ఇరాన్ యుద్ధం ఎవరికి ఏరకం లాభం కలిగిస్తుందో ఇదమిద్ధంగా తెలియదు గానీ ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మాత్రం అట్టుడికిస్తున్నది. ట్యాంకర్ల రాక ఆలస్యం కావడం వల్ల ఏర్పడిన వంటగ్యాస్ కొరత ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మన రాష్ట్రంలో వాణిజ్య గ్యాస్ సరఫరా సమస్య చుక్కలు చూపిస్తున్నది. ఫలితంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉన్నది. గృహోపయోగ గ్యాస్ సరఫరా ఇంకా మెరుగుపడకపోవడంతో ఎండలో బండలతో ప్రజలు బారులుతీరి నిలువాల్సి వస్తున్నది. ఇదిలా ఉంటే మరోవైపు పెట్రోల్ సరఫరా డోలాయమానంలో పడింది. సీఎన్జీతో పాటు పెట్రోలు, డీజిల్‌కు కొరత ఏర్పడటంతో అనేక బంకులు నోస్టాక్ బోర్డులు పెట్టాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురై దొరికినచోట దొరికినట్టు ట్యాంకులు నింపేసుకుంటున్నారు. ఫలితంగా తర్వాత ఎప్పుడో రావాల్సిన కొరత ఇప్పుడే కృత్రిమంగా ఏర్పడుతున్నది. బంకుల వద్ద వాహనాలు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలకు నిజాలు చెప్పి భరోసా కల్పించాలి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో తెలియదు కానీ ఆందోళన తగ్గించే బదులు, మరింత పెంచేలా వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలం నాటి పరిస్థితులు వస్తాయని ఆయన చెప్పడం ఏరకంగా చూసినా ఆమోదయోగ్యం కాదు. కరోనా అనగానే ప్రజలకు అనాలోచితంగా, ఉన్నపళంగా ప్రకటించిన లాక్ డౌన్ గుర్తుకు వస్తుంది. దానివల్ల ప్రజలు, ముఖ్యంగా బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయిన కార్మికులు అనుభవించిన నరకం గురించి తెలిసిందే. ఓవైపు ప్రజలు పెట్రోల్ కోసం వీధులకెక్కితే ప్రభుత్వం ఆలస్యంగా చమురు కంపెనీలతో ప్రకటనలు చేయించి చేతులు దులిపేసుకున్నది. యుద్ధం వల్ల చమురు సమస్య ఏర్పడిందనేది ఎవరూ కాదనరు. దానికి హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన ప్రతిష్టంభన అగ్నికి ఆజ్యంపోసింది. ఇరాన్ ఎదురుదాడుల వల్ల పశ్చిమాసియాలోని అనేక చమురు క్షేత్రాలు బుగ్గిపాలయ్యాయి. వాటిని బాగుపరచడం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. కొన్ని చమురు క్షేత్రాలు మళ్లీ పనిచేయడానికి కనీసం ఐదేండ్లు పడుతుందని అంటున్నారు. చమురు సమస్యకు అదనంగా ఎరువుల సమస్య కూడా తోడవుతున్నదని, దీనివల్ల ఆహార భద్రతకు ముప్పు తలెత్తుతున్నదని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించడం గమనార్హం. ఇండియా నుంచి ఇటలీ దాకా అన్ని దేశాలూ దీనివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు సరైన వ్యూహాలు వేసుకోవాలి తప్ప ప్రజలను కరోనా పేరు చెప్పి భయభ్రాంతులకు గురిచేయడం అర్థరహితం. అటు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, చమురు, గ్యాస్ కొరత నేపథ్యంలో ఎలాంటి సన్నద్ధతతో ఉన్నారని విలేకరి అడిగితే అందరూ సూర్య భగవానుడిని ప్రార్థించాలని, పూర్వం మాదిరిగా రాళ్లతో నిప్పు పుట్టించే మార్గాన్ని అనుసరిండమే ఉత్తమమని చెప్పుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రి, ఒక తీవ్రమైన సమస్యపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. మరోవైపు వంటగ్యాస్ కొరతపై మాట్లాడిన పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. అందుకే ఈ సంక్షోభంపై శాసనసభలో లోతుగా చర్చించేందుకు అవకాశం కల్పించాలని విపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేయడం తెలిసిందే.
ప్రపంచంలో అత్యధిక చమురు వినియోగించే దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉన్నది. మన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంటాయి. ఈ దృష్ట్యా చూస్తే ప్రభుత్వం రాబోయే సంక్షోభాన్ని గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఆలస్యంగా నిద్రలేచి సంక్షోభ నివారణ మార్గాలు సూచించేందుకు ఏడు సాధికార కమిటీలు వేస్తున్నట్టు ప్రకటించింది. వ్యూహాత్మక నిల్వలు తొమ్మిదిన్నర రోజులకు మాత్రమే సరిపడా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వేసిన పిటిషన్‌కు సమాధానంగా ప్రభుత్వం వెల్లడించింది. దీనికి అదనంగా 64.5 రోజుల సాధారణ నిల్వలు ఉన్నాయి. అంటే మొత్తం సుమారుగా 74-75 రోజులకు ఇవి సరిపోతాయి. ఆ తర్వాత ఏమిటనేది ప్రశ్న. ఈ సమ స్య ఎప్పుడు ఎలా తీరుతుందనేది ప్రభుత్వం చెప్పలేకపోతున్నది. సామర్థ్యాన్ని విస్తరించుకొని, సకాలంలో నిల్వలు పెంచుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇది మన సంసిద్ధతలోని డొల్లతనాన్ని తెలియజేస్తున్నది.