ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు, ఉచితాలు దేశ, రాష్ర్టాల ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడి భారంగా మారుతున్నాయి. కాబట్టి ఎన్నికల్లో ఉచితంగా ఇస్తామనే హామీలు ఇవ్వకుండా పార్టీలను నియంత్రించాలి. దీంతో పాటు అలాంటి హామీలు ఇస్తున్న పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దుచేయాలని ‘అశ్విని ఉపాధ్యాయ’ పిల్ దాఖలు చేశారు. విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ, కృష్ణ మురారి, హిమా కోహ్లితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్, ఆర్థికసంఘం లాంటి సంస్థలతో విపక్షాలతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది.
ఉచితాల వల్ల ప్రభుత్వాలపై ఆర్థికభారం పడి ఆర్థికవ్యవస్థలు సంక్షోభంలోకి నెట్టబడతాయనే పిడివాదం, అసందర్భమైన, అనాలోచితమైన వాదనను ముందుకుతెస్తున్నవారు ఏవి ఉచితాలు, వేటిని ఉచితాలుగా పరిగణించాలనే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. భారత పాలకులు అవలంబించిన ట్రికిల్ డౌన్ థియరీ వల్ల పేదరికం ‘మొక్కై వంగనిది మానై వంగుతుందా’ అన్న చందంగా మారింది. అంతకంతకు పెరిగిపోయిన పేదరికంతో మగ్గిపోతున్నవారిని ఆదుకోటానికి ప్రభుత్వాలు సామాజిక భద్రతా పథకాలు, పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధి కల్పనా కార్యక్రమాలను 5వ ప్రణాళిక నుంచి ప్రారంభించాయి. వీటిద్వారానే దేశంలోని కిందివర్గాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించబడుతుందనేది వాస్తవం.
ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’, పేదలకు ఆహార భద్రత కోసం ఎన్టీఆర్ ‘రెండు రూపాయలకే కిలో బియ్యం’, పేద పిల్లలను బడిబాట పట్టించడానికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ‘అమ్మఒడి’, సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కోసం కేసీఆర్ ‘రైతుబంధు’ పథకాలు ప్రారంభించి పేద ప్రజలకు అండగా నిలిచారు. కరోనా కష్ట కాలంలో పనులు కోల్పోయి దిక్కుతోచని పేదలకు ఉచితంగా ఐదు కిలోల బియాన్ని పంపిణీ చేయడానికి నరేంద్ర మోదీ ‘ప్రధానమంత్రి గరీబీ కల్యాణ్ అన్నా యోజన’తో పాటు వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి సామాజిక భద్రతా సంక్షేమ పథకాలకు ఉచితాలని ముద్రవేసి ఆర్థికభారంగా పరిగణించి రద్దుచేయాలనే వాదన సహేతుకమేనా? పేద ప్రజల పక్షాన ప్రభుత్వాలు అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఉచితాలుగా భావిద్దామా? సామాజిక భద్రతను కల్పించే పథకాలుగా భావిద్దామా? అని ఆలోచించినప్పుడే సమాజంలో సమానత్వాన్ని, ఐక్యతను ఆశించగలం.
సంక్షేమ పథకాలను ఆర్థికకోణంలో కాకుండా భద్రత, సామాజిక న్యాయకోణంలో చూడాలి. ఉచితాలకు సరైన నిర్వచనం ఇవ్వకుండా, ఉచితాలను రద్దుచేయాలనే వాదన సరైనది కాదు. కరోనా సంక్షోభకాలంలో ‘ఆత్మ నిర్భర్ భారత అభియాన్’లో భాగంగా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీల కంటే పేదలకు, ఉపాధి కోల్పోయినవారికి చేసిన సహాయం తక్కువనే చెప్పాలి. రోజుకు రూ.వెయ్యి కోట్లు సంపాదించే ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ లాంటి పారిశ్రామిక కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తే అధికభారం పడదా? పేదలకు ఇచ్చేవి ఉచితాలైనప్పుడు పెట్టుబడి సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేవాటిని కూడా ఉచితాలుగానే భావిస్తారా?
ప్రభుత్వ నిర్ణయాలు సమర్థవంతంగా లేకపోవడం, పాలకుల అనాలోచిత నిర్ణయాలు, అవినీతి వల్ల పతనమైన దేశాలను చూశాం. కానీ ఉచితాలతో పతనమైన ఆర్థిక వ్యవస్థలను ఎక్కడా చూడలేదు. శ్రీలంక పతనానికి, సంక్షోభానికి కారణం ఆ దేశ పాలకుల అనాలోచిత నిర్ణయాలు. పర్యాటక, వ్యవసాయ, విదేశీ వ్యాపారరంగంలో సంక్షోభం, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, శ్రీలంక చేసిన అప్పులు అని గమనించాలి. ఆ దేశ పాలకులు ఉచితాలు ఇవ్వటానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుచేయటానికి అప్పులు చేయలేదనే విషయాన్ని గమనించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకే అప్పులు చేస్తున్నాయనే వాదన కూడా తప్పు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న ప్రభుత్వాలు పాలన నిర్వహణపై చేసే ఖర్చు కంటే, సంక్షేమ కార్యక్రమాలపై చేసే ఖర్చు చాలా తక్కువ. గడిచిన ఐదేండ్లలో బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దుచేశాయి. పారిశ్రామిక, పెట్టుబడిదారీ, కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నాయి. వేల కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఎగవేస్తున్నాయి. అవి ఆర్థికభారం కానప్పుడు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఎలా భారంగా భావిస్తారు.? వాటిని ఉచితాలుగా ప్రకటించి రద్దుచేయాలనే వాదన తీసుకురావడం అంటే దేశంలోని పేద ప్రజలపై విషం చిమ్మడమే. పేదరికం, నిరుద్యోగం, అసమానతలున్నంతకాలం పేదలను కిందివర్గాలను ఆదుకోవడానికి సంక్షేమ, సామాజిక, భద్రతా కార్యక్రమాలు కొనసాగించాల్సిందే.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రమాదకరం కాదు, ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి ఓటర్లకు పంచే డబ్బు ప్రమాదకరం. పాలనలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతి దేశ ఆర్థికవ్యవస్థకు గొడ్డలి పెట్టు. వాటిని నియంత్రించడానికి చట్టాలు, వ్యవస్థలు ముందుకురావాలి. కానీ, పేదలకు సామాజిక, ఆర్థికభద్రత కల్పించడానికి తీసుకువచ్చిన పథకాలను ఉచితాలుగా పేర్కొంటూ, అది ఆర్థికవ్యవస్థపై భారం, ప్రజలను సోమరులుగా తయారుచేస్తున్నాయి కాబట్టి వాటిని రద్దుచేయాలని వాదించటం సహేతుకం కాదు. ఆయా పథకాల్లో ఉన్న లోటుపాట్లను సరిచేసి అవినీతికి, పక్షపాతానికి తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేవిధంగా చర్యలు చేపట్టినప్పుడే వాస్తవిక ఫలితాలు రాబట్టగలం. దాశరథి కృష్ణమాచార్య ఆశించినట్లు ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు వచ్చినప్పుడు ఉచితాలు అడిగేవారు, కావాలనే వారు ఉండరు’. అసమానతలు కొనసాగినంతకాలం బాధితులకు భద్రత కల్పించడమే సహజ, సామాజిక న్యాయం. దానికి ప్రభుత్వాలు కట్టుబడి పనిచేయాల్సిందే.
– డాక్టర్ తిరునహరి శేషు
(వ్యాసకర్త: రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు, కేయూ)