ప్రజలు తమకు న్యాయం కావాలన్నా లేదా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్నా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటి కీలకపాత్ర పోషించే న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండాలి. ధర్మాసనాలను అధిష్ఠించే న్యాయమూర్తులు నిఖార్సైన నిజాయితీపరులై ఉండాలి. నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే నియమబద్ధులై ఉండాలి. అనుమానాలకు అతీతంగా సమున్నతంగా నిలవాలి. అప్పుడే న్యాయవ్యవస్థకు అర్థం, పరమార్థం. కానీ, కారణాలు ఏవైతేనేం కాలక్రమంలో కొన్ని అనౌచిత్యాలు దూరిపోయాయి. కొంత మకిలి వచ్చి చేరిందనేది నిర్వివాదాంశం. ఇక్కడ మనకు ప్రధానంగా కనిపించేవి రెండు అంశాలు. ఒకటి, ధనవ్యామోహం, రెండు పదవీ లాలస. వీటి గురించిన ఉదాహరణలు వెతికేందుకు మనం మరీ సుదూర గతంలోకి వెళ్లాల్సిన పని లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టల ఉదంతం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్నది. కొంతకాలం క్రితం ఓ ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ అనంతరం రాజ్యసభ సభ్యుడయ్యారు. ఓ హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా చేసిన రెండు రోజులకే కేంద్ర పాలకపక్షంలో చేరి ఎంపీగా గెలుపొందారు. వీటిని పూర్తిగా ఇటీవలి కాలపు వ్యవహారాలుగా చూడరాదు. సమీప గతంలో కొంత తీవ్రత పెరిగింది. సందేహాతీతంగా ఉండాల్సిన న్యాయమూర్తుల ప్రవర్తనను ఇలాంటి ఘటనలు ప్రశ్నార్థకం చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
న్యాయవ్యవస్థ ఈ అపనమ్మకాలను తొలగించేందుకు కొన్ని చొరవలు చేపడుతున్నది. మాజీ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పదవీకాలం చివరలో చేపట్టిన చర్యల గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. న్యాయమూర్తులు తమ ఆస్తులను వెల్లడించాలని ఎప్పుడో చేసిన తీర్మానం దుమ్ము దులిపి ఆయన అమల్లోకి తెచ్చారు. పాక్షికంగానైనా జాబితా విడుదల అయ్యింది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడవుతాయనే హామీని ఆ జాబితాకు జతచేశారు కూడా. కాగా ఉన్నత న్యాయస్థానాల నియామకాలు, బదిలీలను పర్యవేక్షించే కొలీజియం వ్యవస్థపైనా పారదర్శకత లోపించిందనే విమర్శలు ఎదురవుతున్నాయి. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు రూపొందించిన ఈ వ్యవస్థ విధివిధానాల గురించిన సమాచారాన్ని, ఎంపికలు జరిగిన తీరుతెన్నులను సుప్రీంకోర్టు వెల్లడించడం విశేషం. ఈ చొరవల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సాహసోపేతంగా మరో అడుగు ముందుకువేశారు. రిటైరైన తర్వాత తాను ఎలాంటి పదవులు చేపట్టబోనని ఆయన ప్రతిజ్ఞ చేయడం ముదావహం. అంతేకాకుండా న్యాయమూర్తులు రాజకీయ పదవుల్లో చేరడమనేది వారి తీర్పులపై ‘ఇతర ప్రభావాల’ గురించిన అనుమానాలు కలిగిస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించారు కూడా.
ఇలా సర్వోన్నత న్యాయస్థానం పారదర్శకత దిశగా అడుగులు వేస్తుండటం ప్రశంసించదగ్గ విషయమే. అయితే ఇవి మాత్రమే న్యాయవ్యవస్థ సచ్ఛీలతకు నూరుశాతం హామీనిస్తాయని చెప్పలేం. ఆదర్శాలు అంతిమ ఫలితాలు సాధిస్తాయా? అనేది సమస్య. రిటైర్మెంట్ తర్వాత న్యాయమూర్తుల వ్యవహార సరళి గురించి రాజ్యాంగం ఏమీ చెప్పకపోవడమే దీనికి కారణం. మాజీ న్యాయమూర్తులు ఏ న్యాయస్థానం ముందూ న్యాయవాదిగా హాజరుకావొద్దని నిషేధించిన 124(7) అధికరణం వారు ప్రభుత్వ పదవులు చేపట్టవచ్చా, లేదా? అనే విషయమై ఏమీ చెప్పలేదు. ఈ సమస్యను ఆదిలోనే గుర్తించిన లా కమిషన్ తన 14వ నివేదిక (1958)లో న్యాయమూర్తులు ప్రభుత్వ పదవులు చేపట్టడంపై పూర్తి నిషేధం విధించాలని సిఫారసు చేసినప్పటికీ అది ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. పోనీ రెండింటి మధ్య చట్టబద్ధంగా ‘సబబైన విరామం’ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) ఏదైనా ఉందా? అంటే అదీ లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమెరికాలో ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు పూర్తి జీవితకాలం పదవిలో కొనసాగే సంప్రదాయం అమలవుతున్నది. మన దేశంలోనూ ఈ తరహా మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదే విధంగా తప్పు చేసిన న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే విషయంలో పైస్థాయి, కింది స్థాయి వారి విషయంలో భారీగా తేడాలున్నాయి. స్థానిక న్యాయస్థానాల జడ్జీలపై చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాల జడ్జీలపై చర్య ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మనకు ఇటీవలి కాలంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఉదంతంతో మరోసారి అనుభవంలోకి వచ్చింది. ఈ సమస్యలన్నీ కూడా సంస్కరణల ఆవశ్యకతను ఎత్తిచూపుతున్నాయి. ఇందుకు న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ సమన్వయంతో వ్యవహరించాలి. న్యాయవ్యవస్థ విశ్వసనీయత పెంచేందుకు చీఫ్ జస్టిస్ గవాయ్ తొలి అడుగు వేయడం అభినందనీయం.