2015లో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి, జైలుకెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన సందర్భంగా రేవంత్ భారీ ర్యాలీ తీశారు. ఏదో ప్రజా పోరాటం చేసి జైలుకెళ్లొచ్చినట్టు ఆ ర్యాలీలో సవాళ్లు విసిరారు. ఇవన్నీ చూసీ జనాలు గెలిపించినందుకు అలాంటి పతనపు, విధ్వంసపు పనులనే ప్రజలు హర్షిస్తారని ఆయన ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. అందుకే తెలంగాణకు ప్రగతి నిరోధకులుగా మారి, రాష్ట్రంలో ఒక స్తబ్ధతను సృష్టించి, అదే తన విజయంగా విజయోత్సవాలు చేసుకున్నారు.
గత సంవత్సరం రెవెన్యూ ఆదాయంలో నెగెటివ్ వృద్ధి నమోదైంది. అయినా విజయోత్సవాల పేరిట జనాల్లేని సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలతో పీఆర్ స్టంట్లు చేశారు. ఇదంతా చూస్తుంటే ప్రజలు ఏమీ ఆలోచించరనే చులకన భావంతో పాలకులున్నారని అర్థమవుతున్నది. నిత్యం సిద్ధాంతాలు వల్లిస్తూ రాద్ధాంతం చేసే మేధావులు ఒక్కరూ ఈ దీనావస్థ గురించి ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం కలిగించడం లేదు. రాష్ర్టానికి ఎలాంటి నష్టం జరిగినా వాళ్లకు పట్టింపు లేదు. వాళ్లకు కావల్సినవి దక్కితే చాలు. ఇది వారి దివాళాకోరుతనాన్ని రుజువు చేస్తున్నది. కరోనా కాలం నాటి ఆర్థిక పరిస్థితిని తలపిస్తూ రెవెన్యూ రాబడి పడిపోతే ఈ సంబురాలేందో? 2024లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు, 2025లో రూ.1.72 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చినట్టు కాంగ్రెస్ పాలకులు ఊదరగొడుతున్నారు.
ఎక్కడైనా పెట్టుబడులు వస్తే, ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా సహజంగానే పెరుగుతుంది. ఇది ప్రజా ఆర్థిక వ్యవస్థలో మౌలిక సూత్రం. కానీ, దీనికి భిన్నంగా రాష్ట్ర ఆదాయం పడిపోవడమేందో, దీన్ని వారు విజయోత్సవాలుగా జరుపుకోవడమేందో? కాంగ్రెస్ పాలకులకే తెలియాలి. ఇటువంటి మనస్తత్వాన్ని పర్వర్స్ ట్రయాంఫలిజం (Perverse Triumphalism) అంటారు. గతంలో బ్రిటిష్ ఇండియాలో 1943 బెంగాల్ దుర్భిక్షం, ఘోర పరిపాలన వైఫల్యం బయటపడిన తర్వాత కూడా బ్రిటిష్ పాలకులు తమ నిస్సహాయతను, చేతకానితనాన్ని గొప్ప సాధికారతగా పేర్కొన్నారు. అదొక గొప్ప విజయంగా తమను తాము కీర్తించుకున్నారు. విజయగర్వాన్ని ప్రదర్శించారు. ఈ ప్రభుత్వం తీరు దానికేం తీసిపోలేదు.
ఇక ఇటువంటి మౌలిక విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, ఆ విషయాలు చర్చకు రాకుండా చేసే డైవర్షన్ గేమ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆరితేరింది. అందులో భాగంగానే తాజాగా విగ్రహాల లొల్లిని తెరపైకి తెచ్చింది. గత పదేండ్లుగా సైలెంట్‌గా ఉన్న శక్తులన్నీ ఇప్పుడు పూర్తి బలాన్ని సంతరించుకున్నట్టు ఒక్కసారిగా మూకుమ్మడి దాడిని ప్రారంభించాయి. గత పదేండ్లుగా ‘తెలంగాణ రాష్ట్రం’ అనే రియాలిటీని భరించలేక ఎంతటి ఆక్రోశాన్ని బిగబట్టుకున్నారో దీన్నిబట్టి అర్థమవుతున్నది? 2015లో ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్‌లో సెక్షన్ 8 విధించాలని, గవర్నర్ చేతిలో శాంతిభద్రతలు ఉండాలని గోలగోల చేసినోళ్ల పంచన చేరి, ఒకరి మీద వ్యక్తిగత ద్వేషంతో మంచి చెడు ఆలోచించకుండా ఏకపక్షంగా మద్దతిచ్చి, ఇక వారి చేష్టలను అడిగే నాథుడు లేడనే బలం వీరిచ్చిందే కదా?
దేశంలో అబద్ధాలతో ఐదారు దశాబ్దాల నాటి చరిత్ర మీద బీజేపీ బురద జల్లుతున్నదని రాహుల్‌గాందీ బాగానే బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. మరి తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో తాజాగా ప్రజల అనుభవంలో ఉన్న చరిత్ర మీద జల్లుతున్న బురద ఆయనకు కనబడటం లేదా? దేశంలో బీజేపీ ఎలాంటి వ్యక్తిత్వ హననపు రాజకీయాలు చేస్తున్నదో.. తెలంగాణలో కాంగ్రెస్ అంతకుమించి చేస్తున్నది.
తెలంగాణ విషయంలో విచక్షణతో ఢిల్లీ కాంగ్రెస్ ఏదైనా చేస్తుందనే ఆశ ఎవరికైనా ఉంటే దాన్ని ఇప్పుడే వదులుకోండి. ఎందుకంటే తెలంగాణను వారు ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారు. అంతే తప్ప, తమ పార్టీ బలంగా మాత్రం కాదు. కేసీఆర్ పాలనా విధానం, తెలంగాణ గ్రోత్ ప్రొగ్రెస్ చూసిన ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణపై ఎప్పుడో ఆశలు వదులుకుంది. అందుకే 2018 నుంచీ ప్రతీది ఆపదమొక్కులే, ఎక్కడైనా తాము బలహీనంగా ఉన్నచోట వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నది. అందులో భాగంగానే 2018లో టీడీపీతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నది. 2023లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, షర్మిల, కమ్యూనిస్టుల కలగూర గంప ఫ్రాంచైజీ ఆపదమొక్కులకు సైతం ఒప్పుకున్నట్టు కనిపిస్తున్నది ఈ సైలెన్స్ చూస్తుంటే. అటువంటి ఫ్రాంచైజీ పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని అడుగడుగునా అవమానపరుస్తున్నారు.
ఏకంగా గ్లోబల్ సమ్మిట్‌లో గత పదేండ్లలో ప్రపంచాన్ని అబ్బురపరిచేలా తెలంగాణలో నిర్మించిన ఐకానిక్ నిర్మాణాల్ని దాచిపెట్టి గ్రాఫిక్స్ షో చేశారు. తెలంగాణ రియాలిటీ ఏమిటనేది బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అదే వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. గత పదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, దేశానికి ఆదర్శంగా నిలిచిన విధానాన్ని కొనియాడారు. ఈ రెండేండ్లలో అదే స్ఫూర్తిని కొనసాగించి ఉంటే అదే స్పీడ్‌తో తెలంగాణ మరింత అభివృద్ధి చెందేది. అసలు తెలంగాణను అర్థం చేసుకుంటే తెలిసేది తెలంగాణ తొలి ప్రభుత్వం ఎలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థకి, ముఖ్యంగా బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి బాటలు వేసిందో. మెట్రో నగరం మాత్రమే ఆదా మార్గమనుకునే పూర్వకాలపు ఆలోచనల్లోనే ఇంకా ఉంటే పొరపాటే అవుతుంది. గత రెండేండ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యానికి సాధ్యమైనన్ని ఆటంకాలు సృష్టించారు. గతంలో ఆర్థిక పరిపుష్టి సంతరించుకున్న గ్రామాలు మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకున్నాయి. ఈ ప్రభావం రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.
అయినా విధ్వంసమే విజయంగా విహరించేటోళ్లకు ఇవన్నీ అర్థమవుతయా? ఒక రిసెర్చ్ బెంచ్ మార్క్ అయినటువంటి తెలంగాణ సమ్మిళిత ప్రగతి వీరికి ఫెయిల్యూర్‌గా కనిపించడం శోచనీయం. వికృత విజయాల క్రీడలో తెలంగాణ నిర్వీర్యానికి కాంగ్రెస్ పాలన ఎంత ఆత్రుతగా పరుగులెడుతున్నదో. ఇకనైనా ఆలోచించండి. ఇకనైనా మేల్కొనండి. వాస్తవాలను గ్రహించండి. ప్రపంచంలో ఎక్కడో ఉన్నోళ్లకు కనబడుతున్న ప్రగతి మన ఏలికలకు ఎందుకు కనబడట్లేదో ఆలోచించండి. మేధావులను కాదు, సోర్స్‌ని నమ్మండి. ఫ్యాక్ట్ చెక్ కోసం కృత్రిమ మేధస్సుని వాడండి. తెలంగాణను నిర్వీర్యం కానివ్వకండి.
జై తెలంగాణ!
– రఘునందన్‌రెడ్డి పాశం