సాహిత్య జగత్తులో అంతర్భవించని శాస్త్రం, కళ, విద్య లోకంలో ఉండదంటారు పెద్దలు. సాహిత్యం సర్వతోముఖమైన మానవుని జీవనాను భవాల సంపుటి. ‘తెలుగు సాహిత్యంలో శ్రీ విద్యా సంప్రదాయము’ అనే పేరుతో శాస్త్రుల భార్గవరామ శర్మ రాసిన గ్రంథం ఈ విషయాన్ని బలపరుస్తున్నది. ఇందులో కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎర్రన గ్రంథాల్లోని శ్రీ విద్యా సంప్రదాయ వైవిధ్యాన్ని ఆయన సప్రమాణంగా సిద్ధాంతీకరించారు.
13వ శతాబ్దంలో శైవ, వైష్ణవ మతాల మధ్య కలహాలను తగ్గించి, సమన్వయం సాధించడానికి హరిహరనాథ తత్వానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ తత్వం మతసామరస్యం, సర్వమత సమానత్వాన్ని బోధిస్తుంది కనుక తిక్కన తన మహాభారత రచనను హరిహరనాథునికి అంకితం చేశాడని ప్రతీతి.
ఈ విషయాలు పింగళి లక్ష్మీకాంతం ఆంధ్ర సాహిత్య చరిత్ర, ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహములలో స్పష్టంగా పొందుపరచి ఉన్నాయి. ఈ రెండు గ్రంథాల్లోని పై అభిప్రాయాలను విభేదించే అదే గ్రంథాల్లోని వ్యాఖ్యలు, తిక్కన భారతావతారికలోని పద్యాలను ఆధారంగా చూపించి హరిహరనాథుడికి అంకితం చేసిన కారణాన్ని హరిహరనాథ తత్వాన్ని సహేతుకంగా భార్గవరామ శర్మ ఖండించారు. ఈ వాదాన్ని విశదీకరిస్తూ హరిహరనాథ తత్వము శ్రీ విద్యా సంప్రదాయంలోనిదని తిక్కన శ్రీ విద్య ఉపాసకుడని భార్గవరామ శర్మ నిరూపించారు.
తురుష్కుల దండయాత్రలు 14వ శతాబ్దిలో జరిగాయని, 13వ శతాబ్ది తుదిలో 1296వ సంవత్సరంలో యాదవ రాజ్యంపై దండయాత్ర జరిగినప్పటికీ అది దురాక్రమణ యత్నం కాదని తెలుగు సాహిత్య చరిత్రకారులు తెలిపారు. అదేవిధంగా తిక్కన మహాభారతం అంతకుముందు రచించినదేనని పేర్కొన్నారు. ‘12వ శతాబ్దిలో ఆంధ్రదేశంలో జరిగిన పలనాటి యుద్ధం మత సంబంధమైనది కాదు. మంత్రి పదవీ సంబంధము, నారీ ద్వేషమూలకము. అంతేకాదు..శతాబ్ది పూర్వం జరిగిన పల్నాటి యుద్ధం, శతాబ్ది అనంతరం మహాభారత రచనకు నిమిత్తం కాదు’ అని చెప్పిన చరిత్రకారులే మత వైరుధ్య కారణంగా తిక్కన అంతర్మథనం నుంచి ఆవిర్భవించినది హరిహరనాథ తత్వమని అభిప్రాయపడటం సరికాదని భార్గవరామ శర్మ పేర్కొన్నారు.
‘కాకతీయ చక్రవర్తులు…శివకేశవ భేదమును పాటింపని శివ పూజా పరాయణులు. వీరశైవులు కారు. (ఆంధ్ర సాహిత్య చరిత్ర పేజీ.నెం 38)’ అని మతసామరస్యవాదులు కూడా అంగీకరించారు. కనుక తిక్కన మతసామరస్యం కోసం భారతం రాసి హరిహరనాథుని ప్రవేశపెట్టాడని అనేందుకు ఆస్కారమే లేదని భార్గవరామ శర్మ పేర్కొన్నారు.
తిక్కన భారతావతారికలో… హృదయాహ్లాది చతుర్థమూ మూర్జిత కథోపేతంబు నానారసా భ్యుదయోల్లాసి విరాటపర్వమట యుద్యోగాదులుంగూడగా బదియే నింటదెనుంగు బాస జన సంప్రార్థ్యంబులై పెంపునం దుదిముట్టన్ రచియించుటొప్పు బుధ సంతోషంబు నిండారగన్ కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి యాంధ్రావళి మోదముంబొరయునట్లుగ సాత్యవతేయ సంస్కృతి శ్రీ విభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ క్షావిధినొంది పద్యముల గద్యములన్ రచియించెదం గృతుల్
అనే పద్యాల్లో పరిశీలించినట్లయితే నన్నయ రచించగా మిగిలిన భారతాన్ని రచించటంలో తిక్కన ఉద్దేశము ‘తుద ముట్టన్ రచించుట’, ‘బుధ సంతోషము నిండారుట’, ‘ఆంధ్రావని మోదముం బొరయుట’ అనునదియే గాని హరిహరాద్వైత ప్రతిపాదన ముఖముగా ఆంధ్రదేశమునందలి శైవ వైష్ణవ మతవిద్వేష నిర్మూలన పూర్వకమైన మతసామరస్యమును సాధించుట ఎంత మాత్రమును కాదనుట స్పష్టము’ అని భార్గవరామ శర్మ పేర్కొన్నారు. ఈ గ్రంథంలో నన్నయ, తిక్కన, ఎర్రన శ్రీ విద్య ఉపాసకులని నిరూపించేందుకు భార్గవరామ శర్మ పలు ఆధారాలను చూపించారు.
సీ॥ కరుణారసమువొంగి తొరగెడు చాడ్పున శశిరేఖనమృతంబుజాలువాఱ హరినీలపాత్రిక సురభి చందన మున్న గతి నాభి ధవళ పంకజము మెఱయ
గుఱియైన చెలువున నెరిసిన లోకర క్షణమన గరళంబు చాయదోప ప్రథమాద్రి దోతెంచు భాను బింబము నాను రమ్మున గౌస్తుభ రత్న మొప్ప
తే॥ సురనదియును గాళిందియు బెరసినట్టు కాంతి పూరంబు శోభిల్ల శాంతమూర్తి నా మనంబు నానంద మగ్నముగజేయ నెలమి సన్నిధి నేసె సర్వేశ్వరుండు (వి.రా1-12)
ఈ పద్యంలో హరిహర లక్షణములు చెప్పబడినవి. కానీ హరిహరులు చెప్పబడలేదు. కనుక హరిహరనాథుడు కూడా చెప్పబడినాడనుటకు వీలు లేదంటారు శర్మ.
యా శ్రీః గిరిజా ప్రోక్తా
యో హరిః స త్రిలోచనః | (వరా.పురా)
యా ఉమా సా స్వయం విష్ణుః
(రుద్ర హృ .ఉప 4 )
ఇటువంటి అనేక ప్రమాణముల ఆధారంగా లక్ష్మీనారాయణులకు మూల ప్రకృతి లలితా త్రిపుర సుందరి అని నిర్ధారణ చేసి తిక్కన శ్రీ విద్యోపాసకుడని భార్గవరామ శర్మ సిద్ధాంతీకరించారు. శాస్త్రుల విశ్వనాథ శర్మ రచించిన ‘న్యాయమీమాంస’ గ్రంథాన్ని భార్గవరామ శర్మ వ్యాఖ్యానిస్తూ తెలుగులోకి అనువదించారు. ‘సకల భువనేశ్వరి శ్రీ లలితా మహా త్రిపుర సుందరి మహా సామ్రాజ్య పట్టాభిషేక కల్ప:’ అనే సంస్కృత పుస్తకాన్ని వెలువరిస్తూ అందులో భూమికగా బ్రహ్మాండ పురాణం, పరాశర పురాణం, వాల్మీకి రామాయణం, భుశుండి రామాయణం, ఆనంద రామాయణం ఆధ్యాత్మిక రామాయణాల ఆధారాలను ఉటంకిస్తూ పారాయణ విధానాన్ని తెలుపుతూ రాసిన వ్యాఖ్య ఆధ్యాత్మికపరంగా ప్రామాణికమైనది.
భార్గవరామ శర్మ సంపాదకత్వం వహించిన ‘శ్రీ విద్యారణ ప్రోక్త శ్రీ సూక్త విధానము’నకు ఆముఖముగాను ‘యజ్ఞోపవీత సంస్కారము’లో ‘పశ్యని’ అనే పేరుతో రాసిన ముందు మాటలోనూ సాహిత్యాన్ని ఆధ్యాత్మిక కోణంలో వ్యాఖ్యానించారు. 1965లో దేవనాగరిలో శ్రీ గణపతి భట్టర్ అగ్నిహోత్రి రచించిన ‘శ్రీ సత్య గణపతి పూజా కథ’కు మంచి భావానువాదాన్ని అందించారు. అంతేకాకుండా అనేక గాణాపత్య సంప్రదాయ విశేషములను ఋగ్వేదము, గణేశ తంత్రములు – ఆగమాదులు, ముగ్గల పురాణముల ఆధారంగా శోధించి విమర్శించి ‘శ్రీ సత్య గణపతి’ వ్రత కథను అందించారు. దర్శనాల్లోని ‘కైలాస దర్శనం’ అనే గ్రంథంలో శాక్తాది సంప్రదాయము- ఒక పరిశీలన, బౌద్ధ, జైన, క్షీణ, పాశుపత, పాశండ, కాపాలిక, పౌర, గాణాపత్య, సంప్రదాయములను వైష్ణవ, జంగమ, శైవ, శైవసమయాచార, దక్షిణాచార, వామాచార వైదిక ఆచారాలను వ్యాఖ్యానించారు.
సంస్కృతాంధ్ర భాషల్లో విద్వాంసులైన శాస్త్రుల భార్గవరామ శర్మ మెదక్ జిల్లా శివంపేటలో 1945లో జన్మించారు. వరంగల్‌లోని దుర్గేశ్వర సంస్కృతాంధ్ర మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆయన 2021లో పరమపదించారు. ‘తెలుగు సాహిత్యంలో శ్రీ విద్యా సంప్రదాయము’ పీహెచ్డీ పట్టా కోసం రాసిన సిద్ధాంత గ్రంథమే అయినా ఆధ్యాత్మిక చింతనకు లోనై అందుకు ప్రయత్నించకపోవడం ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనంగా కనిపిస్తున్నది. ఇంతటి మహోన్నత పండితుడి విమర్శనా గ్రంథాలు ఎక్కువగా ప్రాచు ర్యం పొందలేకపోవడానికి కారణం కాలము, ప్రాంతం, ఆనాటి పరిస్థితులే కారణాలుగా భావించవచ్చు.