కోటి రతణాల వీణ నా తెలంగాణ వాగ్దేవి మీటగా ఆ వీణ పలికించిన సాహితీ కళా సంస్కృతి ప్రవాహల సంగమం నుంచి జనించిన వైభవ మూర్తియే మన తెలంగాణా అస్తిత్వం
మరి ఆ ఆస్తిత్వమే ప్రమాదంలో పడ్డ నాడు శ్రావ్యమైన పలుకులు పలికిన ఆ వీణనే ‘రుద్ర వీణ‘గా రూపాంతరం చెంది తన మీటల సవ్వడితో తన బిడ్డల తో ఉద్యమ తాండవం ఆడిస్తుంది.
ఆ రుద్ర వీణ ఆడించే ఉద్యమ తాండవ కేళి లో సింహ గర్జనల్లాంటి భంగిమలెన్నో ఆడగా, ఆ భీకర తాండవ దృశ్య మాత్రం చేతనే సమైక్యవాదపు ‘మహా‘ భూతాలెన్నో కరకట్ట ఆవల నక్కి శరణువేడినై
ఆ ‘మహా‘ భూతాలు మళ్లీ కొత్త ముసుగులో మన అస్తిత్వంపై, మన ఆత్మగౌరవంపై తప్పుడు కూతలతో సకిలిస్తున్నాయ్. ముసుగు ఏదైనా వాళ్ల దాడి ఎప్పుడూ మన అస్తిత్వం, మన ఆత్మగౌరవంపైనే.
ఈ కదన సమయాన కోటి రతణాల ఆ ఉద్యమ రుద్ర వీణలోని కొన్ని మీటలు కోటి రూపాయలకు అమ్ముడుపోయి మూగబోయినాయి.
ఇలా మూగబోయిన ప్రతిసారి ఎందరో మాతృమూర్తులు తమ ప్రేగుబంధాలను ఆత్మార్పణం చేసి ఆ వీణకు మీటలుగా అల్లినారు.
ఆత్మబలిదానాల తెలంగాణలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కొందరి దిగజారిన పోకడలను చూసి నిట్టూర్పులు విడిచి, మళ్లీ అవమానాల పాలవుతున్న మన అస్తిత్వంకై మరో పోరాటం మొదలుపెడదాం.
కొద్దిగా ఆలస్యమైనందుకే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం అయ్యింది, సమైక్యవాదులు ఇచ్చిపుచ్చుకునే పటాల్లో మన తెలంగాణ రాష్ట్ర చిత్రమే మాయం అయ్యింది.
కాకతీయ కళాతోరణం చార్మినార్ అధికారిక చిహ్నం నుంచి మాయంచేసేందుకు ముసుగు తొడిగి మంత్రదండం తిప్పుతున్నారు, వాళ్ల మంత్రాలకు తెర వెనుక తంత్రాలకు మన జీవితాలు మాయం కాకముందే మేలుకుందాం.
దాడి స్వభావం మారొచ్చు కానీ దాడి చేసే వారు ఎల్లప్పుడూ ఒక్కరే. మళ్లీ మన కోటి రతణాల వీణ రుద్ర వీణగా మారాల్సిన సమయం ఆసన్నమైంది, ఇక అలసత్వం వద్దు ఆలస్యం అసలే వద్దు.