e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News మహా మనిషి.. కాళోజీ

మహా మనిషి.. కాళోజీ

రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస రాం రాజా కాళోజీ ( kaloji ) .. ప్రజాకవిగా సుప్రసిద్ధులు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాత. నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సమరయోధుడు. కాళోజీ సంస్మరణార్థం తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినమైన సెప్టెంబర్‌-9 ని ‘ తెలంగాణ భాషాదినోత్సవం ’ గా ప్రకటించింది. 1992లో పద్మవిభూషణ్‌ అవార్డుతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.

‘ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను, ఔన్నత్యాన్ని చాటుతుంది. ప్రజా సమస్యల పట్ల సమగ్ర దృష్టి.. న్యాయం, సత్యం కోసం నిరంతర పోరాటం వల్ల ఆయన జీవితంలోని ప్రతి దశలో ప్రజాదరణ పొందారు.

- Advertisement -

అందరి గురించి ఆలోచించే వాడు ఒకే వ్యక్తికి అనుకూలంగా ఉండలేడు. ఆ అందరివాడిని ఓ వ్యక్తి తనకు అనుకూలంగా ఉండమని ఒత్తిడి చేస్తాడు.అందరివాడు ఒక చట్రంలో ఉండిపోడు. కినుక వహించి ఇక ఆ వ్యక్తి అందరివాడిని తన వాడు కాదని వదిలేస్తాడు. ఇలా అందరి వాడు ఎవరికీ చెందని వాడు అవుతాడు. ఇది కాళన్న స్వీయ అనుభవం కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే.. కాళన్న అందరివాడు మరి!.

ఎలాంటి వ్యాకరణ చట్రంలో ఇమిడి పోకుండా, స్వేచ్ఛగా వచన కవిత్వం రాసిన మొదటి కవి కాళోజీ. ఆయన విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారు. సత్యాగ్రహ ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వందేమాతరం ఉద్యమాలు, ఆర్య సమాజ్‌, స్టేట్‌ కాంగ్రెస్‌, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలతో రజాకార్ల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడాయన. ఆయన వ్యక్తిత్వం ఆయనను రాజకీయ పార్టీలకు అతీతంగా నిలబెట్టినా, ఆయన అంతరాంతరాల్లో రాజకీయవాది. ఆ దృక్పథంతోనే లోక్‌నాయ క్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ మరణించిన సందర్భంలో కాళోజీ రాసిన కవిత..
‘పుట్టుక నీది… చావు నీది

బ్రతుకంతా దేశానిది..’

వ్యక్తి చేతిలో లేనివి పుట్టుక, చావు మాత్రమే. అవి తప్ప బతుకంతా దేశానికి అర్పించారు జేపీ అని శ్లాఘించారు. అలతి పదాల్లో అనల్ప భావాన్ని నింపగలరు కాళోజీ.తెలుగు వాళ్లకు ఆంగ్లభాషా వ్యామోహం మీద ఆయన వాడి- వేడి చురకలేశారు.

‘ఏ భాష నీది!? ఏమి వేషమురా!..
ఈ భాష, ఈ వేషమెవరి కోసమురా?
ఆంగ్లమందున మాటలనగానే..
ఇంత కుల్కెదవెందుకురా!?
తెలుగువాడివై.. తెలుగు రాదనుచు.
సిగ్గు లేక ఇంక చెప్పుటెందుకురా..
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా..!’

అని ఈసడించారు.

కాళోజీ తాత్విక దృష్టికి ఈ రెండు వాక్యాలు చక్కటి ఉదాహరణ..

‘అతిథి వోలె వుండి వుండి
అవని విడిచి వెళతాను’
అంటారు కాళోజీ.

‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది../ ప్రపంచం బాధ శ్రీశ్రీది..’ అంటారు చలం. ఇక్కడ ‘ప్రపంచ బాధ కాళన్నది’అని తిరగ రాసుకోవాలేమో! ‘ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ అనే కవితలో.. ‘జరిగే అవకతవకలను సరి చేయలేను.. స్పందించకుండానూ ఉండలేను. ఎందుకో నాకు ఇంత బాధ!?’ అనే ఆవేదన ఈ కవితలో స్పష్టంగా కనబడుతుంది.

‘పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపొవును ఒళ్ళు
పతిత మానవు జూచి చితికి పోవును మనసు
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’
అని లోకం పడుతున్న బాధపట్ల దుఃఖించాడు.

‘మనిషి ఎంత మంచివాడు’ అనే కవిత చదివినప్పుడు.. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు’ అన్న నానుడి గుర్తొస్తుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అందరూ చుట్టూ చేరి అతని గుణగణాలను శ్లాఘిస్తారు. అతడి వల్ల చెడు జరిగి ఉండొ చ్చు. కానీ అతడి వల్ల జరిగిన చెడును.. అతడు దూరం అవడం వల్ల కలిగే బాధ డామినేట్‌ చేస్తుంది. అందుకే చనిపోయిన వాడు ఎప్పుడూ మంచివాడే. కానీ బతుకున్నవాడి చరిత్రపై రంధ్రాన్వేషణ ఎందుకని ప్రశ్నిస్తారు కాళోజీ.

నా గొడవ ’ కాళోజీ రచనల్లో ప్రసిద్ధి పొందిం ది. అయితే ‘నా గొడవ’ అనే శీర్షిక చూసినప్పుడు అది ‘ఆయన స్వీయ గొడవ’ అని భ్రమ పడే అవకాశముంది. అయితే నా గొడవ అంటే ఏమిటో.. కాళోజీ వివరం ఇచ్చినప్పుడు ‘దానికి ఇంత విస్తృ త అర్థం ఉన్నదా!’ అని ఆశ్చర్యం కలగక మాన దు. ‘నేనంటే.. భారత పౌరుడు. నా గొడవ ఆ పౌరుని స్థితి’. ఇంత సామాన్య పదాలకు అసామాన్య అర్థాలను ఇచ్చారు కాబట్టే కాళోజీ ఇంత ప్రశస్తి పొందారు.

‘నేనంటే నేడు /నా గొడవంటే నాడు
నిజమో కాదో కల రుజువు

నీవు నేనూ వాడూ
నేనంటె నేటి మనస్థితి వైనం
నేనంటె భరత పౌరుడు
నా గొడవ ఆ పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవాడు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు..’

అని ప్రకటించారు కాళోజీ.

కాళోజీ దృక్పథం ఎంత సుని శితమైనదో ఆయన చెప్పిన కథ వింటే తెలుస్తుంది. ‘మూడు దుడ్డెలు మేతకు పోయినయి. ఒకటి బాపనివాండ్ల దుడ్డె, ఒకటి కాపువాండ్లది, ఇంకొకటి వ్యాపారస్తుడిది. అవి మేత మేసినాంక, మూడూ పోయి వాగుల నీళ్ళు తాగినయి. బాపనదుడ్డె అన్నది గదా ఆహా వాగునీళ్ళు అమృతం వంతు తియ్యగ ఉన్నయి అని. కాపువాని దుడ్డె అది విని అమృతందేమున్నది? మా అమ్మ చన్నుపాలు ఇంకా తియ్యగుంటయి అన్నది. వ్యాపారి దుడ్డె అదివిని అట్లనా! అమ్మ చన్నులో పాలు ఉంటయా? అన్నది. ఇదంతా విని బాపనిదుడ్డె – అమ్మకు చన్నుగూడ ఉంటదా? అన్నది. దీంట్ల సంగతి ఏమిడిదంటె – ఒకడేమొ.. దుడ్డెకు పాలు దక్కనిస్తడు. ఇంకొకడేమొ.. చన్ను నోటికందనిస్తడు గాని ముందే పాలన్ని పిండుకుంటడు. ఇంకొకడు ఆ చన్నుకూడ నోటికందనీయడు..’.

ఆయన ఎప్పుడూ ‘మనిషిని మనిషి మాదిరిగా మన్నించ లేనంత మలినమైనదీ జగతి మలినమైన ది..’ అంటూ ఆవేదన చెందారు. ఆయన ఎప్పు డూ ఎవరినీ అనుకరించలేదు. ఆయన భాషలో సరళత, శైలిలో స్పష్టత, సమస్యల మూలాలపై విషయ సమగ్రత, నమ్మిన సిద్ధాంతం పై నిబద్ధత, వ్యక్తీకరణలో నిర్భయత్వం.. ఆ యనను ప్రజా కవిని చేశాయి. ప్రజల మనస్సులలో ఆ యనకు పదిలమైన స్థానాన్ని ఏర్పరిచాయి. ఆయన సిద్ధాంతాల్ని ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా ప్రవర్తించినప్పుడే నిజం గా కాళోజీని మనం స్మరించినట్లు. అన్ని రకాల పీడనల ను, అన్యాయాలు, అక్రమాలను ఎ దురించి పోరాడితేనే ఆయన బాటలో నడిచినట్లు.

‘నా గొడవ’ కాళోజీ రచనల్లో ప్రసిద్ధి పొందింది. అయితే‘నా గొడవ’ అనే శీర్షిక చూసినప్పుడు అది ‘ఆయన స్వీయ గొడవ’ అని భ్రమ పడే అవకాశం ఉంది. అయితే నా గొడవ అంటే ఏమిటో.. కాళోజీ వివరం ఇచ్చినప్పుడు ‘దానికి ఇంత విస్తృ త అర్థం ఉన్నదా!’ అని ఆశ్చర్యం కలగక మానదు. ‘నేనంటే.. భారత పౌరుడు. నా గొడవ ఆ పౌరుని స్థితి’.

ఎస్‌.వి.ఎం. నాగ గాయత్రి
9440465797

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Tags : Telangana Language Day | kaloji | kaloji narayana rao | Telangana movement | Telangana poet | తెలంగాణ భాషా దినోత్సవం | కాళోజీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana