ఒక అసత్యాన్ని లేదా అర్ధసత్యాన్ని పదేపదే వల్లిస్తే నిజాలను మరుగున పరచవచ్చనేది గోబెల్స్ ప్రచారనీతి. అది అసలు అడివే కాదనడం, అక్కడ జీవులే లేవనడం అసత్యం కాక మరేమిటి? ఇక అది ప్రభుత్వ భూమి అనేది అర్ధసత్యం అనుకుందాం. అయితేనేమి? భూదాహం బుల్డోజర్ అవతారమెత్తింది. ఆకలిగొన్న తోడేళ్లలా అమాయక ప్రాణుల వెంటపడ్డాయి. మొదలు నరికిన చెట్లు నేలకూలాయి. పచ్చని నేల లోహరాక్షసుల ఉన్మాద ప్రహారంతో ఊసరక్షేత్రమై పోయింది. నిస్సహాయ జీవజాలం చెల్లాచెదురైంది. సర్కారు భూదాహం నగ్నంగా, భయోద్విగ్నంగా నర్తిస్తే ఆ పదఘట్టనలో పర్యావరణ స్పృహ భూస్థాపితమైపోయింది. ఒళ్లు జలదరించే దృశ్యం ప్రపంచాన్ని పీడించిన పాడు కల అయ్యింది. పర్యావరణ విధ్వంస క్రౌర్యానికి దుర్భర ప్రతీకలా నిలిచింది. ఈ అసాధారణ దురాగతంపై సుప్రీంకోర్టు స్వీయచర్య ద్వారా స్పందించింది. హైదరాబాద్ యూనివర్సిటీ ఆవరణలోని కంచగచ్చిబౌలిలో హరిత హననాన్ని తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది.
కోర్టుకు సీఈసీ సమర్పించిన నివేదికలోని అంశాలు ప్రభుత్వ బండారాన్ని ఎండగట్టాయి. అందులో ముఖ్యంగా మూడు అంశాలు ప్రభుత్వం చెప్పుకొస్తున్న అబద్ధాలపై ముసుగులు తొలగించాయి. ఒకటి, రికార్డుల ప్రకారం ఆ 400 ఎకరాల భూమి యూనివర్సిటీదే. కనుక సర్కారు పెట్టిన తాకట్టుపై, ఆపై తలపెట్టిన వేలంపై స్టే విధించాలనేది సీఈసీ సిఫారసుగా ఉంది. రెండు, వర్సిటీ భూముల్లో అరుదైన జీవవైవిధ్యం, అపురూపమైన శిలాకృతులు కొలువుదీరి ఉన్నాయి. అంటే, ఆ భూములు ‘అడవి’అనే నిర్వచనం పరిధిలోకి వస్తాయని నిర్ధారించడమే. పైగా మార్గదర్శకాలకు విరుద్ధంగా అటవీ విధ్వంసం జరిగిందని కమిటీ తేల్చిచెప్పింది. ఈ పాపం ఎవరిదో చెప్పాల్సిన పనిలేదు. మూడు, వ్యతిరేకతను అణచేందుకే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు పహారాలో బరితెగించింది. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు కాకుండా దొడ్డిదారిన కాలుష్య నియంత్రణ మండలి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పని కానిచ్చుకోవాలని చూసింది. ఆ అనుమతిని రద్దుచేయాలి. ఆ ప్రాంతాన్ని సున్నిత మండలంగా ప్రకటించాలి.
సర్కారు దుర్మార్గాలను ఎండగట్టి, అడవిని కాపాడాలని సూచించడం సీఈసీ నివేదిక సారాంశం. ఈ నివేదిక పరిశీలన సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికార వ్యవస్థపై నిప్పులు చెరిగింది. రాష్ట్ర పెద్దలు పాల్పడింది అసాధారణమైన నేరం కదా, సుప్రీంకోర్టు స్పందన కూడా అంతే అసాధారణమైన రీతిలో ఉండటం గమనార్హం. నీతి తప్పి చెట్లు కూల్చిన పెద్దలకు సుప్రీంకోర్టు పోసిన తలంటు చరిత్రాత్మకమని చెప్పక తప్పదు. ‘అడవిని పునరుద్ధరించాలి.. లేదంటే జైలుకెళ్లాలి ’అనే ఒక్కమాటతో సర్వోన్నత న్యాయస్థానం సర్కారు వండివారుస్తున్న అబద్ధాలను బదాబదలు చేసింది. ఓ వైపు సుప్రీంకోర్టు కంచలో జరిగిన ఉల్లంఘనల పరంపరపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే సర్కారు మాత్రం సాకుల వెనుక తలదాచుకోవాలని చూస్తుండటం హాస్యాస్పదం. సీఈసీ నివేదిక ఎదురుదెబ్బ అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టు. కానీ అత్యాశతో అడవిని నరికి అడ్డంగా దొరికిపోయినవారు తప్పు దిద్దుకోవడంలో తలమునకలుగా ఉండాలి. కానీ కంచ విధ్వంసకాండపై ఏఐ ఫొటోలు రీట్వీట్ చేశారంటూ’ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్కు పోలీసు నోటీసులు పంపడం వంటి దివాళాకోరు పనులకు పాల్పడుతుండటం మరీ విడ్డూరం.