బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనను షేక్ హసీనా వాజెద్ ఉక్కుపాదంతో అణచివేసేందుకు జరిపిన ప్రయత్నం బెడిసికొట్టింది. శాంతిభద్రతలు అదుపు తప్పి దేశం సంక్షోభంలోకి కూరుకుపోవడంతో సైన్యం రంగప్రవేశం చేసి అల్టిమేటం ఇవ్వడంతో ప్రధాని పదవి నుంచి ఆమె వైదొలగడమే కాకుండా దేశం విడిచి వెళ్లిపోయారు. అరాచకం ప్రబలిన నేపథ్యంలో బంగ్లా సైన్యాధినేత వాకర్ ఉజ్జమాన్ దేశ పరిపాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా గత జూన్‌లో మొదలైన నిరసనలు క్రమంగా తారస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ ప్రతిస్పందన కూడా దారుణంగా ఉండటంతో దేశవ్యాప్తంగా హింసాకాండ ప్రజ్వరిల్లింది.
రాజధాని ఢాకా సహా పలు నగరాలు నిరసనజ్వాలలతో అట్టుడుకుతున్నాయి. అల్లర్లు, పోలీసు కాల్పు ల్లో చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి ఆదివా రం ఒక్కరోజే 100 మందికి పైగా మరణించారు. గత నెల నుంచి ఇప్పటివరకు 300కు పైగా మరణాలు సంభవిస్తే అందులో 32 మంది 18 ఏండ్లలోపు పిల్లలే. భద్రతా దళాల చర్యల్లో మరో 25 వేలమంది గాయపడి చికిత్స పొందుతున్నారు. నర్సింగ్దీ జైలుపై ఆందోళనకారు లు దాడిచేసి 500 మందిని విడిపించుకుపోవడం, రంగపూర్‌లోని పోలీ సు క్యాంపుపై 4 వేల మంది నిరసనకారులు దాడిచేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఆగస్టు 4న జరిగిన సహాయ నిరాకరణ ఆందోళన హింసాత్మకంగా పరిణమించింది.
1971 బంగ్లా విముక్తి యుద్ధం తర్వాత ఇంతటి తీవ్రస్థాయిలో హిం సాకాండ ఎన్నడూ చెలరేగలేదంటున్నారు. ఆందోళనకారులతో మంత్రు లు చర్చలు జరుపుతుంటే పాలక అవామీ లీగ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా దాడులకు దిగడం, భద్రతాదళాలు 11 వేలమందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేసి దేశాన్ని జైలుగా మార్చడమే ఈ ప్రజాగ్రహానికి కారణంగా భావించాల్సి ఉంటుంది. హసీనా తండ్రి ముజీబ్ నేతృత్వంలో సాగిన విముక్తి పోరాటంలో పాల్గొన్నవారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా ఉండేది. ఇతర కోటాలూ అమల్లో ఉండేవి. ప్రజా వ్యతిరేకత కారణంగా హసీనా ప్రభుత్వం మొత్తం అన్ని రిజర్వేషన్లను 2018లో రద్దు చేసింది. ఇటీవల ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు కొట్టేయడంతో మళ్లీ రిజర్వేషన్లు అమలుచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కోటా వ్యతిరేక ఆందోళన ఊపందుకున్నది.
బంగ్లా విముక్తి యుద్ధం రోజుల్లో పాకిస్థాన్ తరపున బంగ్లాదేశీయులపై అరాచకాలకు పాల్పడిన ‘రజాకార్ల’తో కోటా వ్యతిరేక నిరసనకారులను ప్రధాని షేక్ హసీనా పోల్చడంపై కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. పైగా 2018, 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను దిగ్బంధనానికి గురిచేసి షేక్ హసీనా విజయం సాధించారనే విమర్శలు వచ్చాయి. తాజా ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ మరోమారు సైనిక పాలన కిందకు వెళ్లడం విషాదకరం. దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం అనేది సైనిక ప్రభుత్వం తక్షణ కర్తవ్యం కావాలి. సుదీర్ఘకాలం సైనిక పాలకుల కింద మగ్గిన చరిత్ర బంగ్లాదేశ్‌కు ఉంది. వాకర్ ఉజ్జమాన్ కూడా ఎర్షాద్, జియావుర్ రహమాన్ తరహాలో మరో సైనిక నియంతగా మారుతారా లేక ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతారా? అనేది వేచిచూడాలి.