నంద వంశ పాలనకు సమాధి కట్టి, చంద్రగుప్తుడిని మగధ సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తున్ని చేసిన అపర మేధావి, రాజనీతిజ్ఞుడు చాణుక్యుడు. ఒక విజేత తన ప్రత్యర్థి పట్ల ప్రవర్తించాల్సిన తీరుని ఆయన ఏనాడో చేతల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఆ కాలంలో చాణక్యుడికి సమఉజ్జీ రాక్షసామాత్యుడు.
ఆయన నంద చక్రవర్తికి ప్రధానమంత్రి. ఒక విధంగా చెప్పాలంటే.. రాజనీతిజ్ఞతలో చాణక్యుడి కంటే కూడా నాలుగు ఆకులు ఎక్కువ చదివినవాడే. ఈ విషయం చాణక్యుడికి కూడా తెలుసు.
చంద్రగుప్తుడు గద్దెనెక్కడంతో రాక్షసామాత్యుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చంద్రగుప్తుని శత్రువులతో చేతులు కలిపి అతని పతనానికి కుట్రలు చేయసాగాడు. రాక్షసామాత్యు ని కుట్రలను తెలుసుకున్న చాణక్యుడు అతని రహ స్య స్థావరాన్ని వేగుల ద్వారా తెలుసుకున్నాడు. అతన్ని కలిసి, రాజధాని పాటలీపుత్రానికి ఆహ్వానించాడు. రాజ్య శ్రేయస్సు దృష్ట్యా చంద్రగుప్తుని వద్ద అమాత్యుడిగా ఉండాలని కోరాడు. అయితే, మొదట నిరాకరించినా చాణక్యుడు నచ్చచెప్పడంతో చంద్రగుప్తుని కొలువులో ప్రధానమంత్రిగా చేరాడు రాక్షసామాత్యుడు.
వాస్తవానికి, అప్పటివరకు చంద్రగుప్తుడు, చాణక్యుడిని చంపడానికి రాక్షసామాత్యుడు ప్రయత్నించాడు. రాక్షసామాత్యుడు దొరికితే అతన్ని చంపేయాలన్న కసితో ఉన్నాడు చంద్రగుప్తుడు. అలాంటి శత్రువును సగౌరవంగా తీసుకొచ్చి ‘ఇక నుంచి రాక్షసామాత్యుడే నీ ప్రధానమంత్రి’ అని చాణక్యుడు చెప్పగానే చంద్రగుప్తుడు నిర్ఘాంతపోయాడు. అయి తే, తన నిర్ణయం వెనకున్న రాజనీతిని చాణక్యుడు వివరించి చెప్పడంతో.. రాక్షసామాత్యుడిని సగౌరవంగా ఆహ్వానించి, అమాత్యుడిగా నియమించుకున్నాడు చంద్రగుప్తుడు. తర్వాత రాక్షసామాత్యుడు అమూల్యమైన సేవలందించి మౌర్య సామ్రాజ్య సుస్థిరతకు దోహదపడ్డాడు.
చాణక్యుడు దీని ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశమిచ్చాడు. అదేమిటంటే.. రాజకీయ కక్ష-ప్రత్యర్థికి రక్ష. ఒక పాలకుడికి ప్రత్యర్థి మీద ఉండే కక్ష, అతనికి ఏ మాత్రం మేలు చేయకపోగా కీడు చేస్తుందని దానర్థం. పైగా అది ప్రత్యర్థికి రక్షణ కవచంగా మారుతుంది. అందువల్ల పాలకులెవరైనా తమ ప్రత్యర్థుల పట్ల రాజకీయ కక్షను విడనాడి, ప్రత్యర్థిలోని ప్రజ్ఞాపాటవాలను, అనుభవసారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలి. ఒకవేళ చాణక్యుడు గాని, చంద్రగుప్తుడు గాని రాక్షసామాత్యుని పట్ల కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే మౌర్య సామ్రాజ్యం ఏనాడో పతనమయ్యేది.
మన దేశానికే చెందిన అపర మేధావి, రాజనీతీజ్ఞుడు చాణక్యుడి సందేశాన్ని నేటి రాజకీయ నాయకులు ఏ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పే రాజకీయ నాయకులెందరో.. అనుకూల పవనాలు వీచి అధికారం చేజిక్కుంచుకోగానే ఆ మరుక్షణం నుంచి ‘ప్రజాపాలన’ ను విస్మరిస్తున్నారు. ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి తమ సర్వశక్తులను ధారపోస్తున్నారు. ఈ కక్షపూరిత రాజకీయాలు పాలకులకే శాపాలుగా మారడ మే కాకుండా, ప్రత్యర్థులకు రక్షణ కవచాలుగా మారు తున్నాయన్న వాస్తవాన్ని పాలకులు గ్రహించడం లే దు. పాలకుడి ప్రవర్తన తన ప్రత్యర్థి పట్ల కక్షపూరితం గా మారుతున్నదని భావన కలిగిన మరుక్షణం నుంచే ప్రజలు అతన్ని ఏవగించుకుంటున్నారు. అది క్రమే ణా బలపడి ఆ పాలకుడి పతనానికే దారితీస్తున్నది.
మన దేశ రాజకీయ చరిత్ర పుటలను ఒకసారి పరికించి చూస్తే.. గాలివాటున అధికారం చేజిక్కుంచుకున్న ఎందరో పాలకులు తమ ప్రత్యర్థులను శారీరకంగా, మానసికంగా హింసించిన ఘటనలు మనకు కనిపిస్తాయి. అంతటితో తృప్తిచెందని చాలామంది అక్రమ కేసులు పెట్టి వారిని జైలుపాలు చేసి రాక్షసానందం కూడా పొందుతున్నారు. రాజకీయ కక్షలకు పాల్పడుతూ, పాలనను గాలికొదిలేసే అలాంటివారికి చివరికి దక్కే ఫలితం ఏమిటంటే.. పదవీ భ్రష్టత్వం. ఇలాంటి మనస్తత్వం ఉన్న పాలకులను ప్రజలు ఏ చేతులతో అయితే గద్దెనెక్కించారో అవే చేతులతో గద్దె దించుతారు.
ఒక పాలకుడు తన ప్రత్యర్థి పట్ల వ్యవహరించే వైఖరిని మాత్రమే కాదు, ప్రత్యర్థి పట్ల వాడే పరుష భాషను కూడా ప్రజలు సునిశితంగా గమనిస్తుంటారు. బూతు మాటలు, పరుష పదజాలం, తిట్ల దండకం తమ భజనపరుల కరతాళ ధ్వనులకు పనికొస్తాయే తప్ప, పాలకుడు వాడే అటువంటి భాష అతనికి ఏ మాత్రం శోభనివ్వదు. అంతేకాదు, ఆ నాయకుడిలోని అల్పత్వానికి, కుసంస్కారానికి అది దర్పణం పడుతుంది.
ప్రజలు అమాయకులని కొందరు నేతలు నమ్ముతుంటారు. ప్రజలు ఎంతో తెలివైనవాళ్లన్న విష యం వారికి తెలియదు. పాలకుల ప్రతీ చర్యను, ప్రతి అడుగును, ప్రతి మాటను ప్రజలు గమనిస్తుంటారు. అంతేకాదు, వాటి ద్వారా నేతల వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తారు. అందుకు తగ్గట్టుగా వేయాల్సిన సమయంలో వారికి మార్కులు వేస్తారు.
ఇటీవల ముగిసిన అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కమలా హ్యారిస్ ఓటమికి సంద ర్భం లేకుండా ఆమె పగలబడి నవ్వడం కూడా ఒక కారణమని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే.. రాజకీయ నాయకుల ఉత్థాన పతనాల్లో చిన్న చిన్న అంశాలు కూడా ప్రాధాన్యం వహిస్తాయని దీని ద్వారా తెలుస్తున్నది. ఇంత చిన్న విషయాలను కూడా పరిశీలించే ప్రజలు ఒక పాలకుడు తన ప్రత్యర్థి పట్ల వ్యవహరించే తీరును పరిశీలించకుండా ఉంటారా? ప్రత్యర్థులపై పాలకులు కక్ష పెంచుకుంటే చూస్తూ ఊరుకుంటారా? అందువల్ల పాలకులెవరైనా సరే తమ ప్రత్యర్థుల పట్ల కక్ష మా ని, ప్రజాశ్రేయస్సుపై దృష్టిసారించాలి. అలాంటి వారే నాలుగు కాలాల పాటు మనగలుగుతారు. లేకపోతే అతి తక్కువ కాలంలోనే చరిత్ర పుటల్లో మరుగున పడిపోతారు.
– బసవరాజు నరేందర్‌రావు
99085 16549