మంత్రితో చెక్ పెట్టేందుకు బంటును ఓ గడి ముందుకు జరపడం చదరంగంలో వ్యూహమే. ఇది చదరంగంలోనే కాదు, ఎక్కడైనా వ్యూహమే. బొక్కసం ఖాళీ, అప్పులూ పుట్టడం లేదు, అసలు ఆదాయ వనరులే లేవని రాజు చెప్తే.. అసలు ఉచితాలనేవే దండుగ, వాటిగురించి ఆలోచించుకోవాలని ఒక మంత్రి అనడం కూడా బహుశా చెక్ పెట్టడానికి ముందు బంటును కదిపే వ్యూహమే. ఎవరు, ఎందుకు అనేది పక్కనపెడితే ఒక ఎత్తుగడ రేవంత్ రెడ్డిదైతే మరో కదలిక తుమ్మలది. ఇదిఉచితాలను రద్దు చేయాలనే ఆలోచనకు ముందు జరుగుతున్న నాటకీయ పరిణామమే అయితే ఒకరకంగా మంచిది, మరోరకంగా చెడ్డది. చేపలు పట్టడం నేర్పాలి కానీ, ఉచితంగా చేపలు ఇవ్వకూడదని భావించే సామాజికవేత్తలకు మంచిది. ఆ ఉచితాలతోనే జీవితాలను ఈడుస్తున్న బడుగులకు చెడ్డది.
ఈ ఎత్తుగడ దేనికి చెక్ పెట్టడానికి? ఇస్తున్న ఉచితాలకు కోత పెట్టడానికా? ఇస్తామని చెప్పిన అనేకానేక హామీలను ఇవ్వలేం అని చెప్పడానికా? అర్థం చేసుకోవాల్సిన తలనొప్పి ప్రజలదే. కొంచెం లోతుగా ఆలోచిస్తే… ఖజానా, ఆస్తి, అప్పుల పట్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల ముందు తెలియ దా? ఎవరు గెలిచినా ఎదురవబోతున్నది ఇదే దుస్థితి అని అప్పుడు అవగాహనకు రాలేదా? వచ్చినా తులం బంగారం, స్కూటీలు, పింఛ న్ల పెంపు, రైతుబంధు పెంపు, గృహిణులకు నెల బత్తెం ఇంకా చాలా తాయిలాలను ప్రకటించారా? అవి ఇవ్వలేమని చెప్పడానికి ఈ రాజు ప్రకటనా, మంత్రి వ్యాఖ్యానం ఉపోద్ఘాతాలా?
అప్పుల బాధ వల్లనో, ప్రభుత్వం నడపలేకపోవడం వల్లనో ఇంకే ఇతర కారణం వల్లనో నిజంగా ఉచితాలను రద్దు చేయగల దమ్ము ప్రభుత్వాలకుంటే అది గొప్ప విషయమే. ఉచితాలనే ప్రభుత్వాలు స్వారీ చేస్తున్న నరమాం సం మరిగిన పులి లాంటివి. ప్రభుత్వాలు దిగి తే పులి స్వాహా చేస్తది. దిగకుంటే పులికి ఆహా రం దొరకదు. అప్పుడది తన మీదున్న వ్యక్తిని కిందికి తోసి మరీ తినేస్తుంది. ఈ ఆత్మబలికి ఏ ప్రభుత్వమూ సిద్ధంగా ఉండదు. ఈ ప్రహేళిక పరిష్కారానికి ఎవరో ఒకరు ధైర్యం చెయ్యడమే మార్గం. ఉచితాల పులిని వదిలించుకొని నష్టం చేసే పథకాలు కాక ప్రజలకు కావాల్సిన ఉపాధి, చౌకగా సరుకులు, ఉత్తమ విద్య, వైద్యం అందిస్తామనే నమ్మకాన్ని కలిగించే ప్రభుత్వాలు కావాలి. అది సాధ్యమా? ఈ ఉచితాల వల్ల రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుప్పకూలి ఉచితాలు కాదు గదా, అసలు ఏమీ ఇవ్వలేని దరిద్రానికి దిగజారేంత వరకూ ప్రభుత్వాలు మిన్నకుండి, ఆ తర్వాత వాటంతటవే దుక్నం కట్టేసుకునే పరిస్థితి దాపురిస్తుందేమో. అదోరకం పరిష్కారమా? ఇప్పుడు ఆ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం నిలబడిందా? నిజమే అయితే ఆ స్థితికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిజంగా మొండి ధైర్యం చేయగలదా? చేయడానికి సిద్ధపడుతున్నదా? అనుమానించాల్సిన పరిస్థితే మరి. ప్రభుత్వం నడపడం కేవలం గుంపు మేస్త్రి పనే అని చప్పరించేసిన మన రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం నడపడం ఆషామాషీ కాదన్న కేసీఆర్ అనే రెండు నిలువెత్తు ఉదాహరణలు ప్రజల ముందున్నా యి. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల వలె పరుగులు తీయాలి. కానీ, అభివృద్ధితో ఓట్లు రాలవని భారతీయ పరిస్థితులు చెప్తున్నాయి. అందుకే, ఉచితాల మీదనే రాష్ర్టాలు దృష్టి పెడుతున్నాయి.
ఉచిత పథకాలనేవి దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపొందాలి. ప్రాజెక్టులు కట్టాలి. తాగునీరు పుష్కలంగా అందించే ఆలోచన చెయ్యాలి. రోడ్లు వెయ్యాలి. విద్యుత్తు సరఫరా పరిధిని పెంచాలి. రేపటి ఆదాయానికి ఇవ్వాల్టి ఉచితాలు కూడా కొంత దోహదపడాలి. అలా కాకుండా కేవలం పప్పుబెల్లాల పందేరంలా మన ఉచిత పథకాలున్నాయనేది నిజం. రాష్ట్రం ఏదైనా కావచ్చు. ఆరోగ్య శ్రీ ఆలోచన మంచిదే కానీ దాన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కడుపారా భోంచేశాయి.
ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకం ప్రైవేట్ కళాశాలకు పండుగే అయింది. ఇక రైతు భరో సా, చేయూత, దీవెన, ఆసరా, తోఫా కానుక, ఇంటింటికి రకరకాల పింఛన్లు వంటి తాయిలాలన్నీ ఫలితం ఇవ్వని వ్యయాలే కదా? ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వమో, ఏకంగా కేంద్ర ప్రభుత్వమో ఒక శుభోదయాన ఉచితాలన్నీ రద్దని ప్రకటించిందనుకుందాం. ఎవరెవరి ప్రతిస్పందనలెలా ఉంటాయి? ఇది పాలన చేతగాని ప్రభుత్వం అంటుంది ప్రతిపక్షం. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అంటాయి వామపక్షాలు. సంక్షేమం లేని పాలన ఆత్మలేని దేహం అం టారు ప్రతిపక్షానుకూల మేధావులు. అంద రూ కలిసి ఏకంగా ధర్నాలకు, రాస్తారోకోలకు, బంద్‌లకూ దిగిపోతారు. ఆ ప్రభుత్వాన్ని కూల్చేంతవరకూ ఉద్యమాలు ఆగవు. ఉచితా లు అనుచితాలని వీళ్లందరికీ తెలుసు. తాము అధికారంలోకి వచ్చినా ఉచితాల భారాన్ని మోయలేమనీ వీరికి తెలుసు. అయినా ఈ ఓట్ల రాజకీయ ప్రతిస్పందన మూమూలే. కనుక ఏ ప్రభుత్వమూ ఉచితాల రద్దు ఆలోచన చెయ్యదు. అసలు అటువంటి ఆలోచన చెయ్యవచ్చనే సంకేతాలు కూడా ఇవ్వవు. మరిప్పుడు తెలంగాణలో వస్తున్న సంకేతాలను ప్రజలైనా, మేధావులైనా ఎలా అర్థం చేసుకోవాలి.
ఏ ప్రభుత్వమైనా ప్రస్తుత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు పోను మిగిలిన సొమ్ములో 35 శాతాన్ని ఇటువంటి ఉచితాల మీదనే ఖర్చు చేస్తుంది. ఇక అభివృద్ధికి నిధులెక్కడినుంచి వస్తాయి. ఈ వ్యవహారం లోటుకుదారితీస్తుంది. ప్రజలు అనవసర వ్యయాలకు అలవాటుపడతారు. ధరలు పెరుగుతాయి. దాంతో డిమాండ్ సప్లయి మధ్య దూరం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఏర్పడి ఆర్థికవ్యవస్థను కుప్పకూలుస్తుంది.
ఏ ప్రభుత్వమైనా ప్రస్తుత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు పోను మిగిలిన సొమ్ములో 35 శాతాన్ని ఇటువంటి ఉచితాల మీదనే ఖర్చు చేస్తుంది. ఇక అభివృద్ధికి నిధులెక్కడి నుంచి వస్తాయి. ఈ వ్యవహారం లోటుకు దారితీస్తుంది. ప్రజలు అనవసర వ్యయాలకు అలవాటుపడతారు. ధరలు పెరుగుతాయి. దాంతో డిమాండ్, సైప్లె మధ్య దూరం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఏర్పడి ఆర్థికవ్యవస్థను కుప్ప కూలుస్తుంది. వెనిజులా, శ్రీలంక మన కండ్లముందున్న సాక్ష్యాలు. ఉచితాలు పెరిగితే ఎవరైనా అప్పుల మార్గానికి మళ్లడం తప్ప మరో పరిష్కారం లేదు. ఆ రకంగా ప్రతి రాష్ట్రం ఒక వెనిజులా ఒక శ్రీలంక కావడానికి ఎంతో సమయం పట్టదన్నదీ నిజం. మరి మనమేం కాబోతున్నాం. తెలంగాణలో ఏం జరుగబోతున్నది. వ్యూహాలు, ఎత్తుగడలు సర్వసాధారణం. మంత్రిని బంటు చంపొచ్చు గాక, అంతమాత్రాన గెలిచినట్టు కాదు. రాజును చెక్‌మేట్ చేసినప్పుడే ఆట ముగిసినట్టు. ఇప్పటికైతే స్టేల్మేట్ అయినట్టే అనిపిస్తున్నది. ఏ ఎత్తుగడలో ఏం జరిగినా తమకే నష్టమని స్పష్టంగా తెలిసిన అమాయక ప్రజాపావులన్నీ డబ్బాలోంచి బిక్కుబిక్కుమంటూ తొంగిచూస్తున్నాయి.