తరాల గోసలకు దారులు పడ్తున్నయ్
చిన్న గెలుపైనా మా చిన్న కులాలకు పెద్ద మలుపే
మా వాటా మాకేనని గుమిగూడిన
పెత్తందారీల కుట్రలనే ఛేదించాలె.
ఏదీ దక్కకుండా చేసినోళ్లు
అధికారాలన్నీ కాజేసినోళ్లు
మనమంతా జమైతుంటే
కుట్ర రాజకీయాల కుతంత్రాలైండ్రు.
మన సంపదలు హక్కులు లాక్కున్నోళ్లే
వాళ్ల పీఠాల కోసం బీసీ జపం చేస్తుండ్రు
పార్టీలన్నీ బీసీ జపమే చేస్తున్నయ్
కనికట్టు మోసగాళ్లతో జర జాగ్రత్త
ఎవరికి వాళ్లు విడిపోయి
చిల్లాకల్లమై చెదిరినోళ్లం
ఓ కాడికి కూడటమే బీసీల గెలుపు
మనమడిగేది వాళ్ల నోటికాడ ముద్ద కాదు
చేరాల్సిన దారి దూరమేమీకాదు చెయ్యాల్సింది శానుందే
మనం భిన్నత్వంలో ఏకత్వ నిర్వచనం
సమ వాటా, సమన్యాయం, ఆత్మగౌరవం
ప్రతి బీసీ స్వప్నం, అదే మన ఉద్యమం
బ్యాలెట్‌ను బుల్లెట్ చేయాలె
గురితప్పని చూపులు సారించు
రాజ్యాధికారమే అంతిమ తీర్పని
ప్రతి బీసీ ఓటెత్తాలె, ఆత్మగౌరవమై పోటెత్తాలె
బీసీ ముసురు కమ్మింది
ఇక ఇది వదిలేది కాదు
ఆధిపత్యాలకు ముగింపు తప్పదు
బీసీ విప్లవం ప్రజ్వరిల్లి తీరుద్ది
ఏడుతరాల చరిత్రను చదువుకొని
వేటగాళ్ల చరిత్రకు వీడ్కోలు పలుకుతున్నా
నా చరిత్రకు నేనే రాజ్యాధికార వీలునామా రాస్తున్నా
నా చరిత్ర బహుజన చరిత్ర
స్థానికం కోసం చేసే సమరమే మన అస్తిత్వం
పంచాయితీలనడిగేది పార్లమెంట్‌కు పోయేందుకే
మన ఓటే మన బలం బలగం
బడుగోళ్ల అధికారంలోనే దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం
బీసీల యుద్ధానికి లెక్కచెప్పేదే బహుజనగణన
మా తరాల త్యాగాలతోనే దేశం నిలబడ్డది
ఈ బహుజన జాతుల జాతీయగీతం
కొందరి కోసం కాదు, అందరి కోసం
– జూలూరు గౌరీశంకర్