దేశమంతా రాజకీయ వాతావరణం అలముకొన్నది. ఏదైనా ఫంక్షన్లోనో, సమావేశాల్లోనో చర్చలు రాజకీయాల చుట్టే సాగడం సహజం. ఇటీవల ఓ ఫంక్షన్లో రాజకీయ చర్చ జరిగింది. దేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో తిరిగి ఎవరు అధికారంలోకి వస్తారు? ఎక్కడేం జరుగుతుంది? అనే వాటిపైనే అందరికీ ఆసక్తి సహజం. అక్కడంతా తెలంగాణ అభివృద్ధి గురించే చర్చ. హైదరాబాద్ వల్లే తెలంగాణ అభివృద్ధి అని ఇంకా కొంతమంది వాదన. అట్లయితే ఆర్థిక రాజధాని ముంబై మహారాష్ట్రకు రాజధానిగా ఉన్నది. అయినా అక్కడ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అభివృద్ధి ఏమైంది?
ఇటీవల నేను పాల్గొన్న ఒక ఫంక్షన్లో వ్యక్తమైన అభిప్రాయాలు నన్ను ఆలోచింప జేశాయి. ముఖ్యంగా ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు..అతను మేధావి కాదు, పెద్దగా చదువుకోలేదు, వ్యాపారంలో స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి కొంతసేపు మాట్లాడిన తరువాత ఓ సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విద్యుత్తు కోతల వల్ల మిగిలిన వారి కన్నా వ్యాపారులం ఎక్కువ ఇబ్బంది పడ్డాం అని చెప్తూ… పదేండ్ల క్రితం ఉ మ్మడి రాష్ట్రంలో రోజుకు మూ డుసార్లు ఏయే సమయాల్లో ఎన్నేసి గంటల పాటు విద్యుత్తు కోతలు ఉండేవో సమయంతో సహా చెప్పుకొచ్చాడు. అతనికో సందేహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవే పన్నులు ఉండేవి. ఇప్పుడు అవే ఉన్నాయి. కొత్తగా పన్నులేవీ పెంచలేదు. 24 గంటలు విద్యు త్తు ఉంటున్నది. ఇంటింటికి మంచినీళ్లు వస్తున్నా యి. హైదరాబాద్ వంటి మహానగరంలోనే కాదు మారుమూల గ్రామాల్లో వ్యవసాయ పొలాలకు కూడా 24 గంటలు విద్యుత్తు ఇస్తున్నారు. మంచి రోడ్లు ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఐనా మనం కట్టే పన్నులతోనే కదా ఇవన్నీ చేస్తాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవి సాధ్యం అయినప్పుడు అంతకుముందు ఎందుకు సాధ్యం కాలేదు అని.
అప్పుడు కూడా పన్నులు వసూలు చేశారు. కానీ ఇవి చేయలేకపోయారు. అంటే అప్పుడు డబ్బులు అన్నీ ఏమైనట్టు? అని ప్రశ్నించారు. అతడి సందేహం నిజమే కదా? మంచినీళ్లకే దిక్కు లేనప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై ఆశలేముంటా యి.తెలంగాణ సముద్రమట్టానికి ఎత్తులో ఉం టుంది… అందుకే తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టులు సాధ్యం కాదు అని ఉమ్మడిరాష్ట్రంలో నమ్మి స్తూ వచ్చారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ ఓ జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించవచ్చు కదా? అని మురళీమోహన్ అడిగారట. ‘తెలంగాణ సముద్రమట్టానికి ఎత్తులో ఉంది. కనుక ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదు. నిర్మించినా చాలా వ్యయంతో కూడుకున్న పని’ అని బాబు బదులిచ్చారట.
సాధారణ ప్రజలు, తెలంగాణ నాయకులకే కాదు ఆంధ్ర నాయకులకు సైతం ఇదే మాట చెప్తూ వచ్చారు. అందరూ సాధ్యం కాదు అని చెప్పిన దానిని కేసీఆర్ సాధించి చూపించారు అని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైన కొంత కాలం తర్వాత ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పెద్ద బహిరంగ లేఖ రాశారు.‘తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు. ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదు. సమైక్యాంధ్ర వల్ల తెలంగాణ బాగుపడింది. ఆంధ్ర నష్టపోయింది’ అనేది ఆ లేఖ సారాంశం.
తెలంగాణ ఏర్పడిన తరువాత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని చూసి అదే నాదెండ్ల‘మేము ఇది ఊహించలేక పోయాం’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని , కేసీఆర్‌ను అభినందిస్తూ లేఖ రాశారు. నాదెండ్లకు రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యత లేకపోవచ్చు కానీ తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వారు సైతం తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి తాము ఎంత అపోహతో ఉన్నా రో అంగీకరించడం ఇక్కడ విశేషం. ‘సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదు’ అని ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నాయకులను, ప్రజలను అందరినీ పాలకులు నమ్మిస్తూ వచ్చారు. సముద్రమట్టానికి ఎత్తులో ఉన్న తెలంగాణకు సాగునీరివ్వడం ఇప్పుడు ఎలా సాధ్యమైంది అంటే తెలంగాణపై సముద్రమంత అభిమానం, ప్రేమ చూపడం వల్ల అని చెప్పాలి. పాలకులు గతంలో హైదరాబాద్‌ను ఒక రియల్ ఎస్టేట్గానే చూశారు తప్ప తెలంగాణను ప్రేమించలేదు. మనసుంటే మార్గం ఉంటుంది అని తెలంగాణ విషయంలో రుజువైంది.
‘హైదరాబాద్ బంగారు బాతు గుడ్డు లాంటిది.. హైదరాబాద్ వల్లనే తెలంగాణ కళకళలాడుతుంది’ అనేది కొందరి వాదన. ఇందులో నిజం లేకపోలేదు. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధాని హైదరాబాద్. కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా హైదరాబాద్ రాష్ర్టానికి హైదరాబాదే రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజధానే. తెలంగాణ ఏర్పడినప్పుడు హైదరాబాదే రాజధాని. రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. నిన్న మొన్న కాదు 500 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రాజధానే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ దేశంలో మెట్రోనగరాల్లో ఐదవ స్థానంలో ఉండేది. ఇప్పుడూ ఐదవ స్థానాల్లోనే ఉంది. ఏ రాష్ర్టానికైనా ఆదాయం ఎక్కువగా రాజధాని నగరం నుంచే వస్తుంది.
పన్నులు చెల్లించే ప్రధాన కార్యాలయా లు అన్నీ రాజధాని నగరంలోనే ఉంటా యి కాబట్టి రాజధాని నుంచే ఆదాయం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ వచ్చాక వస్తున్న ఆదాయంతో ప్రాజెక్టులు, ఇం టింటికి మంచినీళ్లు, 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఈ పథకాలను, ఈ అభివృద్ధిని ఉమ్మడిరాష్ట్రంలోతెలంగాణ ప్రాం తంలో ఎందుకు అమలు చేయలేదు. ఆ డబ్బులన్నీ అప్పుడు ఏం చేసినట్టు? అనే సందేహం రావడం అందరికీ సహజమే.
తెలంగాణ అంటే కరువు ప్రాంతం అనే బలమైన ముద్ర నుంచి తొమ్మిదేండ్లలో దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా నిలిచింది . సరే, హైదరాబాద్ వల్లనే ఇది సాధ్యమైంది. హైదరాబాద్ వల్ల తెలంగాణలో ఇది సాధ్యమైనప్పుడు ముంబై వల్ల మహారాష్ట్రలో ఇంకెన్ని అద్భుతాలు జరుగాలి? దేశంలో నంబర్ వన్ మెట్రో సిటీ ముంబై. దేశానికి ఆర్థిక రాజధాని ముంబై. దేశంలోని మహా సంపన్నులందరి అడ్రస్ ముంబై. మరి మహారాష్ట్రలో రైతుల పరిస్థితి ఏమిటి? దేశంలో ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నది మహారాష్ట్రలోనే.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2015 వరకు రైతుల ఆత్మహత్యల వివరాలు ప్రకటించింది. 2012 లెక్కల ప్రకారం 3786 మందితో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 2022లో మహారాష్ట్రలో 1023 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారిక లెక్కలున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఇదే పరిస్థితి. 2012 లెక్కల్లో మహారాష్ట్ర మొదటి స్థానం లో ఉంటే 2572 మందితో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నది. అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మహత్యలు ఎక్కువగా తెలంగాణకు సంబంధించినవే. 2014లో కూడా కొన్ని నెలలు రైతుల ఆత్మహత్యలు తెలంగాణను వెంటాడాయి. ఇది మనకు వారసత్వంగా వచ్చింది అని శాసనసభలో కేసీఆర్ ప్రకటిస్తే రాజకీయ ప్రకటన అని విమర్శలు చేశా రు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిర్ణయాల వల్ల ఈ రోజు తెలంగాణ రైతు సగర్వంగా తలెత్తుకొని నిలబడగలుగుతున్నాడు.
మనవరాలి పెండ్లికి కోటి రూపాయలు ఇచ్చా ను అని మూడేండ్ల క్రితం ఒకరు చెప్పారు. ప్రభు త్వ టీచర్ కోటి రూపాయలు ఇవ్వడం ఏమిటి? అనుకుంటే భువనగిరి నుంచి హైదరాబాద్ వచ్చే దారిలో ఉన్న అనంతారం అనే గ్రామంలో వారికి వ్యవసాయ భూమి ఉంది. అప్పుడు ఎకరం కోటి. మనవరాలి పెండ్లికి ఎకరం ఇచ్చారు. ఇప్పుడు రేటు రెట్టింపు ఉండవచ్చు. పిల్లల పెండ్లి, వ్యవసాయానికి చేసిన అప్పు భారంగా మారి గతంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి. అర ఎకరం అమ్ముకొని పెళ్లి చేయడమే కాదు అప్పులన్నీ తీర్చేస్తామనే ధీమా వారిలో ఇప్పుడు కనిపిస్తున్నది. రైతు బీమా, రైతుబంధు వల్ల వ్యవసాయ పొలం అమ్ముకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.
ముంబై మహానగరం రాజధానిగా కలిగి ఉన్న మహారాష్ట్రలో రైతులు ఇంత ధీమాగా ఎందుకు లేరు? గతంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు రైళ్లలో తాగునీటిని తీసుకువచ్చారు. షిరిడీ వంటి యాత్రలకు వెళ్లే తెలుగు ప్రయాణికులు రైళ్లలో కొన్ని నీళ్లు తీసుకు వెళ్లి దారిలో మహారాష్ట్రలోని గ్రామాల వారికి నీళ్ల్లు దానం చేసేవారు. దేశంలోనే నంబర్ వన్ మెట్రో సిటీ, ఆర్ధిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్ర కనీసం ప్రజలకు మంచినీళ్లను ఎందుకు ఇవ్వలేక పోతున్నది. తెలంగాణ రావడానికి ముందు ఆ డబ్బులు ఏమయ్యాయి ? అని ఆ వ్యాపారికి సందేహం వచ్చినట్టే ఇప్పుడు మహారాష్ట్ర గ్రామాల పరిస్థితి చూస్తే ముంబై ద్వారా మహారాష్ట్రకు వస్తున్న ఆదాయం ఏమవుతున్నది? అనే ప్రశ్న ఉదయిస్తుంది . పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్ర గ్రామాల పరిస్థితి, రైతుల పరిస్థితి మారి తీరుతుంది .
మన పొరుగున ఉన్న మహారాష్ట్ర విషయానికి వస్తే రాజకీయ నాయకులకన్నా ముందు ఈ విషయాన్ని సరిహద్దు గ్రామాల్లోని మహారాష్ట్ర గ్రామీణ ప్రజలు గుర్తించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్తు, రైతుబంధు చూసి వారి గ్రామాలను తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేశారు. చివరకు అక్కడి ప్రజాప్రతినిధులు సైతం వీరి తీర్మానాలకు మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత ఆ పార్టీకి మహారాష్ట్రలో ఎక్కువ స్పందన లభిస్తున్నది. తెలంగాణకు మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల తెలంగాణలో ఏం జరుగుతున్నది? రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏం మార్పు జరిగింది? అనేది మహారాష్ట్రలో ఎక్కువ ప్రభావం చూపుతున్నది.