తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత, 1980లలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. దీంతో గ్రామాల్లో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు తమ తమ భూములను వదిలేసి పట్టణాలకు వలసపోయారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్లో ఉన్న దిగువ, మధ్యతరగతి రైతులు కొంతమంది పట్టదారులయ్యారు. అయితే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫామ్‌హౌజ్‌ల కోసం అంటూ పేర్లు మార్చుకొని మళ్లీ తెలంగాణ పల్లెల్లో నాటి వలసదారులే నేడు రైతుల నుంచి వందల ఎకరాల్లో భూములు కొంటున్నారు. ఈ నయా భూస్వామ్య విధానం మన కండ్లముందే సాక్షాత్కరిస్తుండటం విడ్డూరం. గతంలో అయితే భూస్వాములు కనీసం ఆ గ్రామంలోని రైతులకన్న పరిచయం ఉండేవారు. కానీ, ఆధునిక పట్టాదారులు ఆ గ్రామస్థులకు కూడా కూడా పరిచయం ఉండటం లేదు. ఫామ్‌హౌజ్ కల్చర్ అంటే ఇదేనా?
2005 వరకు తెలంగాణ పల్లెల్లో రైతులు అవసరాల కోసం తమ భూములు అమ్ముకుంటే పక్కన ఉన్న రైతులు, గ్రామస్థుల సమక్షంలో పంచాయతీ పెట్టి ఆ భూమికి ధర నిర్ణయించేవారు. మాట ప్రకారం డబ్బులు కట్టి సాదా బైనామా లేదా రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. కానీ, ఇప్పుడు ఏ గ్రామంలోనైనా భూమి అమ్మితే కనీసం ఆ పక్కన ఉన్న రైతుకు కూడా తెలియడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇదేనా? ఈ వ్యాపారంతో భూమిని రెండు రకాలుగా విభజించవచ్చు. 1.భూమిని నమ్ముకునేవారు (రైతులు), 2.భూమిని అమ్ముకునేవారు (కొని, అమ్మేవారు వ్యాపారులు).
ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార భూతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని రైతుల భూములను దావానలంలా దహించి వేస్తున్నది. పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో డబ్బుండి వ్యవసాయం అంటే కూడా తెలియని డబ్బున్న వారి చేతుల్లోకి తెలంగాణ వ్యవసాయ భూములు సగానికి పైగా వెళ్లిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వ్యవసాయ భూములు సగం కంటే ఎక్కువగా ఆ గ్రామ రైతులు కాని రైతుల చేతుల్లోకి వెళ్లిపోయాయంటే అతిశయోక్తి కాదు. సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలంలోని తునికి ఖల్సా గ్రామమే అందుకు ఉదాహరణ. ఈ గ్రామంలో నేను ఏడేండ్లుగా ఉంటూ పరిశీలించి, పరిశోధన చేసిన అంశాలు ఇవి.
ఈ గ్రామం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 20 కిలో మీటర్ల (హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు) దూరం, రాజీవ్ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుంది. స్థూలంగా ఈ గ్రామ స్వరూపాన్ని తీసుకున్నటయితే ప్రస్తుత జనాభా సుమారు 4,600. కాగా ఈ గ్రామంలోని మొత్తం కుటుంబాల సంఖ్య 930. రెవెన్యూ ప్రకారం ఈ గ్రామంలో భూమి విస్తీర్ణం సుమారు 4,192 ఎకరాలు. ఓటర్ల సంఖ్య 2,400. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3300 ఎకరాల భూమి ఉన్నది. కాగా, ఆ గ్రామ రైతుల చేతుల్లో ఉన్న భూమి 1,113 ఎకరాల 33 గుంటలు. పట్టా భూమి 947 ఎకరాలు 33 గుంటలు. ప్రభుత్వ భూమి 166 ఎకరాలు.
ఈ గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం కాగా, 2006లో ఒక ఎకరా రూ.35 వేల చొప్పున అమ్ముడుపోయింది. ఈ గ్రామంలోని 1,203 ఎకరాల భూమి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల చేతుల్లోకి పోయింది. మిగతా భూమిలో చెరువు కుంటలు 15, ఒక్క వాగు, అడవి, గుళ్లు గోపురాలు, పాఠశాలలు, పార్కు, కరెంట్ సబ్‌స్టేషన్ వంటివి ఉన్నాయి. ఈ గ్రామంలో ప్రస్తుతం భూమి ఉన్న కుటుంబాల సంఖ్య 534. భూమి లేని కుటుంబాల సంఖ్య 396. 1995 నుంచి 2014 వరకు సుమారు రెండు దశాబ్దాల పాటు తెలంగాణలో విపరీతమైన కరువు ఏర్పడటంతో వ్యవసాయం మీద నమ్మకం పోయింది. రైతులకు తమ బతుకుపై భరోసా లేక, ఇతర అవసరాలు, కుటుంబ పోషణ భారం అవడంతో భూములను ‘అడ్డీకి పావుశేరు లెక్కన’ అమ్ముకున్నారు. ఆ కరువు సమయంలో డబ్బులున్నవాళ్లు వ్యవసాయ భూములను ప్రాంతాలకతీతంగా కొనుగోలు చేశారు.
ఈ గ్రామానికి రోడ్డుకు ఇరువైపులా భూములను ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇప్పటికే కొనేశారు. ఈ గ్రామం హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో 50 శాతం కంటే ఎక్కువ భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఒక ఎకరా ధర రూ.2 కోట్ల వరకు పలుకుతున్నది. గ్రామస్థులు కనీసం ఇల్లు కట్టుకుందామన్నా జాగ కొనుక్కోలేని పరిస్థితి. భూమి ఉన్న రైతులకు మాత్రం అమ్ముకుంటే ధర వస్తదనే ఒక భరోసా అయితే మిగిలింది. గ్రామాలు హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వరమా? శాపమా? ఈ గ్రామంలోని 150 ఎకరాల్లో విత్తన పరిశోధన కేంద్రం ఉన్నది. అందులో ఈ గ్రామానికి చెందిన మహిళలు దాదాపు 100 మంది పనిచేస్తారు. మిగతా భూముల్లో చుట్టూ కాంపౌండ్‌వాల్స్ పెట్టి ఇందులో సోలార్ పవర్ ప్లాంట్, మామిడితోటలు, నర్సరీలు, స్పిన్నింగ్ మిల్, ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారు. అందులో కనీసం గ్రామస్థులకు కూడా పని దొరకదు. ఈ భూములన్నీ పడావుగా ఉన్నాయి.
సామాజిక వర్గాల వారీగా ఈ గ్రామంలో మొత్తం 93 కుటుంబాలు ఉండగా, అందులో ఎస్టీ-5, ఎస్సీ-230, బీసీ-630, ఓసీ-65, ముస్లిం మైనారిటీ-40 మొత్తం కుటుంబాలున్నాయి. భూమి ఉన్న కుటుంబాల సంఖ్య మొత్తం 534 కాగా, సామాజికవర్గాల వారీగా ఎస్టీ-0, ఎస్సీ-135, బీసీ-363, ఓసీ-36, ముస్లిం మైనారిటీ-25 కుటుంబాలకు భూమి ఉన్నది. 2025 ఫిబ్రవరి నాటికి పరిస్థితి భూ విస్తీర్ణం, కుటుంబాల సంఖ్య 534 అయితే, 0.01 గుంటల నుంచి 20 గుంటల భూమి ఉన్న కుటుంబాలు 120. 0.21 గుంటల నుంచి ఒక ఎకరం భూమి ఉన్న కుటుంబాలు 105. 1 నుంచి 2 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 115. 2 నుంచి 3 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 90, 3 నుంచి 4 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 40. 4 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 29. 5 నుంచి 6 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 15. 6 నుంచి 7 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 7. 7 నుంచి 8 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 1. 8 నుంచి 9 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 3. 9-10 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 2. 10 నుంచి 15 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 3, 15 నుంచి 18 ఎకరాల భూమి ఉన్న కుటుంబాలు 4.
ఈ గ్రామంలో మంచి పంటలు పండించే రైతాంగం ఉన్నది. వారి భూమితో పాటు 120 కుటుంబాలు కౌలుకు తీసుకొని మరీ వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన పంటలు వరి, కూరగాయలు, ఆకుకూరలు. ముఖ్యంగా ఈ గ్రామం ఆలుగడ్డకు ప్రసిద్ధి. ఈ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో వంటిమామిడి కూరగాయల మార్కెట్ ఉన్నది. కాబట్టి, చాలామంది రైతులు కూరగాయలే పండిస్తారు.
రాష్ట్రంలో పట్టణాలకు సమీపంలో, హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో కొంచెం ఎక్కువ, తక్కువగా అన్ని గ్రామాల్లో పరిస్థితి ఇలానే ఉన్నది. రైతులు కాని వారి చేతుల్లో భూమి ఉన్నది. అందులో పంటలు పండటం లేదు. వారు కేవలం సామాజిక హోదా కోసమే భూమిని కొనుగోలు చేశారనేది సుస్పష్టం. ఇలా పంటలు వేయకుండా భూమిని పడావుంచితే భవిష్యత్తులో ఆహార కొరత కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి, పంటలు వేయని భూములపై చర్యలు తీసుకునే చట్టాలను తీసుకురావాలి. రైతులకు విజ్ఞప్తి ఏమంటే.. ఎవరు కూడా భూములను అమ్ముకోవద్దు. భూములు సామాజిక హోదాతో పాటు తరతరాలకు తరగని నిధి. భవిష్యత్తు తరాలకు భూమితో పాటు వ్యవసాయాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. భూమిని, వ్యవసాయాన్ని కాపాడుకుందాం. రైతును గౌరవిద్దాం.
– పులి రాజు 99083 83567