అర‘చేతి’లో వైకుంఠం చూపి ప్రజలను ఆగమాగం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఓడమల్లయ్య సామెతను పదే పదే గుర్తు చేస్తున్నది. గ్యారంటీల పేరుతో అన్నివర్గాలకు ఆశజూపి ఓట్లు గుంజుకున్నది. తీరా అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపిస్తున్నది. ఈ ధోరణి అన్ని వర్గాల కన్నా ఎక్కువగా రైతాంగాన్ని దెబ్బతీస్తున్నది. ‘అందరికీ అన్ని’ అని ఊరించి ఇప్పుడు నింపాదిగా ‘కొందరికే కొన్ని’ అంటూ కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నది. తాజాగా రుణమాఫీపై జారీచేసిన మార్గదర్శకాలే ఇందుకు ఒక ఉదాహరణ.
ఈ మార్గదర్శకాలు దారి చూపేందుకు కాదు, అత్యధికులకు దారిని మూసేందుకు ఉద్దేశించినవి. వీటి వెనుక ఎంతమందికి ఎగ్గొట్టాలా? అనే ఆలోచన తప్ప మరేమీ లేదని స్పష్టమవుతుంది. రేషన్‌కార్డు (ఆహార భద్రత కార్డు) ఆధారంగా ‘కుటుంబం’ గుర్తింపు అంటే ఎంతమంది ఎగిరిపోతారో ఊహించుకోవచ్చు. కుటుంబంలో ఎందరు రైతులున్నా అందరికీ కలిపి మాఫీ పరిమితి రెండు లక్షలే. కొన్నేండ్లుగా కొత్త రేషన్‌కార్డులే లేవన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా? రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ విచిత్రంగా ఉంది. కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్‌కార్డు, మాఫీ మాత్రం పాస్‌బుక్ ఆధారంగానే జరుగుతుందని అంటున్నారు. అంటే కార్డు పేరిట వడపోతలుండవని ఆయన అనడం లేదనేది గమనించాలి.
ఇక పీఎం కిసాన్ నిబంధనల వర్తింపు మరో వడపోత. అంటే ప్రస్తుత, మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ హుళక్కే. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లకూ వర్తించదు. బ్యాంకుల నుంచి 29 అంశాలపై వివరాలు సేకరిస్తున్నారంటేనే తెలుస్తుంది.. ఎన్నిరకాలుగా కోతలు పెడుతున్నారో! ఉల్లిపొరల్లాంటి నిబంధనలను ఒకటొకటిగా వలుచుకుంటూ పోతే చివరకు ఏమీ మిగలదని అర్థమవుతూనే ఉంది. సగం మందికైనా రుణమాఫీ దక్కుతుందా అనేది సందేహమే. అత్యధికులకు లబ్ధి చేకూరకుండా చేసేందుకే మార్గదర్శకాలను విడుదల చేశారని తెలుసుకునేందుకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపుమాపని వాయిదాల మీద వాయిదాలు పెట్టి చావుకబురు చల్లగా చెప్పినట్టు ఇప్పుడు అడ్డగోలు నిబంధనలతో అమలు చేస్తున్నారు.
స్వరాష్ట్ర సాధన తర్వాత తొమ్మదిన్నరేండ్ల పాటు పచ్చగా కళకళలాడిన సాగు నేడు విషమ పరిస్థితిలో కూరుకుపోతున్నది. రైతుల పట్ల కాంగ్రెస్ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నది. వ్యవసాయాన్ని అష్టదిగ్బంధనంలో పెడుతున్నది. ఎన్నో కడగండ్లకు ఓర్చి సాగుచేసే అన్నదాతకు కృతజ్ఞతగా సమర్పించుకోవాల్సిన రుణమాఫీతో కాంగ్రెస్ చెలగాటమాడుతున్నది. మరోవైపు కరెంటుకు, సాగునీటికి యాతన తప్పడం లేదు. విత్తనాలు, ఎరువుల కోసం బారులుతీరి నిలబడాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిపడింది.
పండించిన పంట చివరి గింజదాకా కొంటారన్న భరోసా లేదు. అన్ని పంటలకూ బోనస్ అన్నవారు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. అందుకే మోసపోయి గోసపడుతున్నం అని రైతులు వాపోతున్నారు. పంటకు ముందు ఠంచనుగా ఖాతాలో పడాల్సిన రైతుబంధు కోతలైన తర్వాత కూడా అందడం లేదు. రైతుబంధు మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీకి ఇంతవరకు అతీగతీ లేదు. పైగా అక్కడా కొర్రీలు వేయాలని సర్కారు చూస్తున్నది. ప్రతిరైతుకూ పంటసాయం, అంటే రైతుభరోసా అందించాల్సిందేనని, లేకపోతే వేల ఎకరాలు పడావు పడతాయని వరంగల్ మహిళా రైతు రమాదేవి చేసిన హెచ్చరికను ప్రభుత్వం చెవికెక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఆహార ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అధఃపాతాళానికి పడిపోవడం ఖాయం. ఇందుకు బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే!