నువ్వు మళ్లీ ఆ మాట అనేశావ్
మా క్రోధం… అభ్యర్థన
నిరసన… విన్నపం
అన్నీ బూడిదపాలు చేశావ్
అవిచ్ఛిన్న సాంస్కృతిక
వారసత్వాన్ని కొనగోటితో
మీటి పారేశావ్…
అధికారపు జవనాశ్వం
తొక్కిసలాటకు
నన్ను ఒక గడ్డి పరకను చేశావు..
సాంప్రదాయక – సామాజిక
కవితా ఝరిని మురుగు
కాలువ చేశావ్
అధినేతగా ఉండి కూడా
సామాజిక బాధ్యత
అంటరానిది అయిపోయిందా?
నేను ఎవరిని పొగుడుతుండగా
ఎప్పుడు చూశావ్ మిత్రమా?
కవిత్వపు చందమామనై
వెన్నెల కురిపించానే
మంత్రనగరి ఉద్యానకేళిని
మాంత్రికుడినై
భూమికి దించానే?
అసమ జీవితం గురించి
గుండె కుండకు రంధ్రం చేసుకొని
విలపించానే?
ఎవరు అభ్యుదయపు
తూరుపుగా మొలిచినా
కమలం రేకునై స్వాగతించానే
భట్రాజు పొగడ్త అనేటప్పుడు
ఏమైనా ఆలోచించావా?
నువ్వు బీసీలకు చేసిన
అభ్యుదయం ఇదేనా?
మిత్రమా…
దారిలో పల్లేరుకాయలను
మల్లెపూలు చేసేవాడికి
దారిని మూసివేయడం
కూడా తెలుసు
వసంత హరితమై వికసించేవాడికి
గ్రీష్మ గానం చేయడం
కూడా తెలుసు..
ఇప్పటికైనా ఒక తెల్లపావురం
ఎగరేయ్
నిన్ను నువ్వు ఎరుగు
నన్ను కూడా ఎరుగు.
(భట్రాజు పొగడ్త అంటూ అసెంబ్లీలో సీఎం వాడిన ఉపమానాన్ని నిరసిస్తూ…)
– డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్రాజు 9676096614