సమకాలీన మానవ జీవితమే ఆధునిక కవిత్వం. కాలంతో పాటు కవిత్వం కూడా పరిణామం చెందుతుంది. సమాజంలోని జాతి, లింగ, వర్గ, వర్ణ, ప్రాదేశిక నిర్మాణాత్మక అంతరాలతో పాటుగా చిన్నచూపు, వివక్ష, స్వార్థం, ధనిక, పేద వంటి గుణాత్మక లోపాలు రూపం మార్చుకుంటాయే తప్ప, పూర్తిగా అంతం కావు. వాటి తీవ్రతను తగ్గించి, రూపుమాపగలిగే శక్తి కవిత్వానికే ఉంటుంది. సాంకేతికత, నాగరికత ఎంతగా అభివృద్ధి చెందినా మానవ అనుభూతులు, ఆత్మగౌరవం, భావోద్వేగాలు, స్వార్థ చింతన ఎన్నటికీ మారవు. కవిత్వం మనిషి గాయాలకు మందు పూయడమే కాదు, సామాజిక చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది.
తెలుగులో నన్నయ, తిక్కన, ఎర్రనలకు కవిత్రయంగా గుర్తింపు లభించింది. తెలుగు కవిత్వంలో సంస్కృతి ఉంది కానీ, నాగరికత లేదు. సంప్రదాయం ఉంది కానీ, సమానత్వం తక్కువగా ఉంది. సౌందర్యం, అనుభూతి, టెక్నిక్, కథ, నిర్మాణం వంటివి కవిత్వ విమర్శ చర్చలో ప్రధానంగా ఉన్నాయి. తెలుగు కవిత్వంపై గుణాత్మక చర్చ జరగడం లేదు. కవిత్వం కవి అనుభూతికి మాత్రమే పరిమితం కానప్పుడు, అది తరతరాలుగా వర్తించేదిగా ఉన్నప్పుడు చర్చించాల్సింది కవిత్వ నిర్మాణం గురించి మాత్రమే కాదు, ఆ సమాజం గురించి కూడా చర్చించాలి. నేటి తెలుగు కవిత్వంలో వస్తున్న సామాజికత అరుదైన నాగరిక భావనను సొంతం చేసుకున్నది ‘నాగస్వరం’.
‘కాలసర్పం’ కవితలో.. ‘త్రివర్ణ పతాకం ఊర్ధ్వవర్ణంలో/ మనువు రాసిన వాక్యంలా/ మహా వంకర్లు పోతుందీ కాలసర్పం’ అని వర్తమాన కాలతీరును కవి ప్రస్తావించారు. ఇది వలసవాద సంస్కృతీకరణకు వ్యతిరేకంగా విసిరిన నాగజాతి ఏకలవ్యుడి బాణం. మనుషులను మానవత్వం లేకుండా తయారు చేయడమూ వలసవాద సంస్కృతీకరణలో భాగమే. ‘ఒక మర్డర్ ప్లీజ్’ కవితలో.. ‘ఆకలిగా ఉన్న నా సెల్ఫోన్ కెమెరా కడుపుకు/ కొంచెం చావు కూడు తినిపిస్తారా?/… ఎవరు చస్తే నాకేంటి?/ ముందు నా వీడియో బతకాలి’ అని నేటి మనుషుల మనస్తత్వాన్ని, ఆధునికత పేరుతో మానవత్వం లేని మనుషులను కవిత్వీకరించారు. ఫ్రాంకోకు వ్యతిరేకంగా ‘రండి వీధుల్లో రక్తాన్ని చూడండి’ అంటారు నెరుడా. ప్రజాకవి గోరటి వెంకన్న.. ‘మనిషి క్రౌర్యాన్ని తొలగించేదిగా కవిత్వం ఉండాలి’ అంటారు.
సైబర్ వేటగాళ్లు సామాన్యుడి అమాయకత్వానికి ఆశలనే ఉచ్చును బిగించి, వారి స్వేద ఫలాన్ని, జీవితాలను దోచేస్తున్నారు. దీనిని ‘ఋణార్ణవం’ కవితలో.. ‘ఎవడో అపరిచితుడు/ కన్నుమూసి తెరిచేలోపు/ ఒక పచ్చని ఆశను ఎర వేసి/… సకుటుంబ సపరివారంపై/ కణకణ మండే/ నిప్పు కణికలను కుమ్మరిస్తాడు/ అసత్యాలతో పరువు బట్టలూడదీసి/ డిజిటల్ మైదానంలో/ నగ్న సందేశాలను లిఖిస్తాడు’ అని వర్తమాన సాంకేతికతతో జరిగే మోసాన్ని రికార్డు చేశారు. ఇందులోనే ‘నెత్తురు తాగిన కత్తినోటికి/ వెన్నపూస రాసి/ కన్నీరు నిండిన గాయంపై/ కారం చల్లే కులీన నాటకం/ ఇక చాలు ఆపండి..?’ అంటారు.
కోయి కోటేశ్వరరావు విమర్శకుడిగా నిర్మాణ మెలకువలు తెలిసిన వ్యక్తి కావడంతో వస్తుపరంగా ‘నాగస్వరం’ కవితా భవంతికి పునాది మొదలు నగిషీల వరకు అందంగా చెక్కి, ఆలోచనాత్మకంగా రాశారు. ఇది భాషగర్భితంగా, భావగర్భితంగా సాగిన సాంద్రమైన కవిత్వం. ఇందులో భావోద్వేగాలపై కంటే సామాజిక పరిశీలన, అనుభవాల వ్యక్తీకరణపై, ప్రశ్నించడంపై ఎక్కువ దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తుంది. చెప్పాలనుకున్న అంశంపై ఏ మాత్రం పక్కకు జరగకుండా కవి జాగ్రత్తపడ్డారు. విమర్శకులు, పరిశోధకులకు చాలా పని కల్పించారు. కవిలో విమర్శ కోణం, జీవితం, సాహిత్యం బలంగా పాదుకుని ఉన్నాయి. కొన్ని పదబంధాల నిర్మాణంలో మహాకవుల ప్రభావం ఉన్నా, వాటిని సొంత అభివ్యక్తికే ఉపయోగించారని కవిత్వం చదివితే స్పష్టంగా తెలుస్తుంది. ఈ కవిత్వం కొంత క్లాసిక్గా, ఎక్కువగా ఆధునిక అభివ్యక్తితో బలంగా ఉంటుంది. ‘శిలాక్షరం’ కవితలో చెప్పినట్టుగా ఈ ‘నాగస్వరం’ కవిత్వం.. ‘వర్ణరాజ్యం ముంగిట్లో/ నిలువెత్తు గాయంలా విస్తరించిన/ రక్తక్షేత్రంలో ఇన్నాళ్లకు/ ఒక వెలుగు రేఖ తొంగిచూసింది’.
కొందరి జీవితాల్లో కొంత కవిత్వం, మరికొందరి కవిత్వంలో కొంత జీవితం ఉంటుంది. కానీ, కోయి కోటేశ్వరరావు కవిత్వంలో మాత్రం అటు జీవితం, ఇటు కవిత్వం నిండుగా ఉంటుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం అత్యంత సాంద్రత, వేడితో విశ్వం ఆవిర్భవించినట్టుగానే ఈ కవిలో కూడా గూడు కట్టుకున్న బాధామయ జీవిత అనుభవాల సాంద్రత, సామాజిక అంతరాల పట్ల ఆక్రోశం అగ్నిపర్వత లావాలా పెల్లుబుకింది. ఆ లావాయే ‘నాగస్వరం’ అయ్యింది.
-శీలం భద్రయ్య, 98858 38288