70 ఏండ్లకు పైగా లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను నియంత్రించిన వివాదాస్పద కార్మిక స్పాన్సర్షిప్ విధానం కఫాలాను సౌదీ అరేబియా సర్కార్ ఇటీవల రద్దు చేసింది. 2025 జూన్‌లో ప్రతిపాదించిన ఈ సంస్కరణ గల్ఫ్ కార్మిక జీవితాల్లో వచ్చిన అత్యంత కీలకమైన మార్పుల్లో ఒకటిగా చెప్పవచ్చు. సౌదీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 1.3 కోట్ల మంది విదేశీ కార్మికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. వీరిలో 26 లక్షల మందికి పైగా భారతీయులు కూడా ఉన్నారు.
కఫాలా అంటే అరబిక్‌లో ‘స్పాన్సర్షిప్’ అని అర్థం. ఈ విధానం కింద స్థానికంగా కఫీల్ అని పిలిచే యజమాని విదేశీ కార్మికుడికి వీసా స్పాన్సర్ చేస్తాడు. ఆ కార్మికుల మకాం బాధ్యతను కూడా ఆయనే తీసుకుంటాడు. 1950లలో గల్ఫ్ ప్రాంతంలో భారీగా చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. దాంతో విదేశాల నుంచి గల్ఫ్‌కు కార్మికుల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కార్మికుల వలసను నియంత్రించేందుకు నాడు కఫాలా విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, కాలక్రమేణా ఈ వ్యవస్థ దోపిడీ, అసమతుల్యతకు ప్రతీకగా మారిపోయింది. కఫీల్లు విదేశీ కార్మికుల పాస్‌పోర్ట్‌లను జప్తు చేసుకోవడం, వేతనాలు ఇవ్వకపోవడం లేదా ఆలస్యంగా ఇవ్వడం, దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకోవడం లాంటివి చేసేవారు. ఈ విధానం కింద కార్మికులు తమ స్పాన్సర్ (కఫీల్) అనుమతి లేకుండా ఉద్యోగాలు కూడా మారలేరు. దేశం విడిచి వెళ్లలేరు. అంతేకాదు, తమ పట్ల జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు కూడా చేయలేరు. ఇండ్లల్లో పనిచేసే కార్మికులు, ముఖ్యంగా మహిళలు ఒంటరితనంతో కుంగిపోయేవారు. అధిక పని గంటలతోపాటు శారీరక వేధింపులను ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాలు ఈ విధానాన్ని ‘ఆధునిక బానిసత్వం’గా అభివర్ణించాయి.
సౌదీ అరేబియా శ్రామిక శక్తి ఎక్కువగా వలసదారులపైనే ఆధారపడి ఉంది. అక్కడి జనాభాలో దాదాపు 1.34 కోట్ల మంది (42 శాతం) ఇండ్లు, వ్యవసాయం, నిర్మాణ తదితర రంగాల్లో పనిచేసే విదేశీ కార్మికులే ఉండటం గమనార్హం. వీరిలో అత్యధికులు భారత్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారే. వలస కార్మికుల అవస్థల నేపథ్యంలో ఈ స్పాన్సర్షిప్ విధానాన్ని సంస్కరించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో)తో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు ఏండ్లుగా గల్ఫ్ దేశాలను కోరుతున్నాయి. ఈ విధానం బలవంతపు శ్రమ, మానవహక్కుల ఉల్లంఘనలకు దారితీస్తున్నదని ఆరోపిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు గల్ఫ్ రీజియన్‌లో మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో సౌదీ ప్రభుత్వం కూడా తమ వలస విధానాన్ని సంస్కరించింది. 2022 ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు ముందు ఖతార్ తన వలస కార్మిక విధానాన్ని సవరించింది. ఇది ఇతర గల్ఫ్ దేశాలకు ఒక మార్గదర్శకంగా నిలిచింది. కాగా, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్-2030లో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కార్మిక విధానంలో మార్పులు చేసింది. ఇది సమాజాన్ని ఆధునీకరించడానికి, ఆర్థిక వ్యవస్థను వైవిధ్యం దిశగా నడిపించడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల ఇమేజ్ను ప్రదర్శించడానికి రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక అని చెప్తున్నారు.
ప్రస్తుతమున్న స్పాన్సర్షిప్ ఆధారంగా కాకుండా, కొత్త విధానంలో కాంట్రాక్ట్ ఆధారంగా విదేశీ కార్మికులకు సౌదీలో ఉపాధి లభిస్తుంది. ఇకపై విదేశీ కార్మికులు తమ యజమాని అనుమతి లేకుండానే ఉద్యోగాలు మారవచ్చు. దేశం విడిచి వెళ్లవచ్చు. కొత్త విధానం కింద కార్మికులు న్యాయస్థానాలను, హక్కుల కమిషన్ లాంటి సంస్థలను ఆశ్రయించవచ్చు. వేతనాలు ఇవ్వకపోవడం సహా ఇతర సమస్యలపై ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేసేందుకు కొత్త విధానం వీలు కల్పిస్తుంది. భారత్ విషయానికొస్తే, సౌదీ అరేబియా నిర్మాణ, ఆరోగ్య సంరక్షణ, గృహ, సేవా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మందికి ఈ సంస్కరణ ఎంతగానో దోహదపడుతుంది. భారతీయ పౌరుల హక్కులను రక్షిస్తున్నామని, కొత్త విధానం ద్వారా వివాదాలను మరింత వేగంగా పరిష్కరించవచ్చని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత పౌరుల హక్కుల కోసం సౌదీ అధికారులతో కలిసి పని చేస్తూనే ఉంటామని విదేశాంగ శాఖ తెలిపింది.