కేసీఆర్ పాలనలో చిన్నాపెద్ద అందరి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అన్ని వర్గాలకు చేయూత అందించారు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భం దాల్చిన మహిళలకు దగ్గరలో ఉన్న అంగన్వాడీలో పౌష్టికాహారం అందించారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాలన్నింటిలో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి, వారికి సుఖ ప్రసవం అయ్యేదాకా ఆ దవాఖాన సిబ్బంది శ్రద్ధ తీసుకునేటట్టు ఏర్పాట్లు చేశారు. గర్భిణులు ప్రతినెలా దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి, ప్రసవం కోసం వెళ్లడానికి, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను ఇంటి వద్ద సురక్షితంగా దిగబెట్టడానికి ఉచిత రవాణా ఏర్పాట్లు చేశారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12 వేల నగదు, బాలింతలకు మూడు నెలలకు సరిపడా మందులు, ఇతర వస్తువులతో కూడిన ‘కేసీఆర్ కిట్’ పేరుతో ఒక కిట్‌ను అందజేశారు.
ప్రభుత్వం ఇన్ని వసతులు కల్పించడంతో పేదవారే కాకుండా, మధ్యతరగతి ప్రజలు, ఉన్నత ఉద్యోగుల కుటుంబాల్లోని మహిళలు కూడా ప్రభుత్వ దవాఖానల్లోనే పరీక్షలు, ప్రసవాలు చేయించుకున్నారు. ఫలితంగా ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు అనవసర మందులు ఇవ్వడం, పరీక్షలు, సిజేరియన్లు, ఇతర శస్త్రచికిత్సల పేరుతో చేసే దోపిడీకి పాల్పడటం తగ్గిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల్లో రోగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు, డయాలిసిస్ సెంటర్ల వంటివి ఏర్పాటు చేసింది. ప్రైవేట్ వైద్య సంస్థల దోపిడీ నుంచి సామాన్య ప్రజలను రక్షించింది. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. ప్రజలకు అందుబాటులోనే వైద్య సాయం అందించింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడంతోపాటు, నాలుగు వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణాన్ని ప్రారంభించింది. కేసీఆర్ ప్రభుత్వం సకల జనుల సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రతీ జిల్లా కలెక్టర్ దగ్గర ఆ జిల్లాలోని ప్రజల వివరాలు ఉండేటట్టు ఏర్పాట్లు చేసింది.
మరి చంద్రబాబు ప్రభుత్వం 2014-2019 మధ్య, 2024లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక, ఏ ఏడాదిలో వైద్యరంగంలో తన విజన్‌తో ఏయే నూతన పథకాలు ప్రవేశపెట్టాడు? ఈ రెండో టర్మ్‌లో చంద్రబాబు వైద్య రంగానికి ఏం చేస్తున్నాడు? జగన్మోహన్రెడ్డి హయాంలో కేంద్రంతో మంజూరు చేయించిన 26 మెడికల్ కాలేజీలలో కొన్నింటిని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నాడు విజనరీ చంద్రబాబు. బడా వ్యాపారస్థులకు 99 పైసలకు ఎకరం భూమి ఇచ్చే కంటే, వారికి ఆ భూమి సరైన ధరకు అమ్మి, ఆ డబ్బుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నడిచే దవాఖానలను నిర్మిస్తే, అది ప్రజలకు ఉపయోగపడే పని అవుతుంది. నిర్మాణాత్మక, ఉత్పాదక పథకానికి ప్రభుత్వ భూమి ఉపయోగపడినట్టు అవుతుంది. ఇటువంటి ప్రజాహిత పథకాలు కాకుండా, ప్రజాకంటక పథకాలు రూపొందించే నాయకుడిని ఏమనాలి? చంద్రబాబు విజన్ వల్ల ధనవంతులు ఇంకా ధనవంతులు కావడం, పేదవారు మరింత పేదవారుగా మారి, బక్కచిక్కి నశించిపోయే ప్రమాదం లేదా?
తెలంగాణ సంపద మీద దురాశేగానీ, ఆంధ్ర నాయకులకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజల మీద అభిమానం, గౌరవం లేవని చెప్పటానికి ఇంకో ఉదంతం ఉన్నది. 1956 నాటికి తెలంగాణలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 1956లో సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 వరకు 58 ఏండ్ల పాలనలో సమైక్యవాద పాలకులు తెలంగాణలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదు. నాలుగు జిల్లాల రాయలసీమలో 11, హైదరాబాద్‌తో కలిపి తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అన్ని ముఖ్యమైన విద్యాసంస్థలు హైదరాబాద్‌లోనే ఉండాలని వంకపెట్టి వరంగల్‌కు మంజూరు అయిన ఐఐటీ అనుబంధ కాలేజీని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజధానికి జరిపాడు.
దానితో తెలంగాణ విద్యార్థులకు రావాల్సిన సీట్లు తగ్గిపోయాయి. ముఖ్యమైన విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఉండాలని సాకులు చెప్పిన ఎన్టీఆర్.. మరి హైదరాబాద్‌లో ఉన్న హెల్త్ యూనివర్సిటీని మాత్రం విజయవాడకు ఎందుకు తరలించినట్టో! ఎండీ, ఎంఎస్‌లో సీట్లు వచ్చిన తెలంగాణ విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి వెళ్తే, అక్కడి స్థానిక విద్యార్థులు మనవాళ్లను కౌన్సెలింగ్‌కు వెళ్లకుండా తిట్టి, బెదిరించి, కొట్టి వెనక్కు పంపిన ఉదంతాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంతమంది ఆంధ్రా వ్యాపార సంస్థలను, విద్యార్థులను భరించాల్సిన అవసరం తెలంగాణకు ఏమున్నది.?
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అవసరాల కోసమని చెప్తూ 2014లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రవాణా, విద్యుత్తు, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో చాలా పథకాలు ఆర్భాటంగా ప్రకటించాడు. కానీ, అరకొరగా రోడ్లు వేయడం మినహా ఇతర రంగాల్లో ఐదేండ్లకు సరిపడా అభివృద్ధి కనబడలేదు. నిజానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా రూ.33 వేల కోట్లు అప్పుచేసి, హైదరాబాద్‌లో రోడ్లు వేయడం తప్ప, చంద్రబాబు తొమ్మిదేండ్ల పాలనలో సాధించిన ఘనకార్యాలు ఏమీ లేవు. విభజన తర్వాత ఏపీలో విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో కూడా పెద్ద స్కామ్ జరిగిందన్న ఆరోపణలు 2019 తర్వాత బయటకు వచ్చాయి.
తెలంగాణలో కేసీఆర్ హయాంలో భవనాలు కట్టడంలో జరిగిన అభివృద్ధి వేరే ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. సమైక్య పాలనలో ధ్వంసమై విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మౌలిక వసతుల నిర్మాణం అద్భుతంగా జరిగింది. కేవలం మూడేండ్లలో రూ.720 కోట్లు వెచ్చించి, ఇంద్ర భవనం లాంటి సచివాలయాన్ని కేసీఆర్ నిర్మించారు. పది జిల్లాలను 33 జిల్లాలకు పెంచిన ఆయన, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ భవనాలను నిర్మించారు. కలెక్టర్ దగ్గర్నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఒకేచోట ఉండేటట్టు ఏర్పాట్లు చేశారు.
దీంతో ప్రజలు ఏదైనా పని మీద పదిచోట్లకు తిరిగే అవస్థ తప్పింది. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు భవనాలు, పిల్లలకు వసతి గృహాలు నిర్మించారు. అరకొర వసతులతో ఉన్న పాడుబడిన శ్మశానాలను వైకుంఠధామాలుగా తీర్చిదిద్ది, మరణించిన వారికి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే వసతులు కల్పించారు. సరస్సుల పునరుద్ధరణ, గార్డెన్లను నెలకొల్పారు. పల్లెటూర్లలో కూడా పక్కా రోడ్లు వేసి, రవాణా సదుపాయాన్ని సులభతరం చేశారు.
అమరావతిలో ఇంద్రభవనాలు నిర్మిస్తానంటూ పొంకణాలు కొట్టిన చంద్రబాబు, ఒక శాశ్వతమైన శాసనసభా భవనం కూడా కట్టలేకపోయాడు. నాలుగేండ్ల పాలనా కాలంలో త్రీడీ గ్రాఫిక్స్ వీడియోలు చూపిస్తూ ప్రజలను భ్రమల్లోనే ఉంచేశాడు. తాత్కాలిక సెట్టు వేసి, సినిమాలు తీసే దర్శకుడికి ఏమైనా ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఉంటాయా? బాహుబలి దర్శకుడు రాజమౌళిని పిలిపించుకుని అమరావతిలో భవనాల నిర్మాణం కోసం సలహాలు అడగడం చంద్రబాబు చేసిన పూర్తి చీప్ కామెడీ! అమరావతి గ్రాఫిక్స్‌తోనే కాలయాపన చేసిన చంద్రబాబు, మిగతా రంగాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు.
-కనకదుర్గ దంటు