పవన్ ఒక ప్రోబింగ్ డ్రోన్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురించి ఎవరిని కదిలించినా, తెలంగాణలో ఎందుకూ కొరగాని ఆయన విషయం ఎందుకు మాట్లాడటమని ఆశ్చర్యపోతున్నారు. ఒక నటునిగా తప్ప తనకు ఇక్కడ రాజకీయంగా విలువ ఇస్తున్నవారు ఒక్కరూ కనిపించటంలేదు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురించి ఎవరిని కదిలించినా, తెలంగాణలో ఎందుకూ కొరగాని ఆయన విషయం ఎందుకు మాట్లాడటమని ఆశ్చర్యపోతున్నారు. ఒక నటునిగా తప్ప తనకు ఇక్కడ రాజకీయంగా విలువ ఇస్తున్నవారు ఒక్కరూ కనిపించటంలేదు. అయితే, తెలంగాణలో తన స్థాయి ఏమిటో ఆయనకు తెలియదనుకోలేమని, తన వెనుక ఉండి రిమోట్ కంట్రోల్ చేస్తున్న వారి కోసం ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రోబింగ్ డ్రోన్ వలె పని చేస్తున్నారనే అభిప్రాయం నెమ్మదిగా వ్యాపిస్తున్నట్టు కనిపిస్తున్నది.
ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధ సందర్భాల్లో ప్రోబింగ్ డ్రోన్లు బాగా వార్తలకెక్కాయి. అవి, మందుగుండు సామగ్రితో వెళ్లి దాడి జరిపి నష్టం కలిగించేవంటివి కావు. శత్రుదేశపు భూభాగంపై ఎగురుతూ సమాచారాన్ని సేకరించి తమ సైనిక కేంద్రాలకు పంపుతాయి. అందుకే వాటిని ఇన్స్పెక్షన్ డ్రోన్లు, సెన్సర్ డ్రోన్లు అని కూడా అంటారు. వాటిని ఇతర సంస్థలకు వలెనే సైన్యాలు, సరిహద్దు గస్తీ దళాలు కూడా సమాచార సేకరణకు ప్రయోగిస్తుంటాయి. ఇటువంటి డ్రోన్లు స్వయంగా దాడులు చేయకపోయినా, చేసే వారికి చాలా ఉపయోగపడుతాయి. అదే ప్రకారం, తెలంగాణలో తన ప్రోబింగ్ వల్ల పవన్ కల్యాణ్ రాజకీయంగా జనసేనకు ఉపయోగపడేది నికరంగా ఉన్నా లేకపోయినా, తనను ప్రయోగించిన వారికి ప్రయోజనం కలగవచ్చునా? కలిగేదీ లేనిదీ తెలియదు గాని, కనీసం వారి ఆశ అది.
పవన్‌ను ప్రయోగించిన వారెవరన్నది అందరూ మాట్లాడుకుంటున్నదే గనుక, మనమిక్కడ దాచిపెట్టటానికి ఏమీలేదు. తెలంగాణలో అధికారానికి రావాలని, దానిని ముఖద్వారం చేసుకొని దక్షిణాదిన బలం సంపాదించాలన్న కోరికను బీజేపీ ఎప్పటి నుంచో బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నది. అది ఒంటరిగా సాధ్యపడే అవకాశం కనిపించనందున తెలుగుదేశం పార్టీని, జనసేనను ఉపయోగించుకుంటూ ప్రయత్నించాలన్నది వ్యూహం.
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును, ఇతరత్రా కూడా ఆయన స్వభావాన్ని గమనిస్తున్న కొందరైతే, చివరిదశలో పరిస్థితిని బట్టి ఎన్నికలకు ముందు వెనుకలుగా ఆయన సైతం ఈ ముగ్గురితో చేరినా ఆశ్చర్యపడనక్కరలేదని అభిప్రాయపడుతున్నారు. అది జరిగితే ఆ కూటమి దుష్టచతుష్టయం అవుతుందన్నమాట.
బీజేపీ లక్ష్యం స్వయంగా అధికారానికి రావటం కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కావలసినవి మూడు. తమ ప్రయోజనాలకు భంగకరంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై కక్ష తీర్చుకోవటం మొదటిది. ఎన్నో కొన్ని సీట్లు గెలిచినట్టయితే బీజేపీ, పవన్ కల్యాణ్‌తోపాటు రేవంత్‌రెడ్డి వంటి వారిని కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, తెలంగాణను తిరిగి అంతర్గత వలసగా మార్చుకోవచ్చునన్నది రెండు. ఉమ్మడి రాష్ట్రం నాటి వలె పూర్తిస్థాయి అంతర్గత వలస కాకపోయినా పాక్షిక అంతర్గత వలస అన్నమాట. ఈ రెండింటిని సాధనంగా చేసుకొంటూ తెలంగాణలో దీర్ఘకాలికంగా టీడీపీని, బీజేపీ కూటమి అయిన ఎన్డీఏను బలోపేతం చేయటం మూడు. గతంలో టీడీపీతో ఉంటూ లాభపడి, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ నాయకులలో కొందరికి ఈ 2026లోనూ టీడీపీ పట్ల ప్రేమ ఉండటం తెలిసిందే. రాగల కాలంలో పరిస్థితి కూటమికి అనుకూలమయ్యేట్టు కనిపిస్తే వారు తిరిగి అందులోకి మారబోరన్న హామీ లేదు. దీనంతటికి తోడుగా, బీజేపీ, టీడీపీల ధనబలంతో ఎవరూ పోటీపడలేరు.
నాయకుల నుంచి కార్యకర్తల వరకు ధనాకర్షణకు, పదవుల ఆకర్షణకు లోనై అన్ని సిద్ధాంతాలను, నైతికతలను వదలివేసే ధోరణి నానాటికి బలపడుతుండటాన్ని చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు రాజకీయమన్నది చాలా వరకు బేరసారాల వ్యాపారం. ఆర్థిక సంస్కరణల కాలం నుంచి డబ్బు చలామణి పెరిగి, కోరికలు, కన్జూమరిజం వేగంగా పెరగటాన్ని, ఆ ప్రభావాలతో మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు క్షీణించటాన్ని చూస్తున్నాము. అవే ప్రభావాలతో ఒకప్పటి రాజకీయ విలువలు, విశ్వాసాలు బలహీనపడుతున్న ఆందోళనకరమైన సోషలాజికల్ మార్పులను కూడా చూస్తూనే ఉన్నాము.
ఇటువంటి రాజకీయానికి తెలంగాణలో గల అవకాశాలు ఏమిటో అంచనాలు వేయటం పవన్ కల్యాణ్ అనే ప్రోబింగ్ డ్రోన్ పని. వీటిని సెన్సర్ డ్రోన్లని కూడా అంటారని పైన చెప్పుకొన్నాము. ఆ విధంగా పవన్ డ్రోన్‌కు కొన్ని సెన్సర్లు ఉన్నాయి. తన రకరకాల మాటలకు, చేతలకు ఏ వర్గం ఏ విధంగా స్పందిస్తుంది? ఆచరణపూర్వకంగా ఎవరెంత ముందుకు వస్తారు? ఈ విధమైన అంచనాలను బట్టి ఏ వర్గాన్ని, వ్యక్తులను రాగల కాలంలో ఆకర్షించవచ్చు? వేర్వేరు పార్టీలలో ఎవరినైనా ప్రభావితం చేయవచ్చునా? అన్నవి ప్రశ్నలు. వ్యూహాత్మకంగా ఆలోచించినప్పుడు ఇక్కడ గమనించవలసినవి రెండుంటాయి. ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీలను విడివిడిగా చూసినప్పుడు తెలంగాణలో కొందరికి ఒక పార్టీ నచ్చి మరొకటి నచ్చకపోవచ్చు. ముగ్గురిని కలిపి చూసినప్పుడు ఆ వ్యతిరేకత ఒక్కోసారి న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నిర్దిష్టంగా మాట్లాడాలంటే, తెలంగాణవాది అయిన ఒక వ్యక్తికి టీడీపీ, జనసేనల పట్ల వ్యతిరేకత ఉండి, బీజేపీ పట్ల అనుకూలత ఉన్నదనుకుందాము. అప్పుడు తను బీజేపీ అనుకూలత కారణంగా టీడీపీ, జనసేనలపై వ్యతిరేకతను పక్కన పెట్టవచ్చు.
ఇవన్నీ కేవలం ఊహాగానపు విశ్లేషణలని ఎవరైనా భావిస్తే పెద్ద పొరపాటు అవుతుంది. మనుషుల ఆలోచనలు అనండి, లేదా ఓటింగ్ బిహేవియర్ అనండి, లేదా రాజకీయాలతో ప్రభావితం అయ్యే తీరు అనండి సూక్ష్మస్థాయిలో ఇదే విధంగా పని చేస్తుంది. ఈ సూక్ష్మస్థాయి స్థితిని పసికట్టలేకనే ఎన్నికల పండితులు, సర్వేయర్లు తరచూ బోల్తా పడుతుంటారు.
కనుక, పవన్ కల్యాణ్ అనే ప్రోబింగ్ డ్రోన్‌ను ప్రయోగించటంలోని తెలివైన వ్యూహాన్ని గాని, ఆయన పిచ్చి మాటలు ఏవి మాట్లాడి పిచ్చిగంతులు వేసినా మొత్తం మీద తన విన్యాసాలను ఒక సాధనంగా ఉపయోగించుకొంటూ కావలసిన ప్రోబింగ్లు చేయటంలోని ప్రమాదాన్ని గాని తక్కువ అంచనా వేయటం పొరపాటు అవుతుంది. మనం మామూలుగా వినము గాని, తాము గురిపెట్టిన దేశంలో జరిగే ఎన్నికల్లో తమకు అనుకూలురను గెలిపించి వ్యతిరేకులను ఓడించేందుకు సీఐఏ, మొస్సాద్, ఎంఐ-6 వంటి రహస్య సంస్థలు ఇటువంటి సూక్ష్మ పరిశీలనలు, రహస్య సర్వేలు జరిపి, ఓటర్లలో ఎవరిని ఎట్లా ప్రభావితం చేయవచ్చునో చూస్తుంటాయి. అంతర్జాతీయ వర్గాలలో ఇది బహిరంగ రహస్యం.
(తరువాయి భాగం రేపటి సంచికలో)
– టంకశాల అశోక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

