SLBC Tunnel Collapse | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత నిర్వాకం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) పథకం భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది. సాంకేతికంగా సంక్లిష్ట రీతిలో పనులు మొదలు బెట్టి మూడడుగుల ముందుకు ఆరడుగుల వెనక్కు అన్నట్టుగా నత్త నడకన పనులు చేయడమే కాకుండా ఇప్పుడు తొందరపాటుతో మొత్తం ప్రాజెక్టును ముప్పులోకి నెట్టింది. తాజాగా పనులు పునఃప్రారంభమైన నాలుగో రోజే సొరంగం కుప్పకూలింది. 42 మంది తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. 8 మంది మాత్రం లోపల చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు వివిధ విభాగాలు రంగంలోకి దిగాయి. నాగార్జునసాగర్ డ్యాం సమీపంలోని సుంకిశాల ఇంటేక్ వెల్ రక్షణ కుడ్యం కుప్పకూలిన వెనువెంటనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వీటి వెనుక సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
అవినీతి, అసమర్థత ప్రాజెక్టులతో పాటుగా మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నది. నాణ్యత పరిశీలన, పర్యవేక్షణలో ప్రభుత్వ వైఫల్యం వల్లే వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్లో 2023లో టన్నెల్ ప్రమాదం జరిగితే ఉన్నతస్థాయి సాంకేతికతను, నైపుణ్యాలను రంగంలోకి దింపి కాపాడగలిగారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సహాయక చర్యలపై నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సహాయ కార్యక్రమాలను తగిన రీతిలో నిర్వహించవచ్చనే మాట వినిపిస్తున్నది.
తన దాకా వస్తేగానీ తత్వం బోధపడదంటారు పెద్దలు. కొందరు బోధపడినా నిద్ర నటిస్తూ తప్పించుకోవాలని చూస్తారు. మన సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి అలాగే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటి రెండు పిల్లర్లు కుంగితే ఆ సంగతి ఇల్లెక్కి కూశారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పిలిపించి శ్లాబుల మధ్య ఉండే సందులను పగుళ్లుగా ప్రచారం చేశారు. మొత్తం ప్రాజెక్టే పనికిరాకుండా పోయిందని నానా హంగామా చేశారు. ఎవరి ప్రాణాలకు హాని కలుగని సాదాసీదా ప్రాజెక్టు సమస్యపై ఇంత రాద్ధాంతం చేసిన సీఎం ఇప్పుడు శ్రీశైలం ఎడమకాల్వ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడితే నోరు మెదపడం లేదు. టింగురంగా అంటూ ప్రచారాలు, పర్యటనలు, ప్రారంభోత్సవాలు యథావిథిగా కొనసాగిస్తున్నారు.
కాళేశ్వరం పూర్తిగా కేసీఆర్ ముద్ర వేసుకున్న ప్రాజెక్టు కావడం వల్లనే బురదజల్లాలని చూశారు. చిన్నపాటి సమస్యను భూతద్దంలో చూపి ప్రాజెక్టునే పడావు పెట్టేందుకు తెగించారు. దీని ఫలితంగా వ్యవసాయం అటకెక్కినా ఫరవా లేదన్నట్టుగా పోతున్నారు. ఇది రాస్తున్న సమయానికి సొరంగంలో చిక్కుకున్న ఎనిమది మంది పరిస్థితిపై ఇదమిత్థంగా సమాచారం ఏదీ రాలేదు.
సీఎంకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రమాదం గురించి వాకబు చేశారని, పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే సీఎం ప్రమాదం గురించి ఏమనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అనే సంగతి బయటకు రాలేదు. సహాయచర్యల బాధ్యత మంత్రులకు అప్పగించి ఆయన చేతులు దులిపేసుకున్నారు. కొంపలు అంటుకుపోతుంటే గుంపుమేస్త్రీకి ఎలాంటి బాధ్యత ఉండదా? ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటం కన్నా తన పదవిని కాపాడుకోవడం మీదే సీఎంకు ఎక్కువ ధ్యాస ఉన్నట్టుంది. ‘నన్ను విలన్లా చూస్తున్నారు, కాపాడమని’ కాంగ్రెస్ బీసీ నేతల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.