గూడు కట్టుకున్న రాజకీయ చైతన్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి అస్తిత్వం మీద బలమైన దెబ్బకొడుతారు. అస్తిత్వాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి ఆత్మగౌరవ హననానికి పాల్పడుతారు. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. అవును.. ఇదే జరుగుతున్నది. అందులో భాగమే ఆత్మగౌరవాన్ని ఆస్తిగా లెక్కలు వేస్తున్నారు. అందుకే ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా? అని ప్రశ్నిస్తున్నరు.
కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చేతులను తనచేతల్లోకి తీసుకొని, పిడికిలెత్తి.. ‘జై తెలంగాణ’ అని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించేలా కేక వేసిన నినాదం కేసీఆర్. ఆ కేసీఆర్‌నే తన ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ ఎంచుకున్నది. ఇప్పుడు ఆ ప్రతీక ఎక్కడిదని ఒక పత్రికాధిపతి ప్రశ్నిస్తున్నడు. తెలంగాణ నేలమీద నిలబడి పరాయిపాట పాడుతున్నడు. తెలంగాణ సోయితో ప్రజానీకం రోడ్ల మీదికొచ్చి ‘చావో రేవో’ తేల్చుకుందామని వీరోచిత పోరాటం చేస్తున్నప్పుడు.. ఆ ప్రజల మీదికి తుపాకీతో వెళ్లిన రైఫిల్‌రెడ్డి కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నడు.
తెలంగాణపై తమ అధికారం పోయిందని, తమ ఆధిపత్యం ప్రదర్శించే వేదిక తమ చేతుల్లోంచి జారిపోయిందని రంది పడేవారందరూ కూటమికట్టి మళ్లీ కాలకూటవిషాన్ని కక్కుతున్నరు. ‘ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా ?’ అని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తున్నరు. తెంపరితనాన్ని అతితెలివిగా ప్రదర్శిస్తున్నరు.
అక్కడ.. ఇక్కడ పాలనా పగ్గాలు తన చెప్పుచేతుల్లో ఉన్నాయనే దురహంకారాన్ని, అహంభావాన్ని ఆ పత్రికాధిపతి బాహాటంగానే ప్రదర్శిస్తున్నడు. ఆ ప్రదర్శన వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోలేనంత అమాయకులు కారు తెలంగాణ ప్రజలు. తమ పట్ల.. ఇత్తేసి పొత్తుకూడి.., ఇసంత రమ్మంటే ఇల్లంత నాదే అనే గడుసుతనాన్ని ప్రదర్శించి, ‘అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు’ అన్నట్టుగా వ్యవహరించటం ఎప్పటికీ సాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ తెలంగాణ సమాజం అనేక సందర్భాల్లో నిరూపించింది. ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రతి సందర్భంలోనూ ఉద్యమ నాయకత్వంపై నిలువెల్లా విషం చిమ్మినవాళ్లు, ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనం, వ్యతిరేకతను వెల్లడిస్తున్న నేపథ్యంలోనూ కేసీఆర్‌పై అదే అక్కసును వెల్లగక్కుతున్నారు. ఆ వ్యతిరేక వెల్లువ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రల కత్తులను తెలంగాణ ఆత్మగౌరవం మీదికి విసురుతున్నరు. ఆంధ్ర.. జ్యోతివలె ప్రకాశించాలె.. తెలంగాణలో మాత్రం చీకటే రాజ్యమేలాలె’ అనేది వారి ఎత్తుగడ. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే తెరమీదికి తెచ్చిన ‘ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా?’ అనే ప్రశ్న. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తామని, కాంగ్రెస్ పాలక పెద్దలు ప్రగల్భాలు పలికిన ప్రతిసారీ కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో జరిగిన అద్భుతాలు.. దేశం అనుసరించే ఆదర్శాలుగా చర్చకు వస్తున్నాయి. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి నిలయమైందని ఆర్థిక సర్వే రూపంలో రుజువులు బయటికి వస్తున్నాయి. ఆ విషయాన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు జీర్ణించుకోవటం లేదు. అందుకే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని తెలంగాణ ఆత్మగౌరవంపై దాడికి దిగుతున్నారు. కేసీఆర్ అంటే వ్యక్తికాదు.. తెలంగాణ రాజకీయ, అస్తిత్వ, రాజకీయ, సాంస్కృతిక చైతన్యాలకు ప్రతీక. ఆ ప్రతీకలతో రూపుదిద్దుకున్న ఆత్మగౌరవాన్ని అవహేళన, పలుచన చేయటానికి పనికట్టుకొని కొందరు జిత్తులమారి వేషాలు వేస్తున్నారు.
కాంగ్రెస్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిందని ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసిప్పటి నుంచీ నాలుగు దశాబ్దాలుగా ఆ కీర్తికి మరక పడకుండా ఆయన అభిమానులు మెరుగు పెడుతూనే ఉన్నారు. కానీ, రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ ఆత్మగౌరవం కాలికి ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తున్న కేసీఆర్‌ను మాత్రం కించపరుస్తున్నారు. నీ తెలుగు నీకెంత గొప్పదో.. నా తెలంగాణ నాకంత గొప్పది. నీ ఎన్టీఆర్ నీకెంత ఆరాధ్యుడో మా కేసీఆర్ మాకూ అంతే ఆరాధ్యుడు.
తెలంగాణ మనుగడ ప్రతీకలను దూరం చేయాలని ద్రోహులు రెండేండ్లుగా యథేచ్ఛగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ వల్ల.. కేసీఆర్ చేత ఉద్యమంలోకి వచ్చిన కొందరి పేర్లను కన్వీనియంట్‌గా వాడుకుంటూ రెండేండ్లుగా సందర్భం వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నారు. కానీ, తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌ను, కేసీఆర్ నుంచి తెలంగాణ ప్రజలను వేరు చేయటం ఎవరితరమూ కాదు. ముమ్మాటికీ తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే. కేసీఆర్ మద్దతుదారులను కూలీలు అంటున్నారు. తెలంగాణ కోసం స్వప్నించాం. ఆ స్వప్నాన్ని సాధించటం కోసం దివారాత్రులు కూలీలుగానే పనిచేశాం. అవును. మేం తెలంగాణ కోసం కూలీలమే. అందుకు గర్వపడతాం. మా జోలికి.. మా ఆత్మగౌరవం జోలికి వచ్చిన వాళ్లకు రాజకీయ సమాధి కూడా కడుతాం. జై తెలంగాణ.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనం, వ్యతిరేకతను వెల్లడిస్తున్న నేపథ్యంలో.. ఆ వ్యతిరేక వెల్లువ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొందరు కుట్రల కత్తులను తెలంగాణ ఆత్మగౌరవం మీదికి విసురుతున్నరు. ఆంధ్ర.. జ్యోతివలె ప్రకాశించాలె.. తెలంగాణలో మాత్రం చీకటే రాజ్యమేలాలె’ అనేది వారి ఎత్తుగడ. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే తెరమీదికి తెచ్చిన ‘ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా?’ అనే ప్రశ్న.