‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాక ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు
తెలియదు. అలాగే తల్లిలేని, నిరుపేద తెలంగాణ పల్లెనుంచి వచ్చిన విద్యార్థి భారతదేశం గర్వించే మహామహెూపాధ్యాయుడవుతాడని అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యాసంస్థకూ తెలియదు. ఒట్టి మట్టిబడిలో ఓనమాలు దిద్దబెట్టిన ఆ గురువుకు తెలియదు, అపశబ్దమాలిన్యం సోకని ఒక నిఘంటు కర్త వ్యాకరణవ్యాఖ్యాత అతనిలో ఉన్నాడని.
తాను పుట్టిన నల్లగొండకూ తెలియదు, ఏడుకొండలవాడిని ముప్పైరెండువేల కీర్తనలతో కీర్తించిన అన్నమయ్య పదాలకు పదకోశం తయారుచేసే నిఘంటు నిర్మాణకర్త దాగి ఉన్నాడని, ‘నీ యవ్వా’ అంటూ నీల్గే తన తల్లి బాషకూ తెలియదు. తన మాండలికాన్ని వ్యాకరించే వ్యాకర్త ఆ పసివాడవుతాడని. ఇన్ని ఉషస్సుల్ని ముడివేసుకున్న మహెూదయమే ఆచార్య రవ్వా శ్రీహరి’.
నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకా ము నిపంపుల గ్రామంలో చేనేత కార్మిక కుటుంబంలో 1943 సెప్టెంబర్ 7న శ్రీహరి జన్మించారు. అది వారి అమ్మమ్మ ఊరు. వారి సొంత ఊరు వెల్వర్తి. తల్లిదండ్రులు రవ్వా వెంకట నరసమ్మ, నరసయ్యలు. మునిపంపుల గ్రామంలోని పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని శ్రీహరి పూర్తిచేశారు. శ్రీహరి తాత మిరియాల కనకయ్య. ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.
1952లో నాల్గవతరగతి పూర్తయి ఐదవతరగతిలో చేరే సందర్భం వచ్చింది. శ్రీహరి ఆర్థికస్థితి అందుకు అనుమతించక పోవటంతో శ్రీహరి తండ్రి చదివించటానికి ఇష్టపడలేదు. కానీ, తల్లి, తాతల ప్రోత్సాహం తో ఎలాగోలా భువనగిరిలో ఉన్నత పాఠశాలలో చేరి ఐదవ తరగతి పూర్తి చేసుకున్నారు. అదే సంవత్సరం ఆయన తల్లి అనారోగ్యంతో మరణించింది. ఆ సంఘటనతో కుటుంబం కకావికలమై పోయింది.
కుటుంబ బాధ్యతలమీద, చదువుమీద దృష్టిపెట్టిన శ్రీహరికి ఏంచేయాలో పాలుపోలేదు. అటువంటి సందర్భంలో యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో ఉచిత భోజన సౌకర్యంతో ఫీజులు లేకుండా సంస్కృత చదువు చెబుతారని పత్రికా ప్రకటన చూసి వెళ్లి అందులో చేరారు శ్రీహరి.
అప్పటి విద్యాపీఠంలో వేషభాషలూ, వాతావరణం తొలుత కొత్తగానే అనిపించినా క్రమంగా శ్రీహరి ఆ వాతావరణంలో ఒదిగిపోయారు. విద్యాపీఠంలో శ్రీహరి మొట్టమొదటి గురువు కేరళ సుబ్రహ్మణ్యశాస్త్రి. వారి వద్ద రామశబ్దంతో సంస్కృత విద్యను ప్రారంభించారు. ఒక సంవత్సరం గడిచేసరికి శబ్దాలు, ధాతువులు, అమరకోశంలోని రెండు కాండలు, రఘువంశంలోని కొన్ని శ్లోకాలు సంప్రదాయపద్ధతిలో క్షుణ్ణంగా నేర్చుకున్నారు. రఘువంశం, కుమారసంభవం, కిరాతార్జునీయం, మేఘసందేశం, మాఘకావ్యం, చంపూ రామాయణం వంటి శాస్త్ర గ్రంథాలతో పాటు అనేక కావ్యాలను చదువుకోవటం వలన భవిష్యత్తులో నిఘంటు రచనలకు, పరిశోధనలకు మంచి పునాది ఏర్పడింది.
యాదగిరి విద్యాపీఠంలో నాలుగు సంవత్సరాలు చదువుకున్న తర్వాత హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ మున్నాలాల్ సంస్కృత కళాశాలలో డీఓఎల్, బీఓఎల్. వ్యాకరణం చదివారు. అక్కడ శ్రీశఠకోప రామానుజాచార్యులు, శ్రీ ఖండవల్లి నరసింహశాస్త్రి, శ్రీ అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం చదువుకున్నారు. శ్రీహరి చదువుకునే రోజుల్లోనే సైకిల్ మీద వెళ్ళి ట్యూషన్ చెప్తూ, తన ఖర్చులకు తానే సంపాదించుకునేవారు. డీఓఎల్లో సాహిత్యాన్ని ప్రధానాంశంగా తీసుకున్నప్పటికీ శ్రీహరికి వ్యాకరణంపైన ఉన్న శ్రద్ధను గమనించి ఎంట్రన్స్‌లో వ్యాకరణం ప్రధానాంశంగా తీసుకోకపోయినా మినహాయింపునిచ్చి వ్యాకరణ డీఓఎల్లో ప్రవేశాన్నిచ్చారు. ఎంట్రన్స్‌లో చదువుకోవాల్సిన సిద్ధాంత కౌముదిలోని చాలా భాగాలను స్వయంగానే శ్రీహరి చదువుకున్నారు. ప్రౌఢమనోరమ, పరమలఘుమంజూష, సిద్ధాంత కౌముదిలోని కొన్ని ప్రకరణాలు, ముక్తావళి, మీమాంసాన్యాయ ప్రకాశం మొదలైనవాటిని డీఓఎల్లో చదివారు. 1960లో డీఓఎల్ పాసై బీఓఎల్లో చేరారు. ఇక్కడే వ్యాకరణంలో ఘనాపాఠిగా తీర్చిదిద్దబడ్డారు.
బీఓఎల్ వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితులుగా చేరారు. ఆ రోజుల్లో సంస్కృత అధ్యాపకుల ఉద్యోగాలు ఉండేవి కావు. వారంతా తెలుగు పండితులుగానే పనిచేయవలసి వచ్చేది. అందుకని విధిగా తెలుగు పండిత శిక్షణ చేయవలసి వచ్చింది. ఉద్యోగ స్థిరత్వం కోసం క్రమంగా తెలుగు బీఓఎల్, బీఏ., తెలుగు పండిత శిక్షణ చేశారు. కళాశాలలో లెక్చరర్ కావాలన్న కోరికతో 1967లో ఎం.ఏ. సంస్కృతం ప్రైవేటుగా చేసి అందులో సర్వప్రథమునిగా ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘మేల్కోటే య స్. నారాయణరావు స్మారక బంగారు పతకాన్ని’ పొందారు.
ఎం.ఏ. తెలుగులోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. భాషను ఆధునిక దృష్టితో పరిశీలించాలంటే భాషాశాస్త్ర దృక్పథం అవసరం అని భావించి సాయంకాలపు కోర్సులో చేరి ఐప్లెడ్ లింగ్విస్టిక్స్‌లో పీజీ డిప్లొమాను చేశారు. శ్రీహరి 1967లో ఆంధ్ర సారస్వత పరిషత్తులోని ప్రాచ్యకళాశాలలో లెక్చరర్‌గా చేరారు. అక్కడ విద్యార్థులకు సంస్కృతం, తెలుగు రెండూ ఆరు సంవత్సరాల పాటు బోధించారు. 1973 లో ఉస్మానియాలో తెలుగు శాఖలో లెక్చరర్‌గా చేరారు.
అక్కడ ఆంధ్ర శాఖాధ్యక్షులు ఆచార్య బీ రామరాజు సాహచర్యం లభించింది. వారి సలహాతోనే తెలుగు ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాను పుచ్చుకొన్నారు. భాస్కర రామాయణానికి సంబంధించి శ్రీహరి చేసిన పరిశోధన కృషి ఆ తరం విద్వాంసుల్ని ఎంతగానో మెప్పించింది. ఇలా ఉద్యోగరీత్యా క్రమంగా తెలుగు సాహిత్యంవైపు వెళ్ళటం జరిగింది.
ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ. విద్యార్థులకు వ్యాకరణం, సంస్కృతం, అప్పుడప్పుడు భాషాశాస్త్రం బోధించే వా రు. విద్యార్థులు మంచి మార్కులతో పాసై, కష్టతరంగా కనిపించే ఆ సబ్జెక్టులు సులభ సాధ్యాలని నిరూపించేవారు. రామరాజుగారి ప్రేరణతో నిరంతర పరిశోధన వ్యసనాన్ని శ్రీహరి అలవర్చుకొన్నారు. వారి ప్రభావం తో నిఘంటువులకెక్కని తెలుగు పదాలను జానపద సాహిత్యం నుంచి సేకరించి శ్రీహరి నిఘంటువుగా తీర్చిదిద్దారు. ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడే కేంద్రీ య విశ్వవిద్యాలయంలో ఎంఏ విద్యార్థులకు వ్యాకరణాన్ని అంశకాలికంగా బోధించే అవకాశం లభించింది. ఆ తర్వాత శ్రీహరిని డిగ్రీ తరగతులు చెప్పటానికి కోఠి మహిళా కళాశాలకు పంపించారు. కొద్ది కాలానికే సికింద్రాబాద్‌లోని పీజీ కళాశాలకు మార్చారు. ఆ సమయంలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పోస్టు లభించింది. అలా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన శ్రీహరి 17 ఏండ్లపాటు ప్రొఫెసర్‌గా ఉన్నారు. 9 ఏండ్లు శాఖాధ్యక్షునిగా బాధ్యతను నిర్వహించారు. తిక్కన, అన్నమయ్య, జాషువ మొదలైన వారిపై సుమా రు 10 సెమినార్లు జరిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ శాఖాధ్యక్షునిగా, పాఠ్యనిర్ణాయక మండలి అధ్యక్షులుగా, డీన్‌గా పని చేశారు.
శ్రీహరి మొట్టమొదటి రచన అనువాద రచన. పదహారు పదిహేడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం, సంస్కృత శాఖ వారి జయంతి పత్రికలో కాళహస్తీశ్వర శతకంలోని పది పద్యాలను సంస్కృతీకరించి ప్రచురించారు. 1965లో భారతిలో ఆంధ్రసంస్కృతకోశం – సమీక్ష అనే వ్యాసాన్ని మొదటిసారిగా ప్రచురించారు. సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో పనిచేసేటప్పుడు విద్యార్థులకోసం లఘుకౌముదిలోని సంజ్ఞ, సంధి, కృత్ప్రకరణాలను తెలుగులో అనువదించి ప్రచురించారు. ఇది శ్రీహరి మొట్టమొదటి గ్రంథం. ఇప్పటికిది దాదాపు ఆరేడు ముద్రణలను పొందింది. ఆ తర్వాత కాకర, సమాస, స్త్రీ, ప్రత్య య, తద్ధిత ప్రకరణాలను కూడా అనువదించి ప్రచురించారు.
శ్రీహరి రెండవ రచన సంకేత పదకోశం (1973). సంఖ్యలతో ప్రారంభమయ్యే వివిధ శాస్త్ర సంబంధ సాంకేతిక పదాలను వివరించే విలక్షణ నిఘంటువిది. దీనికోసం ఎన్నో సంస్కృత శాస్త్ర గ్రంథాలను అధ్యయ నం చేశారు. ఇది సంవర్థిత రూపం లో ద్వితీయ ముద్రణ కూడా పొందింది. దువ్వూరి వెంకట రమణశాస్త్రి సంపాదకత్వంలో తెలుగు అకాడమీకి బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి వ్యాకరణ పదకోశాన్ని రచించారు. మొత్తం సాహిత్యంలో ఒకే ఒక్క ప్రయోగం ఉన్న పదాలకు నిఘంటువులలో స్థానం లభించింది గాని, లక్షలాది ప్రజల నాలుకలమీద నర్తించే మాండలిక పదాలను నిఘంటుకారులు ఉపేక్షించారు. ఆ విషయా న్ని గమనించిన శ్రీహరి నల్గొండ జిల్లా మాండలికపదకోశాన్ని నిర్మించారు. సినారె. ప్రపంచపదుల్ని సంస్కృతంలోకి అనువదించి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. సూర్యరాయాంధ్ర నింఘటు శేషమైన శ్రీహరి నిఘంటువు ఆయన కృషికి నిలువెత్తు సాక్ష్యం. దీనికి తెలు గు విశ్వవిద్యాలయం వారి పురస్కా రం లభించింది.
తెలంగాణ మాండలిక పదాలలో కొన్నింటికి కావ్యప్రయోగాలు కనిపించటాన్ని గమనించి శ్రీహరి తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు అనే గ్రంథాన్ని ప్రచురించారు. సంకలన గ్రంథాల ప్రాముఖ్యాన్ని గుర్తించి, అలబ్యకావ్య పద్యముక్తావళి (1983) అనే గ్రంథాన్ని సంకలనం చేశారు. ఎర్రన రామాయణం, అథర్వణ భారతం వంటి గ్రంథాలలో లభ్యపద్యాలను వివిధ ఆకారాల ఆధారంతో సేకరించి ఇందులో కూర్చారు.
సుమారు వంద గ్రంథాలనుంచి ఇందులో పద్యాలు సేకరించారు. తెలుగులో అలబ్ధ సాహిత్యం ఎంత ఉందో పరిశోధించాలనే ఆసక్తితో కావ్యావతారికలు మొదలైన ఆధారాలను బట్టి తెలుగులో సుమారు 600 కు పైగా అలభ్యగ్రంథాలున్నట్లుగా నిరూపిస్తూ, అలభ్య వాఙ్మయం అనే గ్రంథాన్ని 1983లో ప్రచురించారు. 1983లో భాస్కర రామాయణం – విమర్శనాత్మక పరిశీలనం అనే సిద్ధాంత వ్యాస గ్రంథాన్ని ప్రచురించారు. ఉభయభారతి (1996), సాహితీ నీరాజనం (2008) పేరుతో రెండు విమర్శవ్యాస సంపుటాలను ప్రచురించారు. అన్నమయ్య భాషావైభవం అనే గ్రంథాన్ని, తెలుగు కవుల సంస్కృతానుకరణలు అనే గ్రంథాన్ని 2006లో ప్రచురించారు. ఇవి కాకుండా కాణాదం పెద్దన సోమయాజి రచించిన ముకుంద విలాస కావ్యానికి సంపాదకత్వం వహించి కావ్యవిశేషాలను వివరిస్తూ విపులమైన పీఠికను రచించారు. దీనికే పిల్ల వసుచరిత్రగా పేరుంది. దీనిని తెలుగు విజ్ఞానపీఠం ప్రచురించింది.
సంస్కృతంలో రచించిన త్రిలింగ శబ్దానుశాసనం అనే వ్యాకరణ గ్రంథాన్ని తాళపత్రం నుండి పరిష్కరించి, ప్రచురించారు. శ్రుతి, స్మృతి, పురాణేతిహాస కావ్యనాటకాదుల నుంచి ఎన్నో సూక్తులను సేకరించి, తెలుగు అనువాదంతో సంస్కృత సూక్తి రత్నాకరాన్ని ప్రచురించారు. కొత్తపల్లి సుందరరామయ్య సిద్ధంచేసిన అకారాది అమరనిఘంటువుకు సంపాదకత్వం వహించారు.సూర్యరాయాంధ్ర నింఘటు శేషమైన శ్రీహరి నిఘంటువు ఆయన కృషికి నిలువెత్తు సాక్ష్యం.దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది.
‘సంకేత పదకోశం’, ‘వ్యాకరణ పదకోశం’, ‘సంస్కృత న్యాయదీపిక’ వంటి రచనలన్నీ ఒక ఎత్తు. అన్నమయ్య నిఘంటువు మరొక ఎత్తు. సాధారణంగా నిఘంటువులు అందరూ ఉపయోగించే, ప్రయోగించే పదాలకు అర్థాలనిస్తాయి. అన్నమయ్య పదకోశం మాత్రం అన్నమయ్య ఉపయోగించిన పదాలకు మాత్రమే అర్థనిర్ణయం చేస్తుంది. అందువల్ల అన్నమయ్య సంకీర్తనల్లోని చాలా పదాలకు మనకు అర్థాలు తెలియవు. వాటికి నిఘంటువుల్లోనూ అర్థాలు లభించవు. కాబట్టి శ్రీహరి సమకూర్చిన అన్నమయ్య పదకోశం ఆ వెలితిని పూరిస్తుంది. అన్నమయ్య ఉపమలు, భాషా సంపద, అచ్చతెలుగు ప్రేమ, నవ్వులు వంటి ఎన్నో అపురూపమైన విశేషాలను తెలుగు ప్రపంచానికి చాటిచెప్పారు. సాధారణంగా తిక్కన పేర్కొన్నన్ని నవ్వులు ఎవ్వరూ పేర్కొనలేదని చాలాకాలం సాహిత్యలోకం అనుకుంది. కానీ, అన్నమయ్య పేర్కొన్న 240 పైచిలుకు నవ్వుల్ని శ్రీహరి సాహిత్యలోకానికి చెప్పి అబ్బురపరిచారు.
2002లో శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆ విశ్వవిద్యాలయానికి రూపురేఖలు కల్పిం చి తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషు శాఖలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి, భాషా విశ్వవిద్యాలయమన్న మాటకు నిజమైన అర్థాన్ని కల్పించారు. పరిపాలనారంగంలో ఉన్నప్పటికీ శ్రీహరి నిఘంటువు వంటి ఉద్గ్రంథాలను రచించారు.
ఈ కృషి ఒక ఎత్తయితే, అష్టాధ్యాయిని కాశికావ్యాఖ్యతో సహా అనువదించడం మరొక ఎత్తు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అమరవాణి కార్యక్రమంలో సంస్కృత పాఠాలను దాదాపు ఏడెనిమిదేండ్ల పాటు చెప్పి ఎందరినో సంస్కృతీకరించి, సంస్కృత ప్రేమికుల్ని చేశారు. 2011లో తితిదే. కార్యనిర్వహణాధికారి ఐవీఆర్ కృష్ణారావు ఆహ్వానం మేరకు దేవస్థానం వారి ప్రచురణల విభాగం ప్రధాన సంపాదకునిగా వివిధ పుస్తకాలను ప్రచురించారు.
కవిత్రయమహాభారతాన్ని మళ్ళీ సవరణలతో పునర్ముద్రణ చేయడం, ఆంధ్రమహాభాగవతాన్ని, మహాభారతంలా పండితులచే వ్యాఖ్యానింపజేసి అందించే ప్రయత్నాన్ని చేశారు. తిరుమల క్షేత్రదర్శిని, బ్రహ్మమొక్కటే, ప్రాచీన భారతీయ సంస్కృతి, మహాభారత ఉపాఖ్యానాలు వంటి కొత్త గ్రంథమాలలను ప్రారంభించారు. వీటిని హిందీ, తమిళ, కన్నడ, ఇంగ్లీషు భాషలలోనికి అనువదించే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. తితిదేలో వాఙ్మయ పీఠానికి కూడా ఇంఛార్జిగా వ్యవహరించారు. ఆ సందర్భంలో సుమారు 20 గ్రంథాలను పునర్ముద్రణ గావించారు.
తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2011లో ‘మహామహెూపాధ్యాయ’ బిరుదాన్ని ఇచ్చి శ్రీహరిని సత్కరించింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా పురస్కారం, గురజాడ పురస్కారం, జాషువా పురస్కారం, యదుకుల భూషణ్ వంటి పురస్కారాలనెన్నో శ్రీహరి పొందారు. శ్రీహరి ఎన్నో సంస్థలలో సభ్యునిగా, మరెన్నో విశ్వవిద్యాలయాల పాఠ్యనిర్ణాయక మండలి సభ్యునిగా, అతిథి ఆచార్యునిగా, విషయనిపుణుల కమిటీల సభ్యునిగా, ఆంధ్రసారస్వత పరిషత్తు, తెలుగు అకాడమీ వంటి వాటిలో కార్యనిర్వాహక సభ్యునిగా పనిచేశారు. భారత ప్రభుత్వం శ్రీహరికి పద్మ పురస్కారం తో సత్కరించకపోవటం ఒక వెలితి.
నిగర్వి నిరాడంబరుడు, నిరంతర నిఘంటు- ఆచార్య రవ్వా శ్రీహరి 2023 ఏప్రిల్ 21న ఇక సెలవంటూ భాషాభిమానులందరినీ వదిలి నింగికి వెళ్లిపోయారు.ఇటువంటి పరిశోధన ప్రేమికుడిని, విద్యకు మాత్రమే పరిమితమైన చింతన, చేతనగల విద్యావేత్త నుండి ఈ తరం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు: 94413 30511
(వ్యాసకర్త : తెలుగు శాఖాధ్యక్షులు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం,వారణాసి)