ఠారెత్తిస్తున్న ధరలు
ధరలు ఠారెత్తిస్తున్నాయి. గత నెల అక్టోబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి ఎగబాకింది. రెండేండ్ల తర్వాత మళ్లీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గరిష్ఠ సహన పరిమితి 6 శాతాన్ని దాటింది.
- గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09%
- ఆర్బీఐ పెట్టిన హద్దు దాటిన సూచీ
- వచ్చే నెల పెరుగనున్న కీలక వడ్డీరేట్లు?
న్యూఢిల్లీ, నవంబర్ 12: ధరలు ఠారెత్తిస్తున్నాయి. గత నెల అక్టోబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి ఎగబాకింది. రెండేండ్ల తర్వాత మళ్లీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గరిష్ఠ సహన పరిమితి 6 శాతాన్ని దాటింది. ద్రవ్యోల్బణం కనిష్ఠంగా 2 శాతం, గరిష్ఠంగా 6 శాతం మధ్యే ఉండాలన్నది ఆర్బీఐకి ఉన్న లక్ష్యం. కాగా, 2024 అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.25 శాతంగా నమోదైంది. మళ్లీ ఇప్పుడే ఆ దరిదాపుల్లోకి వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5.54 శాతంగానే ఉన్నది.
అన్ని రంగాల్లో దౌడు తీస్తున్న రేట్లు
గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.74 శాతంగా ఉంటే, అక్టోబర్‌లో 8.94 శాతానికి పెరిగింది. ఆహార వస్తువులు, సేవలతో కూడిన 12 విభాగాల్లో 11 విభాగాల్లో ద్రవ్యోల్బణం ఎగిసినట్టు తేలింది. రెస్టారెంట్, వసతి సేవల్లో 10.06 శాతం, ఆహార, పానీయాల విభాగంలో 8.51 శాతం, వ్యక్తిగత సంరక్షణ, ఇతర వస్తువులు, సేవల్లో 10.14 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు
అధిక ద్రవ్యోల్బణం నమోదైన ఐదు ప్రధాన వస్తువులు, సరుకుల్లో ఉల్లిగడ్డ (116.22 శాతం), వెల్లుల్లి (60.74 శాతం), వెండి నగలు (52.39 శాతం), అల్లం (48.32 శాతం), నిమ్మకాయలు (47.30 శాతం) ఉన్నాయి. అలాగే పండ్లు, కూరగాయల రేట్లూ ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్ నినో కారణంగా దేశవ్యాప్తంగా అల్ప వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడం వల్ల రబీ పంటల పరిస్థితి, ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు సైతం గత నెల ద్రవ్యోల్బణాన్ని పరుగులు పెట్టించాయి. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో రవాణా ఖర్చులు పెరిగిపోవడం అన్ని వస్తూత్పత్తుల రేట్లను ఎగదోసింది.
గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం
రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిసిన నేపథ్యంలో డిసెంబర్ ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ రెపోరేటును మరోసారి పెంచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత నెల ఆరంభంలో జరిగిన సమీక్షలో పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచిన విషయం తెలిసిందే. దీంతో 5.50 శాతానికి చేరింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత ఇదే తొలి పెంపు. ఇక వచ్చే నెలలో 5.75 శాతానికి చేరడం ఖాయమన్న అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లూ పెరిగిపోతాయి.
ఫలితంగా ఈఎంఐల భారం మరింతగా రుణగ్రహీతలపై పడుతుంది. దీంతో కొత్త రుణాలకు డిమాండ్ తగ్గితే బ్యాంకింగ్, ఆటో, నిర్మాణ, దాని అనుబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ 2-4 మధ్య జరుగనున్న ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశానికి ముందు వచ్చిన ఈ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు.. దేశ ఆర్థిక ప్రగతిపైనే ప్రభావం చూపేలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, కృత్రిమ మేధస్సు (ఏఐ) దెబ్బకు ఊడిపోతున్న ఉద్యోగాలు.. దేశ ఎకానమీని ఇరకాటంలో పెడుతున్నాయి మరి.
తెలంగాణలో రేట్ల మోత
తెలంగాణలో ధరల దెబ్బకు సామాన్యులు కుదేలవుతున్నారు. జాతీయ ద్రవ్యోల్బణం గణాంకాలను మించి రాష్ట్ర ద్రవ్యోల్బణం గణాంకాలు నమోదవుతున్నాయి మరి. గత నెల అక్టోబర్‌లోనూ తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా రికాైర్డెంది. ఏకంగా 7.26 శాతంగా తేలింది. ఇదే సమయంలో జాతీయంగా 6.09 శాతంగా ఉండటం గమనార్హం. నిజానికి ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన ద్రవ్యోల్బణం గణాంకాలే రాష్ర్టాలవారీగా చూసినైట్టెతే టాప్‌లో ఉంటుండటం కలవరపెడుతున్నదిప్పుడు. ముఖ్యంగా ఆహారోత్పత్తుల ధరలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా సామాన్య, సగటు మధ్య తరగతి కుటుంబాల వంటింటి బడ్జెట్ తలకిందులైపోతున్నది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు కిలో రూ.80-120 స్థాయిలో ఉంటున్నాయి. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, ఇతర ఆహారోత్పత్తుల పరిస్థితీ ఇలాగే ఉన్నది. దీంతో ధరల అదుపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతున్నది. దీంతో త్రైమాసిక ద్రవ్యోల్బణం అంచనాను ఆర్బీఐ పెంచే అవకాశం ఉన్నది. ఫలితంగా వచ్చే నెల రెపో రేటు పెంపు ఖాయంగానే కనిపిస్తున్నది. – డీబీఎస్ బ్యాంక్
పాలు, చక్కెర, ఉల్లిపాయల వంటి వస్తువుల ధరల పెరుగుదలతో ఆహార, పానీయాల విభాగంలో వార్షిక ద్రవ్యోల్బణం ఈ నెలలో కూడా 8 శాతానికి పైనే ఉండవచ్చు.
– అదితి నాయర్, ఇక్రా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

