‘తెలంగాణ..’ గుండెల నిండుగా ఉప్పొంగే గర్వంతో నేడు నినదిస్తున్నఆత్మగౌరవ ప్రకటన ఇది! ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించింది కానీ, ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన వెనుక అరువై ఏండ్ల అరిగోస ఉన్నది. ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉండే ఆవేదన ఉన్నది.
ఆరు దశాబ్దాల గాయాలను వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు. ఎందుకంటే అక్షరాలు కూడా వాక్యాలుగా మారేముందు గుండెలవిసేలా ఏడుస్తయి. లెక్కలేని అవమానాలను, స్వపరిపాలన కోసం బలిదానాలు ఇచ్చిన అమరవీరులను యాది చేసుకుని కండ్ల నుంచి మత్తడి దుంకుతయి. నిలువెల్లా గాయాలను భరించిన ఉద్యమ పతాకం ఈ తెలంగాణ. నేడు దేశానికి యావత్తు దారి చూపుతున్న క్రాంతిధార తెలంగాణ.
వచ్చినప్పుడు చూద్దాం, అసలు రానిచ్చేదే లేదు, అది తీరని పగటి కల..’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎకసెక్కాలు వలస పాలకులు మాట్లాడితే.. కుట్రలు కుతంత్రాలను బద్దలుకొట్టి తెలంగాణను తీసుకొచ్చిన యోధుడు కేసీఆర్. కాలం కన్న వీరుడు కేసీఆర్. నెర్రెలు బారిన నేలల్లోకి జీవజలాన్ని పారించిన అపరభగీరథుడు. గలగలాపారే గంగమ్మ తల్లిని బీటలు వారిన తెలంగాణ బీళ్లకు మళ్లించి, భూమికి పచ్చని రంగేసిన చిత్రకారుడు కేసీఆర్.
తెలంగాణ కోసం కొట్లాడిన్రు కదా?, ‘తెలంగాణ వస్తే ఏమొచ్చింది?, వెటకారంతో సీమాంధ్రులడిగే ప్రశ్నలు చాలానే ఉంటయి. ఇన్నేండ్లు అధికారం చెలాయించి, కామధేనువు లాంటి తెలంగాణ ఒక్కసారిగా చేజారిపోయేసరికి ఆ మాత్రం కడుపుమంట ఉంటది. కానీ.. ఇట్ల ఎవరైనా అడిగితే బరాబర్గా బదులివ్వాలె. తలెత్తి నిలబడిన మన తెలంగాణను ఎలుగెత్తి చాటాలె. ఇదే తిరుగులేని సాక్ష్యంగా చూపాలె. పరుగులు పెడుతున్న ప్రగతే చెంపపెట్టు లాంటి సమాధానం. కోటి ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన కేసీఆర్ ఒక్క కాళేశ్వరం ద్వారానే 33 లక్షల ఎకరాలకు నీళ్లందించారనే నిజాన్ని చెప్పాలె.
ఎన్నని చెప్పాలె, ఇంకెన్నని చూపాలె. తెలంగాణ రాకముందు సిన్మాలల్ల తెలంగాణ యాస యాడనన్న కన్పించిందా? రౌడీ షీటర్లు, విలన్లు, కామెడీ క్యారెక్టర్లకు తప్పితే.. హీరో, హీరోయిన్లతో తెలంగాణ యాసను పలికించిన్రా? మరిప్పుడు తెలంగాణ భాష లేకుండా అసలు సినిమాలుంటున్నయా!
‘తినే తిండెవ్వారిదే కోయిలా.. పాడే పాటెవ్వారి దే కోయిలా’ అన్నట్లు.. తెలంగాణ సొమ్ము తింటూ, తెలంగాణలో ఉంటూ.. ఈ ఉద్యమాల పురిటిగడ్డకు ఎద కోతలను బహూకరించింది ఎవ రు? అవును.. బరాబర్ వలస పాలకుల బానిసత్వ సంకెళ్లు పతా లేకుండా పోయిన్నాడే.. నోళ్లు తెరుచుకున్న బీళ్లకు మా నీళ్లు మత్తడి దుంకినయి. ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు, ఏం చేస్తరో, చేసుకోండని కాలరెగరేసిన చోట మా నిధులు మేము కేటాయించుకుంటున్నం. కొలువులు ఇవ్వక కొలిమిలో కాల్చిన చోటే కొలువుల జాతర పెట్టుకుంటున్నం.
ఇంత ధిక్కారానికి, ఇంతటి ధీరత్వానికి పుట్టుక ఎక్కడుందని వెతకాల్సిన పనిలేదు. మర్లబడిన తెలంగాణ చరిత్రను తడిమిచూస్తే చాలు ఈ నేలలో వీరత్వం మునివేళ్ల నుంచి మస్తిష్కానికి ప్రవహిస్తది. నాడు తాకట్టు పెట్టబడిన తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశలో పరుగులు పెట్టించి, ప్రాణాలను కూడా లెక్కచేయని కేసీఆర్ త్యాగం మాకు దారి చూపుతది. అందుకే మళ్లొక్కసారి బాజాప్తా చెప్తున్నం తెలంగాణ మా గుండె అయితే, ఆ గుండెచప్పుడు కేసీఆర్.
శుభప్రద్ పటేల్.ఎన్
(వ్యాసకర్త: న్యాయవాది, టీఆర్ఎస్ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ)