వాళ్లు అత్యల్ప ఆరోగ్య వ్యయం, అతి తక్కువ వనరులున్న దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. అయితేనేం, అక్కడి వసతుల లేమి వారికి అడ్డంకిగా మారలేదు. మారుమూల ప్రాంతాలు, అడవులు, కొండకోనల్లో తిరుగుతూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రాణాంతక వ్యాధులపై అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారులను అడ్డుకునేందుకు యావత్ ప్రపంచం వారిపై, వారు చేసే పరిశోధనలపై ఆధారపడుతున్నదంటేనే ఆ శాస్త్రవేత్తల కృషిని అర్థం చేసుకోవచ్చు. వారే ఆఫ్రికా ఖండానికి చెందిన శాస్త్రవేత్తలు.
ఎల్లో ఫీవర్, హెచ్ఐవీ, ఎబోలా, లస్సా లాంటి మహమ్మారుల కారణంగా లక్షలాది మంది మరణాలను చవిచూసిన ఆఫ్రికా ఖండంలో మళ్లీ వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధులపై ఆ ఖండానికి చెందిన 8 మంది వైద్య శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. అత్యాధునిక జన్యు పరికరాలు, డేటా షేరింగ్ ప్లాట్‌ఫాంలు, షూలెదర్ ఎపిడెమియాలజీని ఉపయోగించి వారు చేస్తున్న పరిశోధనలు మానవాళికి వరంగా మారాయి.
మధ్య ఆఫ్రికాలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్‌కు కారణమైన ఎంపాక్స్ స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు సరికొత్త సవాల్‌గా మారింది. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, అటవీ నిర్మూలన, పెరుగుతున్న పశువుల ఉత్పత్తి అంటువ్యాధుల వ్యాప్తిని వేగవంతం చేస్తున్నాయి. ముందస్తుగా గుర్తించడం, వ్యాధుల వ్యాప్తి పట్ల ప్రతిస్పందించాల్సిన అవసరాన్ని ఇది నొక్కిచెప్తున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ గ్లోబల్ ప్రోగ్రామ్‌కు సెనెగల్‌కు చెందిన అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ ఇబ్రహీం సోసె ఫాల్ నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక వైద్య బృందాలకు మూడు దశాబ్దాలకు పైగా మలేరియా నియంత్రణతో పాటు కొత్తగా పుట్టుకొచ్చే ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై ఆయన శిక్షణ ఇస్తున్నారు. జోహెన్నస్బర్గ్లోని విట్వాటర్స్రాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజిస్ట్ మెరిట్జీ వెంటర్ అంటువ్యాధుల నిఘా నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడంలో ఆయన ఎంతగానో కృషిచేశారు. దోమల ద్వారా వ్యాపించే వైరస్‌లపై పరిశోధనలకు ఇది దోహదపడింది. అదే విశ్వవిద్యాలయానికి చెందిన చిన్న పిల్లల నిపుణుడు, వ్యాక్సినాలజిస్ట్ సబీర్ మధి యాంటీబయోటిక్- రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మరణాలను నివారించడానికి రోగనిరోధకతపై పనిచేస్తున్నారు. జాంబియా నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్కు చెందిన పశువైద్యుడు, ఎపిడెమియాలజిస్ట్ రేమండ్ హమూంగా మానవులు, పశువులు, మొక్కలు, పర్యావరణ పరిస్థితుల కారణంగా వ్యాపించే సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇలా ఎందరో ఆఫ్రికా ఖండానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచం ఎదుర్కొం టున్న ప్రాణాంతక వ్యాధుల నివారణకు కృషిచేస్తునారు.
యావత్ ప్రపంచం ఎంపాక్స్ పట్ల ఆందోళనగా ఉన్నది. కానీ, ఆఫ్రికాలో అది సాధారణ విషయం. ఎందుకంటే, అలాంటి ఎన్నో వ్యాధులు అక్కడి ప్రజల అనుభవంలో ఉండటమే అందుకు ప్రధాన కారణం. జికా, డెంగ్యూ, వెస్ట్ నైల్, సింద్బిస్, షుని, రిఫ్ట్ వ్యాలీ లాంటి ప్రాణాంతక వ్యాధులు ఆఫ్రికాకు సుపరిచితం.
ఇంకా చెప్పాలంటే.. వీటిలో చాలావరకు ఆఫ్రికాలో పురుడుపోసుకున్నవే. వసతులు, వనరుల సమస్యలు వెంటాడుతున్నప్పటికీ ఆఫ్రికా శాస్త్రవేత్తలు వెనుకడుగు వేయడం లే దు. పరిశోధనలను ఆపడం లేదు. వినూత్నమైన పరిశోధనలు చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అందుకే వారికి పజలూ సహకరిస్తున్నారు. ఎందుకంటే, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురుచూడ టం లేదు. అక్కడి శాస్త్రవేత్తలే ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తున్నారు, మహమ్మారుల నుంచి ప్రపంచాన్ని కాపాడుతున్నారు.
– జానిస్ క్యూ (‘బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో)