటాయి. రాజకీయ నేతలు ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు, పదవిలోకి వచ్చాక వాస్తవ రూపంలోకి రావని, హామీల పట్ల నేతలకు పెద్దగా శ్రద్ధ ఉండదు. ఇది మాకు మళ్లీ మళ్లీ ఎదురవుతున్న ప్రత్యక్ష అనుభవం. మన రాష్ట్ర రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ హాస్పిటళ్ల పరిస్థితి ఏమిటి అని మళ్లీ ఒకసారి గుర్తుచేయాల్సి వచ్చినందుకు మాకు అత్యంత దుఃఖంగా, ఆగ్రహంగా అనిపిస్తున్నది. రాష్ట్ర రాజధాని విషయంలోనే ఇలాంటి ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే ఇక జిల్లా కేంద్రాల్లో, మండలస్థాయి హాస్పిటళ్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందన్న ఆలోచన కూడా రాదు. డాక్టర్ల గురించి, ఇతర వైద్య సిబ్బంది కొరత గురించి ఇక్కడ మేం అస్సలు మాట్లాడటం లేదు. ఉన్నంతవరకూ వారు తమ శక్తికి మించే పనిచేస్తున్నారని మాకు తెలుసు. నిజానికి వారిపై వందింతల భారం ఉంటున్నదని, వారి రోజువారీ పని ఒత్తిడిని గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, పేట్లబుర్జ్ ప్రసూతి హాస్పిటల్ వంటి రెఫరల్ దవాఖానలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అర్థం కానిది, అర్థం చేసుకోవటానికి నిరాకరించేది మీ లాంటి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమేనని చెప్పటానికి మేమేమీ సంకోచించటం లేదు.
అధికారంలో ఉన్న మీరు ఎప్పుడైనా మీ కోసమో, మీ వాళ్ల కోసమో ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లారా? బహుశా మీలాంటి వారికి అక్కడ వైద్యం చేయించుకునే అవసరం వచ్చి ఉండదు. ప్రభుత్వ హాస్పిటళ్లకు ప్రజలు దూరమవుతున్నారంటే, కార్పొరేట్ వైద్యం అనే కబంధ హస్తాల్లోకి నెట్టబడుతున్నారంటే, దానికి కారణం ముమ్మాటికీ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవటమేనని మేం చెప్తే మీకు కోపం రావొచ్చు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కనీస సౌకర్యాలు సరిగ్గా ఉంటే సర్కారీ వైద్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయేదా? ఆరోగ్యం బాగాలేకపోతే, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే కదా సామాన్య ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లకు పరుగెత్తేది! అక్కడ కనీసపాటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకపోబట్టే కదా ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్ల వైపు వెళ్లిపోతున్నది? ఇక్కడ లేని నైపుణ్యం ఏదో కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటళ్లలో దొరుకుతుందని మాత్రం కాదు. నిజానికి పరిశోధన, అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఇతర సిబ్బంది ప్రభుత్వ హాస్పిటళ్లలో అందుబాటులో ఉంటున్నారు. కానీ, నిలబడటానికి కూడా వీల్లేని దుర్భర పరిస్థితులు ఉండబట్టే కదా అక్కడి నుంచి బయటపడటానికి ఎవరైనా తన్నుకులాడేది. అయినా గానీ, ఆ ఇబ్బందికర పరిస్థితులను భరిస్తూ సామాన్య ప్రజలు లక్షలాదిగా ఇంకా అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు అంటే అది అక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది నిబద్ధత వల్లనే. మీ ధోరణి చూస్తుంటే కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వారి నైపుణ్యాన్ని అవమానపరుస్తున్నట్టే అనుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే గోడల మీద, అంబులెన్స్‌ల మీద ఫొటోలు మార్చడంలో ఉన్న శ్రద్ధ ప్రాథమిక వైద్య సౌకర్యాల కల్పన మీద పెట్టాలి.
ఈ మధ్య కొన్ని సందర్భాల్లో పేషెంట్లతో కలిసి హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ పెద్ద దవాఖానలకు వెళ్తే, అక్కడి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఇతరులు చెప్పినదేంటంటే, ఎక్కడైనా జరిగే ట్రీట్మెంట్ ఒకటే. అయితే ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాలు తక్కువ ఉంటాయి. వాటిని భరించి ఉంటామంటే ఉండండి, లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్లొచ్చు అని మర్యాదగా చెప్తున్నారు. తమకు నచ్చినచోట వైద్యం చేయించుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. సరే, ఆర్థికంగా ఖర్చు భరించగలిగిన వాళ్లు ప్రైవేటుకు వెళ్తారు. మరి ఆ భారం భరించలేని వాళ్ల పరిస్థితి ఏమిటి? అంటే వారికి ఆత్మగౌరవం ముఖ్యం కాదా? మంచినీళ్లను, సరైన టాయిలెట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలు ఎందుకు? ప్రాథమిక సౌకర్యాలు లేకపోవటం వల్ల సామాన్య ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లను విడనాడే పరిస్థితులను మార్చి, ప్రజారోగ్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేసే వైపుగా రాజకీయ వ్యవస్థ ఉండాలని, ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుతున్నాం, ఆశిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, ప్రజా సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియ ద్వారా, ఆరోగ్య హక్కుకు సంబంధించి ఒక బలమైన చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తుందని ఆశిస్తున్నాం.
(లేఖపై సంతకాలు చేసిన వారు: శాంతా సిన్హా, కే.సజయ, కనీజ్ ఫాతిమా, వీ.సంధ్య, కొండవీటి సత్యవతి, కంకెపూడి అనూరాధ, నూర్జహాన్ సిద్ధిఖీ, సుజాత సూరేపల్లి, ఏవీ అంబికా, మీరా సంఘమిత్ర, లిస్సీ జోసెఫ్, ఆశాలత, మొగిలి విజయ వసంత, గిరిజా పైడిమర్రి, షేక్ సలావుద్దీన్, పీ.అనురాధారావు, టీ.వర్గీస్, సయ్యద్ సాబీర్, కృష్ణ కుమారి, అఖిలేశ్వరి రామాగౌడ్ సహా 115 మంది తదితరులు)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

