దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో విద్వేష నేరాలు, మూకుమ్మడి దాడులు జడలు విప్పుతున్నాయి. గత దశాబ్దం పైచిలుకు కాలంలో ఇవి ప్రమాదకర స్థాయికి చేరుకోవడం గమనించవచ్చు. మీడియాలో వీటికి సంబంధించిన వార్తలు నిత్యకృత్యమైపోయాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో జరిగిన మూకుమ్మడి దాడిలో త్రిపుర విద్యార్థి గాయపడి, తర్వాత దవాఖానలో మరణించిన ఘటనతో దేశం ఉలిక్కిపడింది. డెహ్రాడూన్లో ఏంజెల్ చక్మా అనే విద్యార్థిని అతని రూపురేఖల కారణంగా ‘చైనీయుడని’ ఏడిపించారని, దానిని ప్రతిఘటించడంతో దాడి జరిగిందని ప్రాథమిక వార్తల ద్వారా తెలుస్తున్నది. సామాజిక మాధ్యమాల ద్వారా పెంచి పోషించబడుతున్న పెడధోరణులకు ఈ ఉదంతం ఓ పరాకాష్ఠగా నిలుస్తుంది. భిన్నజాతులు, మతాలకు నెలవైన భారతదేశంలో ఇలాంటివి ఏ మాత్రం ఆమోదయోగ్యం కావు. దాడిలో గాయపడి మరణించిన విద్యార్థి నూరు శాతం భారతీయుడే అనేది నిర్వివాదాంశం. అతడు నిజంగా చైనీయుడే అయినా అతడి ‘చైనీయత’ను ద్వేషించడం, దాడి చేసి చంపడం క్షమార్హం అవుతుందా? అనేది ప్రశ్న. పోలీసులు ఇది విద్వేష నేరం కాదని వాదిస్తుండటం గమనార్హం. ఏతావాతా దానినే రూఢీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ప్రత్యేక చట్టపరమైన నిర్వచనం లేదా విద్వేష నేరాల చట్టం అనేవి లేని కారణంగా ఈ తరహా నేరాలకు సంబంధించి స్పష్టమైన గణాంకాలు లభించడం లేదు. కేసు నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం నేర లక్షణాలను నిర్ధారించే ధోరణి దీనికి కారణం. ప్రభుత్వం కూడా డాటా సరిగా నిర్వహించకుండా దాటవేత ధోరణిలో పోతుండటం వల్ల, డాటాను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం వల్ల కూడా ఆధారపడదగిన అధికారిక గణాంకాలు అందుబాటులోకి రావడం లేదు. దీంతో స్వచ్ఛంద సంస్థలు ఈ బాధ్యత తీసుకోవాల్సి వస్తున్నది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) సంస్థ రూపొందించిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన లెక్కలు వెలుగు చూశాయి. గత ఏడాది కాలంలో విద్వేష నేరాల విష సంస్కృతి తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నదని అవి తెలియజేస్తున్నాయి. 2024 జూన్, 2025 జూన్ మధ్యకాలంలో 947 విద్వేష ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో 602 విద్వేష నేరాలు కాగా, 345 విద్వేష ప్రసంగాలున్నాయి. ఈ విద్వేష దాడులకు మైనారిటీలు, దళితులు గురికావడం సర్వసాధారణమై పోతున్నది. విద్వేష ఘటనల్లో సింహభాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో జరుగుతున్నాయి.
విద్వేష నేరాలపై అంకుశం లేకపోవడానికి అస్పష్టత ప్రధాన కారణం అనేది తెలిసిందే. సుప్రీం కోర్టు 2018లో తెహసీన్ పూనావాలా కేసులో ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసింది. విద్వేష నేరాన్ని మానవతపై జరిగిన నేరంగా చూడాలని సూచించింది. అయితే, ఆ మార్గదర్శకాల అమలు అతీగతీ లేకుండా పోయింది. ఏంజెల్ చక్మా హత్యోదంతం నేపథ్యంలో ఈశాన్య రాష్ర్టాల వారిపై విద్వేష దాడుల నివారణకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేయాలని తాజాగా పిటిషన్లు దాఖలయ్యాయి. రాజకీయ పార్టీలు మొక్కుబడి ప్రకటనలతో సరిపెట్టాయి. కేంద్రంలోని పాలకులు చూసీ చూడని ధోరణిలో పోవడంతో ఈ జాడ్యం జటిలమవుతుండటం అసలు సమస్య. విద్వేష నేరాలు, మూకుమ్మడి దాడులను ఇంకా సహిస్తే దేశ సమైక్యత తీవ్ర ప్రమాదంలో పడుతుందని చెప్పక తప్పదు.