దేశంలోని ప్రతిష్ఠాత్మక అలహాబాద్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. గత 15 రోజులుగా వర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆరుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. యూనివర్సిటీ ఆవరణలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఆందోళన చేస్తున్న క్రమంలో ఒక విద్యార్థి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో కనీసం చర్చలు జరపకుండా ఫీజులు పెంచడమే విద్యార్థుల ఆగ్రహానికి కారణం. ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న ఫీజుల్లో ఒకేసారి 400 శాతం పెంచారు. భారీస్థాయిలో ఫీజులు పెంచేటప్పుడు యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరపాలి. విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులతో చర్చలు చేయా లి. కానీ ఇలాంటివేం లేకుండానే ఏకపక్షంగా కోర్సు, పరీక్ష ఫీజులను పెంచారు. దీంతో వర్సిటీ విద్యార్థులు కడుపుమండి ఆందోళన బాట పట్టా రు. కనీసం యూనివర్సిటీ విద్యార్థులకైనా ఉచిత విద్యను అందించలేని దీనస్థితిలో యోగి, మోదీ ప్రభుత్వాలున్నయి. విద్యార్థిలోకం లేవనెత్తుతు న్న ప్రశ్నలకు యోగి, మోదీ ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతున్నాయి.
‘ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీస్థాయిలో పెంచారు. దీంతో మా బతుకులు ఛిద్రమైనాయి. మా బతుకులు దినదిన గండంగా మారాయి. విద్య ఉద్యోగ అవకాశాలకు దూరంగా బతుకుతున్నాం. ఇప్పుడు ఈ ఫీజుల భారం మోపి మమ్మల్ని విద్యకు కూడా దూరం చేస్తారా?’ అంటూ విద్యార్థులు వాపో తున్నారు. ‘మా యూనివర్సిటీలో అధికారులు, ప్రజాప్రతినిధుల బిడ్డలు చదివితే మా ఆవేదన ఏంటో అర్థమవుతుంది’ అంటున్నారు. అవును నిజమే వారంతా పేద కుటుంబాల వారే. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. కార్పొరేట్ శక్తులకు రుణమాఫీలు, రాయితీలు కల్పిస్తున్న బీజేపీ నేతృత్వంలోని యోగి, మోదీ ప్రభుత్వాలు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, కూలీ బిడ్డలపై ఫీజుల పిడుగులను వేస్తున్నాయి. వాస్తవానికి గత రెండున్నరేండ్లుగా ప్రపంచమంతా కరోనాతో కకావికలమైంది. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మృగ్యమైనాయి. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయాన విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడం వారిని ఉన్నత విద్యకు దూరం చేయడమే.
గుజరాత్, యూపీ ‘మోడల్ అభివృద్ధి’ అంటూ దేశంలో అన్ని రాష్ర్టాల్లో అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ మాటలన్నీ ఉత్తయేననని అలహాబాద్ యూని వర్సిటీ విద్యార్థుల ఆందోళనతో మరోసారి రుజువవుతున్నది.
విద్యారంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం ‘నూతన జాతీయ విద్యా విధానం-2020’ తీసుకొచ్చింది. దీనిద్వారా ఉన్నత విద్య అంతా మరింత కార్పొరేటీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణ అవుతుంది. పేదలకు విద్య దూరమవుతుంది. దీన్ని అమలు చేయరాదని దేశంలో విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు ఉద్యమిస్తున్నారు. అయితే అలహాబాద్ యూనివర్సిటీలో ఫీజులు పెంచడం నూతన జాతీయ విద్యా విధానంలో భాగమే అని ఛాన్స్లర్ సంగీత శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని, అందుకే ఫీజులు పెంచామని చెప్తున్నారు. అంటే ఫీజులను పెంచడానికి అనుమతిస్తున్న జాతీయ విద్యా విధానం ఏ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందో బీజేపీ నేతృత్వంలోని యోగి, మోదీ ప్రభుత్వాలే చెప్పాలి. ఎవరితో సంప్రదింపులు జరపకుండా, పార్లమెంట్లో చర్చ చేయకుండా, కార్పొరేట్ అనుకూల నూతన జాతీయ విద్యా విధానం రూపొందించి అమలుకు పూనుకున్నది. దీని దుష్పరిణామాలను అలహాబాద్ వర్సిటీలో పెంచిన ఫీజుల రూపంలో చూస్తున్నాం.
జాతీయ విద్యా విధానం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతున్నది. దేశం లో ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ గాని, రీసెర్చ్ సెంటర్ గాని నెలకొల్పని మోదీ ప్రభుత్వం ఫీజులను పెంచి దేశ విద్యారంగంపై, విద్యార్థులపై సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం దారుణం.
దేశభక్తి ముసుగులో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను దేశంలో ఉన్న వర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. జేఎన్‌యూ, జామియా మిలియా, బనారస్, ఢిల్లీ వర్సిటీ లాంటి ప్రతిష్ఠాత్మక వర్సిటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇప్పుడది అలహాబాద్‌కు చేరుకున్నది. ప్రశ్నిస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టి జైల్లో వేయడం గర్హనీయం. మోదీ అనుచరగణం పోలీస్ దుస్తుల్లో వర్సిటీల్లోకి చొరబడి విద్యార్థులపై దాడులు చేస్తున్నది. అలహాబాద్ విద్యార్థులపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదువుకొని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులు వీరి దాష్టీకాలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరిన్ని అఘాయిత్యాలు జరగకుండా వెంటనే అధికారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే విద్యార్థులే మోదీ, యోగి ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారు.
(వ్యాసకర్త: పీడీఎస్‌యూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
పి.మహేష్
97003 46942