‘సిద్దడు సిట్టపాలెం పోనూ పోయిండు.. రానూ వచ్చిండు’ అన్నట్టే ఉన్నది తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన. రాను పోను ప్రయాణ వ్యయప్రయాసలు దండుగ తప్ప చిల్లిగవ్వ ఉపకారం ఉన్నదా? కొత్తగా పెట్టుబడులు రావాలన్నా.. పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నా.. పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండాలి. తెలంగాణలో ఇప్పుడా పరిస్థితి ఉన్నదా? ఒకవైపు ఈ-ఫార్ములా రేస్, పారిశ్రామిక ఒప్పందాలతో హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెట్టిన మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసులు పెట్టి, అరెస్టు చేయాలని పోలీసుల మీద ఒత్తిడి తెస్తూ.. మరోవైపు అనన్య నటనాశక్తితో, అద్భుత సాంకేతిక నిపుణతతో తెలంగాణ చిత్ర సీమ ఇమేజ్ను అంతర్జాతీయ వెండి తెరకెక్కించిన పుష్ప సినిమా ఫేం అల్లు అర్జున్ను పట్టుబట్టి జైళ్లో పెట్టి.. ఇదే మా ప్రభుత్వం విధానమని తొడగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రపంచ వాణిజ్య వేదికెక్కి పెట్టుబడులు పెట్టమని అడిగితే.. పారిశ్రామిక వేత్తలు మొఖం చూపిస్తారా? ముందుకు వస్తారా?
కిందటేడాది ఇదే బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు వెళ్లింది. రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలైపోయినట్టు ప్రకటించింది. ఇంత పెద్ద మొత్తం పెట్టుబడులు గతంలో ఎవరూ తేలేకపోయిండ్రని ఆర్భాటం చేసింది. తీరా చూస్తే అదంతా ఉత్తదే! గతంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతోనే మళ్లీ సంతకాలు చేసుకోవడంతో పాటు ఊరూ పేరూ లేని వాటితో కూడా ఎంవోయూలు కుదుర్చుకొని.. ఇక రాష్ర్టానికి కొత్త పరిశ్రమలు వచ్చేసినట్టేనన్నంత బిల్డప్ ఇచ్చారు. లక్షల ఉద్యోగాలు వస్తాయనే కలరింగ్ ఇచ్చారు. ఏడాదైనా ఒప్పందాలు చేసుకున్నట్టుగా పెట్టుబడులు రాలేదు. రేవంత్‌రెడ్డి చెప్పిన ఉద్యోగాలూ ఇవ్వలేదు. ఎంవోయూలు చేసుకున్న పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు ముఖం తిప్పి చూడటం లేదు.
దావోస్ వెళ్లి.. అదానీ ప్రతినిధులకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ గ్రూపు తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడికి ఒప్పుకొన్నట్టు ప్రకటించారు. నాలుగు ఎంవోయూలను కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ రెండు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడి, అదానీ కాన్ ఎక్స్ డేటా సెంటర్‌కు రూ.5,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాల కోసం రూ.1,000 కోట్ల పెట్టుబడి, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, ఆధునిక సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో రూ.1,400 కోట్లు పెట్టుబడి ఎంవోయూ కుదిరిందని సీఎం కార్యాలయం ప్రకటించింది. అదానీ ఆర్థిక అవకతవకల మీద అమెరికాలో కేసు దాఖలైన నేపథ్యంలోనే సిల్క్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి ఇచ్చేశారు. ఇంత జరిగాక అటు అదానీ గ్రూప్, ఇటు రేవంత్ ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందం నిలబడి ఉంటుందా? అనేది బేతాళుడు కూడా విప్పలేనంత చిక్కుముడి. నిజానికి కేసీఆర్ హయాంలో హైదరాబాద్ పునర్జీవం పోసుకుంటున్న తీరు చూసి అదానీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఒకటి, రెండు సార్లు కాదు.. అనేక పర్యాయాలు అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారన్న మాట నిజం. కానీ, తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక పాలసీకి విరుద్ధమైన రాయితీలు అడగటం, అతి చౌక ధరలకు మౌలిక వసతుల కల్పన చేయాలనే డిమాండ్, వ్యాపార విధానంలో పాలసీ విరుద్ధమైన కోర్కెలు తదితర కారణాలతో కేసీఆర్ ప్రభుత్వం అదానీ పెట్టుబడులకు అంగీకరించలేదు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదే గ్రూప్‌ను నెత్తిన పెట్టుకొని ఊరేగింది.
కేసీఆర్ విజన్ తెలిసిన నేత కాబట్టి తెలంగాణ యువతకు ఉపాధి చూపించి, జీవన ప్రమాణాలను పెంచే పెట్టుబడులను ఆకర్షించేందుకు 2014లోనే తెలంగాణ పారిశ్రామిక విధాన ముసాయిదాను రూపొందించి అమలుచేశారు. పారిశ్రామిక వినియోగ అవసరాల కోసం సుమారు 2.50 లక్షల ఎకరాల సాగుకు యోగ్యం కాని బంజరు భూములను గుర్తించి పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేసిపెట్టారు. రెడ్ క్యాటగిరీ పరిశ్రమల ఏర్పాటు కోసం జనావాసాలకు దూరంగా, సురక్షితమైన ప్రదేశాల్లో దాదాపు 74,133 ఎకరాల్లో 150 వరకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేశారు. నూతన ఆవిష్కరణలను, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించేందుకు విపణి పరిశోధన నిధిని ఏర్పాటుచేశారు. ఇది కాకలుతీరిన పారిశ్రామిక దిగ్గజాల ఊహకు కూడా అందనంత గొప్ప ఆలోచన. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తెలంగాణకు క్యూ కట్టాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తదితర రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో కొలువుదీరాయి. తెలంగాణ పారిశ్రామిక హబ్‌గా ఎదిగింది. 2021, డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు మూడేండ్ల కాలంలో రూ.2.70 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం సాధించింది. రాష్ట్ర జీడీపీలో 6 శాతం ఉన్న ఉత్పాదకరంగం జీడీపీ 23 శాతానికి పెరిగింది.
విచిత్రం ఏమంటే.. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో మేము బేషరతుగా పెట్టుబడులు పెడతామని మన ఇంటి ముంగిటకొచ్చిన కంపెనీలకు ఇప్పటి పాలకులు దావోస్ కలరింగ్ ఇస్తున్నారు. ఆయా కంపెనీల పెట్టుబడి ఒప్పందాలు తమ లాబీయింగ్ ఘనతగా భుజకీర్తులు తడుముకుంటున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గొప్పగా చెప్తున్న అంతర్జాతీయ కంపెనీలలో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ ఒకటి. తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ థర్మల్, హైడ్రో, సౌర వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీతో ముందుగా చర్చలు జరిపి ఒప్పించింది అప్పటి మంత్రి కేటీఆర్ అనే విషయం పారిశ్రామిక వర్గాల్లో అందరికీ తెలిసిందే. ఇక రెండో కంపెనీ ఆరెజెన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ. ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో 20 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. ఈ కంపెనీ ఫార్మా స్యూటికల్, బయో టెక్నాలజీ కాంట్రాక్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. ఈ కంపెనీతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.2000 కోట్ల ఎంవోయూ చేసుకున్నట్టు చెప్పుకొంటున్నది. నిజానికి ఇది కంపెనీ కార్యకలాపాల విస్తరణ ఒప్పందం మాత్రమే. కాకుంటే, ఈ ఒప్పందం దావోస్‌లో జరిగింది కాబట్టి, ఇది తమ గొప్పతనమే అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భుజాలు ఎగురవేస్తున్నది. చెప్పుకొంటూ పోతే డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒక్కటైన ఐరన్ మౌంటెయిన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్స్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇలా ప్రతి కంపెనీకి కేసీఆర్ ప్రభుత్వంలోనే తెలంగాణలో బాటలు పడ్డాయి. మరో కంపెనీ గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ తెలంగాణలో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీతో పాటు గిగా సెల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎంవో కార్యాలయం గత ఏడాది ప్రకటించింది. ఈ యూనిట్లో 12.5 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్ పర్ అవర్) సామర్థ్యం ఉండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్టు చెప్పారు. రాబోయే ఐదేండ్ల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ), గిగా సెల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. కంపెనీ చరిత్ర చూస్తే ఇది సెల్ కంపెనీ అనటం కంటే షెల్ కంపెనీ అనటం ఉత్తమం. ఈ అన్‌లిస్టెడ్ కంపెనీ మూల పెట్టుబడి రూ.1.5 కోట్లకు మించి కనిపిస్తలేదు. కానీ, ఇది తెలంగాణలో రూ.8 వేల కోట్లు పెట్టుబడి ఎలా పెడుతుందనే సందేహానికి ఎప్పటికీ సమాధానం దొరుకదు.
దావోస్ సదస్సుకు అంతర్జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఆయా దేశాలకు చెందిన నాయకులు, విధాన నిర్ణయాలు చేసే ప్రముఖులు హాజరవుతారు. కాబట్టి అక్కడ సహజంగానే నాయకులు.. కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయి. ఈ క్రమంలోనే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం, ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. కానీ, మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం ఉన్నదనేది ముఖ్యం. ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి వాతావరణం ఉన్నదా? ఇప్పటి పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా, ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ర్టాల బాటపట్టాయి.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనివ్వలేదు. విద్యుత్తు సౌకర్యం, పారిశ్రామిక ప్రోత్సాహం లేక చిన్న పరిశ్రమలు కుదేలైపోతున్నాయి. ఇదిట్లా ఉంటే.. ఈ- ఫార్ములా కార్ రేసు కేసులో కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఫార్ములాను ప్రపంచ దేశాలు, పారిశ్రామికవేత్తలు గమనిస్తున్నారు.
కంపెనీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకొని, కేసుల పాలవటానికి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌ను వెతుక్కుంటూ వస్తారా? చిన్న వెలుగు.. చిమ్మ చీకట్ల తెరలు దాటుకొని టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ప్రపంచస్థాయికి ఎదిగింది. పుష్ప, బాహుబలి, ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలు అంతర్జాతీయ వెండితెర మీద మెరిశాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫిల్మ్ మేకర్స్ హైదరాబాద్ వైపు చూడటం మొదలుపెట్టారు. మన దగ్గర షూటింగ్ చేయటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ అరెస్టు సినిమా పరిశ్రమకు ఓ కుదుపుగా మారింది.
అన్ని వర్గాలను కలుపుకొని పోయిన కేసీఆర్ పాలన పారిశ్రామిక విధానానికి, వ్యవసాయ రంగానికి ఒక స్వర్ణయుగం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు హైదరాబాద్‌కు వరసకట్టారు. 12 ప్రధాన రంగాల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పారిశ్రామిక ఉత్పాదక జీడీపీ అత్యధికంగా 23 శాతం మైలురాయిని అందుకున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో కలిపి దాదాపు పదేండ్ల కాలంలో కోటి మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. అట్లాగే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లు అందిన యి. అటు సాంకేతిక, పారిశ్రామిక రంగాలు, ఇ టు వ్యవసాయరంగాన్ని జోడు గుర్రాల తీరు పరుగెత్తించిన కేసీఆర్ తరహా పాలకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో మరొకరు కనిపించరు.
దావోస్ సదస్సుకు అంతర్జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఆయా దేశాలకు చెందిన నాయకులు, విధాన నిర్ణయాలు చేసే ప్రముఖులు హాజరవుతారు. కాబట్టి అక్కడ సహజంగానే నాయకులు.. కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయి. ఈ క్రమంలోనే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం, ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. కానీ, మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం ఉన్నదనేది ముఖ్యం. ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి వాతావరణం ఉన్నదా?