రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్నా అసలు పాలన లేనట్టే అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అసలు విషయాల కంటే కొసరుపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెడుతుండటమే అందుకు ప్రధాన కారణం.
Telangana | ఆరు గ్యారెంటీలతో పాటు వందల హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రతీ వేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదలుకుని గల్లీ లీడర్ల వరకు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ము ఖ్యంగా రైతులను ఊరిస్తూ అనేక ఉచిత హామీలను గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని నట్టేట ముంచింది. ‘ఇప్పుడే బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోండి.
మేం గద్దెనెక్కగానే మీ రుణాలన్నీ మాఫీ చేస్తం’ అంటూ డంబాచారాలు పలికిన రేవంత్.. ఏరు దాటాక అన్నట్టుగా రైతుల నోట్లో మట్టికొట్టారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌తో ఆగమాగమై ఊరూరా కనిపించిన దేవుళ్లందరిపై ఒట్టు వేసిన రేవంత్.. సగం సగం మాఫీ చేసి ఎగనామం పెట్టారు. రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కుతుండటమే అందుకు నిదర్శనం. అంతేకాదు, పంటకు బోనస్ హామీ ఉత్త బోగస్‌గా మారిపోయింది. రైతుభరోసా పేరిట ఇస్తామన్న రూ.7,500 దక్కకపోగా కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రూ.5 వేలకు కూడా ఇప్పుడు దిక్కు లేదు.
ఆసరా పింఛన్ పెంపు మాట ఎత్తడం లేదు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఊసే లేదు. తులం బంగారం ఏమో గాని కల్యాణలక్ష్మి కూడా అందడం లేదు. ఈ పది నెలల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, పీహెచ్డీ పూర్తి చేసినవారికి రూ.5 లక్షల చొప్పున అందిస్తామని ఎన్నికల వేళ బీరాలు పలికిన రేవంత్‌రెడ్డి నేడు యువత నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు.
పరిపాలనపై అవగాహన లేకపోవడంతో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చే రాజకీయాలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వేల సమస్యలున్నా వాటిని పట్టించుకోవడం లేదు. పైగా హైడ్రా, మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూలుస్తూ పేదల బతుకులను బజారుకీడుస్తున్నది. చివరికి ఈ హైడ్రామా బెడిసికొట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటంతో తోకముడవాల్సి వచ్చింది. అసలు మూసీ మురికికూపంగా మారడానికి నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణం. నాటి ప్రభుత్వాల అనుమతితోనే మూసీ చుట్టూ కాలనీలు వెలిశాయన్నది వాస్తవం కాదా?
హైదరాబాద్ ప్రతిష్టను అనతికాలంలోనే డ్యామేజ్ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం వల్ల విశ్వనగరం అన్‌సేఫ్ సిటీగా మారిపోయింది. కూల్చివేతల కారణంగా నగరానికి పెట్టుబడులు రావడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ముఖ్యంగా ప్రజల్లో అభద్రతాభావం పెరిగింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. జగిత్యాల జిల్లాలో జరిగిన పాలక పార్టీ నాయకుడి హత్యే అందుకు ఉదాహరణ. ప్రశాంత తెలంగాణలో మత ఘర్షణలు జరిగే పరిస్థితి దాపురించింది. జీవో 29 విషయమై శాంతియుతంగా నిరసన చేస్తున్న నిరుద్యోగులపై లాఠీలు విరిగాయి. చివరికి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల కుటుంబాలు సైతం వారి హక్కుల కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలా రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను గాలికొదిలేసి మూసీ ప్రక్షాళన అంటూ ప్రజల దృష్టిని మరల్చేందుకు పాలకులు విఫలయత్నం చేస్తున్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ కాం గ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఊరూరా ఉపన్యాసాలు ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుం డా ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేకు బీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం పరాకాష్ఠ. హుందా గా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి తిట్ల దండకం అందుకోవడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, తీవ్ర పదజాలంతో ప్రతిపక్ష నేతలను దూషించడం చూస్తుంటే ఆయనలోని అసహనం కొట్టొచ్చినట్టు కనిపి స్తున్నది. సీఎం బాటలోనే నడుస్తున్న మంత్రు లు సైతం తప్పుడు కూతలు కూస్తూ న్యాయస్థానాల చేత మొట్టికాయలు వేయించుకుంటున్నారు. కక్షసాధింపే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ పాలన ఎప్పుడో గాడితప్పింది.
అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎం తో హుందాగా వ్యవహరిస్తున్నది. దూకుడు ప్రదర్శిస్తూనే అధికార పార్టీ తప్పిదాలను ఎత్తిచూపుతున్నది. అందుకే ఏడాది తిరగకుండానే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కేసీఆర్‌ను తలుచుకుంటున్నారు. సంక్షేమ సారథి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలకు వస్తున్న మద్దతే అందుకు నిదర్శనం. బీఆర్ఎస్కు ప్రజల్లో దక్కుతున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రతిపక్షం గొంతునొక్కాలని చూస్తున్నది.
ఈ దేశంలో అతి తక్కువ కాలంలో అపఖ్యాతి మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సే. ప్రజల దృష్టి మరల్చడం కోసం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన మూసీ సుందరీకరణ, హైడ్రా పాచికలు పారకపోగా మరింత ప్రజాగ్రహానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్‌ను చేజేతులా పోగొట్టుకున్నామని ప్రజలు మథనపడుతున్నారు. ఊరూరా రచ్చబండల వద్ద కేసీఆర్ పాలన గురించే చర్చ జరుగుతున్నది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
( తెలంగాణ విజయ్ )
94919 98702