4, 5, 8వ శాసనసభ ఆమోదించిన 10 ముఖ్యమైన బిల్లుల పట్ల గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఆ బిల్లులను ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి. కానీ గవర్నర్ ఆ బిల్లులను తనవద్దే పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొన్నా మధ్య మంత్రి సబితను తనవద్దకు పిలిపించుకున్న గవర్నర్ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుకు సంబంధిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అయినా కూడా బిల్లుకూ మోక్షం లభించకపోవడం శోచనీయం. ఇదిలా ఉంటే గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను ఆమోదించి వెనక్కి పంపేవిధంగా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆశ్రయించడం అభినందనీయం.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? బీజేపీయేతర ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాన్ని, అస్థిరపరిచేవిధంగా, గవర్నర్లను పావుగా వాడుకొని రాజకీయ పబ్బం గడపడమా? ఒక్క తెలంగాణలోనే కాదు, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, పంజాబ్ వంటి విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరిది. ‘మీ మంత్రి మండలిలో ఒక మంత్రి నాకు నచ్చలేదు. అందుకని రేపటిలోగా ఆ ఫలానా మంత్రి రాజీనామా చేయాలి’ అని కేరళ సీఎం విజయన్‌కు అక్కడి గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తాఖీదు పంపారు. ఎంత దుర్మార్గం. మంత్రిని రాజీనామా చేయాలని అడిగే హక్కు గవర్నర్లకు ఎక్కడిది? ఏ రాజ్యాంగంలో ఉంది?
ఇక ఢిల్లీ విషయమంటే మరీ ఘోరం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో 15 ఏండ్ల తర్వాత మొదటిసారిగా బీజేపీ చేతిలోంచి చేజారి పోయింది. బీజేపీ పెద్దలను ఆనందింపజేయడం కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రంగంలోకి దిగారు. ఎట్లాగైనా ఢిల్లీ మున్సిపల్ మేయర్ పదవిని బీజేపీ వాళ్లకు కట్టబెట్టాలని ప్రయత్నించారు. 250 సీట్లున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఆప్ (134) సీట్లు గెలుచుకున్నది. స్పష్టమైన ఆధిక్యత ఆప్‌కు ఉన్నది. కానీ, రాజ్యాంగ విరుద్ధంగా నామినేటెడ్ సభ్యులను గవర్నర్ నియమించి వారికీ ఓటు హక్కు కల్పించి రచ్చ చేశాడు. అప్పుడు విధిలేక సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. నామినేటెడ్ సభ్యుల సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు రద్దుచేసి, 24 గంటల్లో ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీ గవర్నర్‌ను ఆదేశించింది. ఎన్నికలు జరగడంతో ఆప్ అభ్యర్థి ఢిల్లీ మేయర్ అయ్యాడు.
మన ప్రధాని మోదీ, గుజరాత్ సీఎంగా ఉన్నపుడు గవర్నర్ల వ్యవస్థ గురించి, గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. నాడు గుజరాత్ గవర్నర్‌గా పనిచేసిన కమల బేనివాల్ చర్యలను తప్పుబట్టారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా, తిరస్కరించకుండా ఆమె దగ్గరే పెట్టుకున్నదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇక గుజరాత్‌కు లోకాయుక్త నియామకం విషయంలో గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. గవర్నర్ల ద్వారా కాంగ్రెస్, విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాల్లో రాజకీయాలు చేస్తుందని, రాష్ర్టాల హక్కులను హరిస్తుందని, సర్కారియా, పూంచ్, కమిషన్ల సిఫారసులు అమలు చేయడంలేదని విమర్శించారు. అదే మోదీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే అదే గవర్నర్లను ఉపయోగించుకొని విపక్షం పాలిస్తున్న రాష్ర్టాల్లో రాజకీయాలు చేస్తున్నారు.
విపక్షంలో ఉంటే ఒక తీరుగా, అధికారంలో ఉంటే మరో విధంగా వ్యవహరించడం బీజేపీకి పరిపాటిగా మారింది. తెలంగాణలో గవర్నర్, రాజ్‌భవన్ ద్వారా బీజేపీ చేస్తున్న రాజకీయం పరిశీలిద్దాం. యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు సందేహాలు నివృత్తి చేసిన తర్వాత కూడా ఇప్పుడు గవర్నర్ తమిళిసై దగ్గర పెండింగ్‌లో ఉంది. ఇది ఒక వైపు అయితే, మరోవైపు యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తారు. బిల్లు ఆపేది గవర్నర్, ఆందోళన చేసేది బీజేపీ నాయకులు. అంటే కేంద్ర ప్రభుత్వమే బిల్లులను ఆపమని గవర్నర్‌కి చెప్పి ఆపించి, వారి నాయకులకేమో ఆందోళనలు చేయమని మరోవైపు చెప్తున్నదనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అలాగే పేదలకు ఇండ్ల స్థలాలు పంచాలని బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తుంటారు. ఆ సంబంధిత బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంటుంది. అంటే గవర్నర్ ద్వారా బిల్లులు ఆపించి, పెండింగ్‌లో ఉంచి వాళ్ల పార్టీతో ఆందోళనలు చేయించి, రాష్ట్ర ప్రభుత్వంపైన వ్యతిరేకత సృష్టించాలన్నది బీజేపీ కుట్రగా తెలుస్తుంది. సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్యలను మనం గమనించాలి.
ఇప్పటికైనా గవర్నర్ల ద్వారా, రాజ్భవన్ల ద్వారా రాజకీయం చేయడాన్ని బీజేపే నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. తెలంగాణ గవర్నర్ తమిళిసైకు రాజకీయాలపై మక్కువ ఉంటే నేరుగా రాజకీయాలు చేసుకోవచ్చును. కానీ, ప్రజల చేత ఎన్నుకోబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలనుకోవడం దుర్మార్గం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. దయచేసి ఇప్పటికైనా బీజేపీ నాయకురాలిగా కాకుండా గవర్నర్‌గా వ్యవహరించాలి. శాసనసభ ఆమోదించి పంపిన 10 బిల్లులను వెంటనే ఆమోదించి, మీ గౌరవాన్ని హుందాతనాన్ని నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలకు మేలు చేయగలరని మనవి.
(వ్యాసకర్త: ఉన్నత విద్యామండలి మాజీ సభ్యులు)
– ఓ.నరసింహారెడ్డి 80080 02927