సంకల్పానికి
మనోధైర్యాన్ని తొడిగి
వ్యథల దారుల్ని దాటి
వ్యవస్థకు ప్రాణం పోయాలి
వర్గ తీరుల వివక్షాలను
ఖండ ఖండాలుగా ఖండించి
తిరుగుబాటు సత్య యజ్ఞానికి
ఆజ్యం పోయాలి
సమాన వంతెన గట్టిదనానికి
సమాజ ప్రతిష్ట నిలకడతనానికి
మన వంతుగా నిజాన్ని
అందలం ఎక్కించాలి
విజయానికి మెట్టుగా
ప్రజా శక్తి యుక్తులు తోడై
అధిరోహిస్తాయి
అలుపెరుగని కష్టాలకు
ఆనవాళ్లుగా నిలబడుతూనే
ఎదురుబాటుతనాన్ని
ఎదుర్కొనే చైతన్యాన్ని నిద్ర లేపి
ముందుకు సాగిపోవాలి
ఎన్నో రాపిడుల వొత్తిడిలో
ఇంకెన్నో ఒడిదుడుకుల గతుకుల్లో
అడుగులు సవరిస్తూనే
చరిత్ర పుటల్లోకి ఎక్కాలి
సాధనే ఆయుధంగా
సుసాధ్యమే ఊపిరిగా
ఎదురుముళ్ళ విన్యాసాలను
క్రమబద్దీకరిస్తూనే
సింహాసనాన్ని అలంకరించాలి
మరెన్నో ఎత్తుపల్లాలను
అవలీలగా దాటి రావాలి
నరెద్దుల రాజారెడ్డి: 96660 16636