పల్లెల్లో, పట్టణాల్లో, విశ్వవ్యాప్తంగా గులాబీ జెండాలు గుర్తుంచుకోవాలని రామక్క పిలుపు పరీవ్యాపితమై పోతున్నది. భారత రాష్ట్ర సమితి పక్షాన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడ్డ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతోవిజయదుందుభి మోగించేందుకు సంసిద్ధమౌతున్నారు.
శనివారం సాయంత్రం.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ పట్టణం. గులాబీ జెండాలు చూడగానే ఊరంతా ఒక్కచోటికి వచ్చింది. గ్రామ శివారుల్లోనే మహిళలు, యువతులు, యువకులు పెద్దసంఖ్యలో గులాబీ దండులా తరలివచ్చారు. మొట్టమొదటి ర్యాలీలో ఎలా ప్రజలతో మమేకమవ్వాలా అనే జంకుతో ఆరంభమైనా, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గ అభ్యర్థి కడియం శ్రీహరిల పై ప్రజల్లో ఉన్న అభిమానం ఊతంగా ఊరేగింపు ముందుకు సాగింది.
కలిసిన ప్రతీ మహిళ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన వివరణ అవసరం లేకుండానే కంఠతా చెప్పే స్థాయి చైతన్యాన్ని అంది పుచ్చుకున్నారు. నిజంగానే ‘గులాబీల జెండలమ్మ’ పాట చొచ్చుకుపోయిన తరహాలోనే అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు జనం గుండెల్లో చొచ్చుకుపోయాయి. యాంత్రికంగానో, మొక్కుబడిగానో కాకుండా పథకాల లబ్ధిదారులు స్వచ్ఛందంగా భారత రాష్ట్ర సమితి పక్షాన పనిచేయడానికి సంసిద్ధులవుతున్నారు.
మొదటగా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్న ప్రజానీకం తాము గత పదేండ్లుగా పొందుతున్న సౌకర్యాలను చెప్తుండటం ప్రచారానికి వచ్చే నాయకులను ముగ్ధులను చేస్తున్నది. కనీసావసరాలను ప్రాధాన్యతా క్రమంలో అందిస్తూ రైతు కుటుంబాలకు ఆలంబనగా నిలిచిన ఆచరణాత్మక ప్రభుత్వ విధానం ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నది. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాల రూపంలో అందిస్తున్న తాగునీటి సదుపాయం దేశంలో ఎక్కడా లభించడం లేదనే వాస్తవ స్థితి అందరి మదిలో పదిలంగా ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా లేని రైతు అనుకూల రైతుబంధు తరహా పెట్టుబడి సాయం రైతుకు కంటినిండా కునుకునిచ్చే ధైర్యాన్నందిస్తున్నది. ఫసలు కొకసారి పెట్టుబడులకోసం పరితపిస్తూ దిగులుపడే రైతు ఇప్పుడు తమకందుతున్న రైతుబంధు ఊతంగా పంటల దిగుబడి పెంచుకోగలిగే కార్యాచరణను రూపొందించుకుంటున్నాడు.
రైతు ధీమాగా ఉన్నప్పుడే కుటుంబం యావత్తు ధైర్యంగా జీవించగలదు. అది సమాజానికి దిశా నిర్దేశం చేయగలదు. అలా బీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమాన్ని ప్రచార పర్వంలో ప్రజానీకమే సవివరంగా చెప్తున్నారు. కుటుంబంలో ప్రధాన భూమికను పోషించే మహిళా సంక్షేమం పట్ల బీఆర్ఎస్ రూపకల్పన చేసిన, అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉన్నది. ఈసారి కుటుంబాలకోసం రూపొందించిన గృహలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గ్యాస్ సిలిండర్ల రేటు తగ్గింపు వీటికి తోడు సన్న బియ్యం అందించే కార్యాచరణ ప్రజల్లోకి దూసుకెళ్లింది.
24 గంటల ఉచిత కరెంటు విషయంలో ఆచరణాత్మక ఫలితాలను చూస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలు ఇస్తున్న హామీలను విశ్వసించటం లేదు. బీఆర్ఎస్ దీర్ఘకాలిక విజన్ పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమం పట్ల కేసీఆర్ నేతృత్వంలో రూపొందిస్తున్న కార్యాచరణ పట్ల జనంలో అపరిమితమైన విశ్వాసమున్నది. తెలంగాణ ప్రగతి పథ నిర్దేశినిగా బీఆర్ఎస్ను మాత్రమే ప్రజలు పరిగణిస్తున్నారు. ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్న మహిళలు ప్రాక్టికల్‌గా తమకు వివిధ రూపాల్లో అందుతున్న సంక్షేమ ఫలాలను వివరిస్తుండటం గులాబీ జెండాను వాళ్లు తమ జీవిత కాలం మరవరనే వాస్తవాన్ని ధృవపరుస్తున్నది. దళితులు, బీసీల కోసం ఇప్పటికే అమలు పరుస్తున్న పథకాల విస్తరణ రానున్న అయిదేండ్లలో వేలాది, లక్షలాది కుటుంబాల ఉపాధికి ఉపకరిస్తుందని ప్రజల్లో సంపూర్ణ నమ్మకం ఉన్నది.
అవసరాలు, అమలయ్యే తీరు ప్రాతిపదికగా రూపొందించిన గృహలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి తరహా పథకాలు కేవలం బీఆర్ఎస్ నాయకత్వంలో మాత్రమే అమలులోకి తెచ్చుకోగలమని ప్రజలు భావిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా వీధుల్లో గులాబీ జెండాలెత్తి కారు గుర్తుకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఇంటింటి ప్రచారంలో మ్యానిఫెస్టో వివరిస్తున్నప్పుడు ఇండ్లలో మహిళలు, వృద్ధులు ముందే ఆ అంశాలను ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నిజంగానే ‘గులాబీల జెండలమ్మ’ పాట ప్రజల్లో ప్రభుత్వ పథకాలలాగే చొచ్చుకుపోయింది. వాడకట్టులో గుమిగూడిన ప్రజలనుద్దేశించి మాట్లాడడానికి ఉపక్రమించినప్పుడు ఆ పాటకు అనుగుణంగా ప్రజలు వేస్తున్న కోలాటాలు, సంతోష సమాజానికి ప్రతీకలుగా నిలుస్తూ రేపటి ధీమాకు సంకేతాలుగా కొనసాగుతున్నాయి. గులాబీ జెండాలు ఊరూరా రెపరెపలాడుతున్నాయి. కారు గుర్తు అందిస్తున్న సంక్షేమం తమ పదిలమైన భవితకు చిహ్నాలంటున్నాయి. బహుళార్థసాధక ప్రాజెక్టులయినా, సాధారణ జీవనానికి ఉపయుక్తమయ్యే అవసరాలు తీర్చే కార్యాచరణ అయినా బీఆర్ఎస్తోనే సాధ్యమని దారివెంట ప్రతి ఒక్కరూ వివరిస్తున్నారు. ఇది గ్రౌండ్ లెవల్ రియాలిటీ.
– డాక్టర్ కడియం కావ్య 98858 56065