కాలేజీ టీచర్ల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ కోసం నిబంధనల ముసాయిదాపై ఫిబ్రవరి 5వ తేదీ లోపు అభిప్రాయాలు తెలపాలంటూ యూజీసీ కోరుతున్నది. ఈ నిబంధనలు స్థూలంగా జాతీయ విద్యావిధానం 2020 నిర్దేశాలకు అనుగుణంగా, కార్పొరేట్లకు అనుకూలంగా, టీచర్లపై ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయి.
గతంలో టీచర్ల పనితీరును అంచనా వేసేందుకు అకడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మార్కులతో లెక్కించి ప్రమోషన్లు ఇచ్చేవారు. మార్చిన నిబంధనల క్లాజ్ 3.8 ప్రకారం తొమ్మిదింటిలో కనీసం నాలుగు విషయాల్లో మార్కుల ప్రాతిపదికన కాకుండా గుర్తించదగిన ప్రతిభపై ఆధారపడి టీచర్ల ఎంపిక, ప్రమోషన్లు ఉంటాయి. అవి (1) బోధనలో వినూత్న విధానాలను అనుసరించే ప్రతిభ, (2) బోధన, పరిశోధన విషయాలపై ప్రయోగశాలలను ఏర్పరిచే సామర్థ్యం, (3) ప్రాయోజిత పరిశోధనకు ప్రధాన పరిశోధకుడిగా ఉండటం, (4) భారతీయ భాషల్లో బోధనకు చేసే కృషి, (5) ఇండియన్ నాలెడ్జ్ సిస్టంలో బోధన, పరిశోధనలకు చేసే కృషి, (6) విద్యార్థుల ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టుల పర్యవేక్షణ, (7) ఎంవోవోసీఎస్ కోసం డిజిటల్ కంటెంట్‌ను అభివృద్ధి పరచడం, (8) సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తించదగిన భాగస్వామ్యం, (9) రిజిస్ట్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్టరై ఉన్నత విద్యాసంస్థల మేధోసంపత్తి విధానాలకు అనుగుణంగా స్టార్టప్‌లను ప్రారంభించడం. వృత్తి ప్రారంభ దశలో టీచర్ల నియామకానికి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ఉన్నత విద్యలో పనిచేసిన అనుభవం ఉంటే తప్ప వీటిలో కృషిచేసే అవకాశం ఉండదు. ఒకవేళ కాంట్రాక్టు టీచర్‌గానో, గెస్ట్ టీచర్‌గానో అనుభవాన్ని కలిగి ఉన్నా, వారికి ఈ విషయాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు సరిగా ఉండవు.
క్లాజ్ 3.8-2,3,6,9 పాయింట్లు కార్పొరేట్ చోదక అజెండాగా కనిపిస్తున్నాయి. టీచర్లు ప్రయోగశాలను ఏర్పరచుకోవడం, స్పాన్సర్లను వెతుక్కుని ఇన్వెస్టిగేటర్స్‌గా ఉండటం, ఇంటర్న్‌షిప్‌ల పర్యవేక్షణ వంటివి కార్పొరేట్ల సహకారంతో చేపట్టాలని చెప్తున్నాయి. బిర్లా-అంబానీ కమిటీ ప్రతిపాదనలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లే ప్రతిపాదనలు ఇవి. దీనికితోడు ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ పేరుతో వేకెన్సీలో 10 శాతం వరకు ఇండస్ట్రీ, ఇతర నాన్ అకడమిక్ వృత్తులకు సంబంధించిన వ్యక్తులను నియమించుకోవచ్చని క్లాజ్ 9 చెప్తున్నది. దీనిని బట్టి ప్రస్తుతం ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ అవగాహన రహితులన్న చెడు అభిప్రాయాన్ని ఇది కలిగిస్తున్నది.
అకడమిక్ నేపథ్యం కలిగిన వ్యక్తినే వీసీలుగా నియమించాలని గత నిబంధనలు చెప్తున్నాయి. కానీ, ప్రస్తుత నిబంధనలు బ్యూరోక్రాట్లు, ఇండస్ట్రీ వ్యక్తులు కూడా వీసీలు కావొచ్చని స్పష్టం చేస్తున్నాయి. విద్యాసంస్థలను ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్స్తోనే నడపాలనే మౌలిక నియమానికి ఇది వ్యతిరేకం. ఈ నిబంధనలు వీసీల నియామక కమిటీ చైర్పర్సన్ నియామకానికి గవర్నర్‌కు అధికారాలు ఇస్తున్నాయి. దీనివలన కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధం. గవర్నర్లు యూనివర్సిటీల చాన్స్లర్లుగా ఉండటం వల్ల తటస్థంగా ఉండాల్సిన వారు సున్నితమైన రాజకీయ పరిస్థితుల్లోకి లాగబడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర సంబంధాల సమీక్ష కోసం నియమించిన జస్టిస్ మదన్మోహన్ పూంచి కమిషన్ భావించింది. యూనివర్సిటీల చాన్స్లర్లుగా గవర్నర్లను నియమించరాదని అది సూచించింది.
పాయింట్ 7.. డిజిటల్ కంటెంట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నది. పరోక్షంగా ఇది ఆన్లైన్ విద్యను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల టీచర్లపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. క్లాజ్ 5. 6. 3, 5. 6. 4 ప్రకారం టీచర్లకు ప్రమోషన్లు వారి వ్యక్తిగత ప్రమోషన్ తేదీలతో కాకుండా సంవత్సరంలో రెండు పర్యాయాలు, జనవరి, జూలై నెలల్లోనే ఇస్తారు. అంటే ప్రమోషన్ తేదీ జనవరి ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు ఉన్న ఏ టీచర్‌కు అయినా జూలై ఒకటవ తేదీ నుంచి మాత్రమే ప్రమోషన్ లెక్కిస్తారు. అలాగే, జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రమోషన్ తేదీలు కలిగిన వారికి తరువాతి సంవత్సరం జనవరి ఒకటి నుంచే ప్రమోషన్ లెక్కిస్తారు. దీనివల్ల టీచర్లు నష్టపోయే అవకాశం ఉన్నది.
2018 యూజీసీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు టీచర్ల నియామకం.. ఉన్న ఖాళీల్లో 10 శాతానికి మించకూడదు. కానీ కొత్త నిబంధనలు ఈ నిబంధనను తొలగిస్తున్నాయి. అంటే ఇకపై ఎలాంటి పరిమితి లేకుండా కాంట్రాక్ట్ టీచర్లను నియమించుకోవచ్చు. కాంట్రాక్టు టీచర్లు లేని వ్యవస్థను అభివృద్ధి పరుచుకోవాలనే స్ఫూర్తికి ఇది వ్యతిరేకం. దేశంలో యూనివర్సిటీ, కాలేజీ టీచర్ల సంఘాల అతి పెద్ద సమాఖ్య అయిన ఏఐఎఫ్యూసీటీవో ఈ కొత్త నిబంధనలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నది, వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది.