రచయితలు కేవలం రచయితలుగా మిగలకూడదు. తాత్వికులు కూడా అయి ఉండాలి. తిరుగుబాటుదారులు, దార్శనికులు కూడా అయి ఉండాలి. పరిశోధకులు, సత్యశోధకులు కూడా అయి ఉండాలి. అలా కానివారు కేవలం గుంపులో ఒకరిగా మాత్రమే మిగిలిపోతారు. అలా అయినవారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. కన్నడ రచయిత డాక్టర్ ఎస్.ఎల్. భైరప్ప అలా శాశ్వతంగా నిలిచి వెలిగే రచయిత.
‘వంశవృక్ష’ నవల సాంప్రదాయంపై తిరుగుబాటు. ‘పర్వ’ ఒక వాస్తవాన్వేషణ. ‘మత్ డాన్’ ఒక రాజకీయ నాటకీయత. ‘ఆవరణ’ రెండు మతాల ఘర్షణపై వ్యాఖ్య. నిజానికి భైరప్పను రచయిత అనడం కూడా ఒక పరిమితిలోకి ఆయనను కుదించి మాట్లాడటమే. కన్నడలో రాసే భారతీయ రచయిత అని ఆయన్ను సంభోదించడం న్యాయం. ఆయన రాసిన 24 నవలల్లో 7 నవలలు తెలుగులోకి అనువాదమయ్యాయి. దాదాపుగా ఆయన నవలలన్నీ హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లోకి తర్జుమా అయ్యాయి. పర్వ, గృహభంగం, వంశవృక్షం తెలుగులోనూ సాహిత్యకారులందరికీ పరిచయం ఉన్న రచనలు. దేశవ్యాప్త గణాంకాల్లో కూడా భైరప్ప నవలలు అత్యధికంగా అమ్ముడైన రచనలే.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం పరిణతి అయితే అదే చరిత్రను తిరగరాయడం కూడా పరిణతే అన్న విశ్వాసంతోనే భైరప్ప రచనలు సాగాయి. నిజమైన చరిత్ర అన్వేషణ కోసం భైరప్ప సృజనాత్మక పరిధులను కూడా అధిగమించారు. వాస్తవాలకు దూరంగా ఉండటం వాస్తవాలను తెలుసుకోవడం కోసమే అంటాయి ఆయన రచనలు. వంశవృక్షం లాంటి నవలల నేపథ్యంలో ఆయనను సాంప్రదాయ వ్యతిరేకి అన్న నోళ్లే ‘ఆవరణ’ లాంటి నవలల నేపథ్యంలో ఆయనను హిందూత్వవాది అనడం గమ్మత్తయిన వ్యంగ్యం. ఆయన రచనల్లో మనిషి ఉనికి, జీవితార్థం, బాధ ఆనందాల మధ్య ఉన్న విరుద్ధ గమనాలు నిరంతరం పరిశీలనలో ఉండటమే బహుశా అందుకు కారణం కావచ్చు. ఒకవైపు సంప్రదాయ ధర్మశాస్ర్తాలను, మూఢనమ్మకాల బంధనాలను ధిక్కరిస్తూనే, మరోవైపు సాంస్కృతిక మూలాలను గౌరవించే ధోరణి కూడా అందుకు కారణం కావచ్చు. అందుకే ఆవరణ నవలను తాత్కాలికంగా నిషేధించారు. ఈ సందర్భంగా ఆయన రచనలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సాహితీ ప్రియులు ఆందోళనకు దిగారు. ఈ తరహా నిషేధాలు సత్యాన్వేషణకు ఆటంకాలవుతాయని వారు నినదించారు. భైరప్ప మీద వచ్చి న విమర్శలు కూడా తక్కువేమీ లేవు.
పర్వ, ఆవరణ నవలలు ఆయన మీద విమర్శలు కురవడానికి ప్రధాన కారణాలు. పర్వ, ఆవరణ నవలలు చాలామంది చదివిన నవలలే అయినప్పటికీ వాటి సారాంశాన్ని ప్రపంచం అర్థం చేసుకోలేదన్న భావాన్ని చాలా సందర్భాలలో వ్యక్తం చేశారు. పర్వ నవలలో మహాభారతాన్ని ఆయన తన కోణంలో చూసి ఆధునిక దృక్పథంతో పునర్వ్యాఖ్యానించారు. ధర్మం అంటే ఏమిటి, అది ఒకే రూపంలో అందరికీ వర్తిస్తుందా? అనే ప్రశ్నలే ఈ నవల ప్రధాన ఇతివృత్తం. మహాభారత పాత్రలన్నీ కేవలం అనుబంధ ముడిసరుకులే. ఇక్కడ భైరప్ప సంప్రదాయ పురాణ కథనాన్ని నమ్మకుండా, దానిని విచ్ఛిన్నం చేసి ఆధునిక ఘర్షణలతో అన్వయిస్తారు. మానవ విలువలు కాలానుగుణంగా మారవలసిందే కానీ, వాటి మూల సారాంశం సత్యాన్వేషణ, మానవ గౌరవం మాత్రం శాశ్వతమని ఆయన నమ్మకం. సాంప్రదాయ నవలా రూపాలకు భిన్నంగా ఆయన రాసిన మరో నవల సాక్షి. ఇక్కడ ఆయన మ్యాజికల్ రియలిజం లాంటి రూపం ఆశ్రయించారు. వంశవృక్షలో పితృస్వామ్యం, కుటుంబ పరంపర అనే సాంప్రదాయం వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా నిరోధిస్తుందో చూపించారు. దాటు నవలలో కులవ్యవస్థ సామాజిక అసమానతలను తాత్విక దృష్టితో పరిశీలించారు.
తంతు నవలలో భైరప్ప సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ, సమాజంలోని సంక్లిష్టతలను తాత్విక దృక్పథంతో విశ్లేషించారు.
‘బిత్తి’ ఆయన ఆత్మకథ. తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కష్టాన్నీ ఆయన ఈ రచనలో చేర్చారు. పేదరికం, ఆత్మీయుల మరణం, చదువుకోవడానికి పడ్డ కష్టాలన్నింటినీ తనదైన తాత్విక ధోరణిని కలిపి రచనగా చేశారు. ఆయన రచనలలో వ్యక్తమయ్యే తాత్వికత, సాంప్రదాయంపై ప్రశ్నలు, ధిక్కారం ఆయా పాత్రల వ్యక్తిగత పోరాటం మాత్రమే కాక సమాజపు ఆత్మవిశ్లేషణను ప్రతిబింబిస్తాయి. ఆయన విమర్శ అంధవిశ్వాసంపైనే గాని, జ్ఞానం, అన్వేషణ, ఆత్మ విచారణపై కాదు.
ఆయన నవలలు సినిమాలుగా కూడా ప్రముఖమే. గిరీష్ కర్నాడ్, బీవీ కారంత్, గిరిష్ కాసరవల్లి, బసూ చటర్జీ వంటి నిపుణులు భైరప్ప నవలలను సినిమాలుగా మార్చారు. తెలుగులో బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం చాలు భైరప్ప కథలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి. దాతు, వంశవృక్ష, తబ్బళియు, నీనాదె మగనె, మత్దాన్, గృహభంగ నవలలు సినిమాలుగా వచ్చాయి.
అనేక అవార్డులు సాధించిన భైరప్ప ‘వ్యక్తులు అవార్డులకు గౌరవం తెస్తారే తప్ప అవార్డుల వల్ల వ్యక్తులకు గౌరవం రాదు’ అన్నాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. సాహిత్యంలో ఆయన చిరంజీవి లాంటివాడు. రొడ్డకొట్టుడు నివాళులు సరిపోవు. ఆయన ధిక్కారాన్ని, ఆయన కోరుకున్న సామాజిక మరమ్మతులను మనం అర్థం చేసుకోనంత కాలం ఆయన అవసరం సమాజానికి ఉంటుంది. ఆయన రచనల సారం సమాజానికి వంటబట్టిన తర్వాత మనమే ఆయన రూపాలుగా స్థిరపడి ఆయనను శాశ్వతం చేస్తాం, చేయాలి కూడా. ఎందుకంటే ఆయన స్వయంగా అన్నాడు ‘సత్యాన్ని అధిగమించి మేం సృజనకారులు అనే ముసుగు చాటున దాక్కునే హక్కు ఎవరికీ లేదు’ అని. ఆయన అక్షరాలా అలా దాక్కోలేదు.
– ప్రసేన్ 98489 97241