రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా ఆసరా పింఛన్‌దారుల అయోమయం ఇంకా తీరడం లేదు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు పెంచి ఇస్తామన్న పింఛన్లకు ఇంతవరకు అతీగతీ లేదు. కనీసం గత ప్రభుత్వం అందించిన పింఛన్లనైనా సకాలంలో ఇవ్వకపోవడంతో పింఛన్‌దారులు అయోమయంలో కూరుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే, గత రెండేండ్లలో దివ్యాంగులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఏడాదికి రెండు సదరణ్ క్యాంపులను నిర్వహించింది. దివ్యాంగ ధృవీకరణ పత్రాలను వేల సంఖ్యలో జారీచేసింది. కానీ, అన్ని అర్హతలు సాధించి నూతనంగా ధృవీకరణ పత్రాలు పొందిన దివ్యాంగులు ఇప్పటివరకు తొలి పింఛన్ అందుకోలేదు. దీంతో దివ్యాంగులు సైతం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. సాధారణ ఎన్నికలు మళ్లీ వస్తే తప్ప తమ పింఛన్ దస్ర్తాలు ముందుకు కదలవా అని దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు.
నిత్యావసర వస్తువులు, మందుల ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో అన్నిరకాల పింఛన్ల పెంపుదల అనివార్యమవుతున్నది. కానీ, ప్రభుత్వం ఈ విషయాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. వీరి పరిస్థితి ఇలా ఉంటే, సర్వీస్ పెన్షన్‌దారుల విషయంలోనూ ప్రభుత్వం మందకొడిగానే వ్యవహరిస్తున్నది. 2024, ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన వీరి బకాయిలను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకున్నది. సర్వీస్, ఫ్యామిలీ పెన్షనర్ల బకాయిలు ఉదారంగా ఇచ్చేవి కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. సర్వీసు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము వారు ఉద్యోగ కాలంలో పొదుపు, మదుపు చేసుకున్న సొమ్ము అని తెలుసుకోవాలి.
ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్ల వరకు పేరుకుపోయి ఉన్నాయి. అంటే, ఉద్యోగులు మదుపు చేసుకున్న సొమ్మును ప్రభుత్వం వాడే సుకొని ఉద్యోగుల భవితవ్యం, భద్రతను గాలికి వదిలేస్తున్నదనే విషయం స్పష్టమవుతున్నది. వృద్ధాప్య పింఛన్లు, సర్వీస్ పెన్షన్లు పొందుతున్నవారంతా 60 ఏండ్లు దాటినవారే. వీరిని అనారోగ్య సమస్యలు కూడా అలుముకుంటున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న, నిస్సహయ స్థితిలో ఉన్న వీరి సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకొని మానవీయ దృక్పథంతో స్పందించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
– ఎన్.తిర్మల్ 94418 64514